5, సెప్టెంబర్ 2020, శనివారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అన్నదానం..ఆశీర్వాదం.

"రాబోయే ఆదివారం నాడు మేము అన్నదానానికి సరుకులు తెస్తాము..మా పేరుతో అన్నదానం చేయండి.."అన్నారా దంపతులు..వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా సార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు..అసలు వాళ్లు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచీ..అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది..

"పదేళ్ల క్రిందట మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము..అప్పటినుండి ప్రతి ఏడూ రెండుసార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్లడం అలవాటుగా మారింది..నాకు పెళ్ళైన ఆరేళ్ల దాకా పిల్లలు పుట్టలేదు..మా ఆయన నేనూ ఇక్కడికి వచ్చాము..ఆ స్వామికి మ్రొక్కుకున్నాము..ఇదిగో ఈ ఇద్దరూ స్వామి దయవల్ల పుట్టారు.." అని తన తొమ్మిదేళ్ల వయసున్న కూతురిని, ఏడేళ్ల కుమారుడిని చూపించింది సుశీలమ్మ..వాళ్ళది కనిగిరి దగ్గర పల్లెటూరు..

"వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకొస్తాము..ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాము కదా..ఈసారికూడా అన్నదానం చేయిస్తాము.." అని మళ్లీ గుర్తు చేస్తున్నట్లు చెప్పింది..సరే అన్నాను..

మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తువున్నాయి..సంతానం కోసం ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు..మందిరం లోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు..అప్పుడు నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఇక్కడ ఒక శనివారం కానీ ఆదివారం నాడు కానీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందీ.." అని అడిగారు..ఒక్కొక్కపూటకు సుమారు మూడు నాలుగు వందల మందికి సరిపడా అన్నదానం చేయాలంటే (ఇది పదేళ్ల క్రిందటి లెక్క..ఇప్పుడు ఒక్క శనివారం రాత్రికే సుమారు వెయ్యిమందికి తయారు చేయాలి) ఎంత అవుతుందో వివరంగా చెప్పాను..సరే నని తలవూపి వెళ్లారు..

ఆ తరువాత ఒక గంట గడిచింది..సుశీలమ్మ భర్త వచ్చి.."వచ్చే వారమే మేము అన్నదానం చేస్తాము..మీరు సరుకుల లెక్క ఇవ్వండి.." అన్నాడు..సహజంగా ఎవరైనా తాము కోరిన కోర్కె తీరిన తరువాత తమ మ్రొక్కు చెల్లించుకుంటారు..ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేస్తామని చెపుతున్నారు..నా మనసులో మాట గ్రహించారో ఏమో.."అయ్యా..నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను..కానీ తాను మాత్రం ఇప్పుడే చేయాలని పట్టు బడుతున్నది.." అన్నాడు..

"ఆదివారం మధ్యాహ్నం కనీసం మూడు నాలుగు వందల మందికి మనం ఆహారం అందిస్తే..ఆకలి తీరిన అంతమందిలో ఎవరో ఒక్కరన్నా మనలను తృప్తిగా దీవిస్తారు కదా..ఆ దీవెనలు..శ్రీ స్వామివారి ఆశీస్సులు.. ఫలించి మా కోరిక త్వరగా తీరుతుందేమోనని ఆశ!..మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితం అని చాలామంది ఇక్కడ అనుకోవడం విన్నాను..అందుకోసం వచ్చే వారం అన్నదానం చేద్దామని అనుకున్నాను.." అన్నది సుశీలమ్మ..

నిజమే అనిపించింది..ఎవరి ఆశీర్వాదం లో ఎంత బలమున్నదో ఎవరికి తెలుసు?..ఈ ఆలోచనకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడు..అనుకున్న విధంగానే ఆ పై వారం ఆ దంపతులు అన్నదానం చేశారు..

మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..ఇంకో రెండేళ్లకు కుమారుడు కలిగాడు..ఆ దంపతులు మాత్రం ప్రతిసారీ అన్నదానం చేయడం మర్చిపోలేదు..ఎప్పుడన్నా తమకు వీలులేకపోతే..ఒకటి రెండు వారాలు ముందుగానే వచ్చి..తాము అనుకున్న రోజుకు అన్నదానం జరపమని మాకు చెప్పుకొని వెళుతుంటారు..ఏనాడూ కూడా తాము అన్నదానం చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు..తాము పేరు కోసం చేయటం లేదనీ..తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామనీ చెప్పుకుంటారు..ఇలాటి ఆలోచన గల వాళ్ళు తక్కువ మంది ఉంటారు..

మందిరం వద్దకు వచ్చే అందరు భక్తులూ ఒక లాగా వుండరు..ఒక్కొక్కరివి ఒక్కక్క విధమైన ఆలోచనలు..అందరి కోర్కెలు తీర్చి..వాళ్ళ వాళ్ళ తాహతును బట్టి..ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్లకు అప్పచెప్పి..మధ్యలో మమ్మల్ని కర్తలుగా నిర్ణయించి..ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపిస్తుంటారు శ్రీ స్వామివారు..

సర్వం..
శ్రీ దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: