1, సెప్టెంబర్ 2020, మంగళవారం

రామాయణమ్. 48


..
అయోధ్య అంతా సందడిగా ఉన్నది ఎటుచూసినా పండుగే. ఎవరిని కదిలించినా రాముడి గుణగణాల ప్రస్తావనే.నేటినుండీ సుగుణాభిరాముడి పరిపాలనే! రామరాజ్యం కొన్ని ఘడియలలో ప్రారంభం కాబోతున్నది .
.
పగటిసమయంలో పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో రామచంద్రుడికి పట్టాభిషేకం.
.
బంగారుపాత్రలలో నదీ,నదముల జలాలు,నదీ సంగమస్థానజలాలు,నాలుగు సముద్రాలజలాలు,గంగోదకం నిండిన పాత్రలు ఇలా అన్ని రకాల జలములు సిద్ధం చేశారు.
వాటిలో పేలాలుపోసి,పాలచెట్ల ఆకులు,కమలాలు,కలువలు కప్పి బంగారు,వెండికలశాలు కూడా సిద్ధం చేశారు.
.
రామునికోసం సరికొత్తవింజామరలు,శ్వేతఛత్రము సిద్ధంచేయబడ్డాయి.
.
తెల్లటి వృషభము,తెల్లటి గుర్రము ,మదగజము ఆయనకోసం వేచివున్నాయి.
.
సకలాభరణభూషితలైన ఎనమండుగురు కన్యలు,అన్నివాద్యాలు,స్తోత్రపాఠాలు చదివేవారు ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నారు.
.
కైక ఇంటిలో ,రాముడుతండ్రి ఎదుట నిల్చొని ఉన్నాడు ఆయనకు సమీపంలో లక్ష్మణుడు కూడా నిలుచున్నాడు.
.
దశరధుడు రామునివంక చూశాడు ఆయన కళ్ళనిండా నీళ్ళునిండి ఉన్నాయి రాముడి రూపం అస్పష్టంగా కనపడుతున్నది .గొంతులోనుండి మాట రావడంలేదు అతి కష్డం మీద గొంతుపెకిలించుకుంటూ "రామా" అని మాత్రం అనగలిగాడు.
.
తండ్రి ఆకారం రాముడికి కొత్తగా ఉన్నది ! ఇంతకు మునుపెన్నడూ తానుపుట్టి బుద్ధెరిగిన తరువాత అటువంటి తండ్రి రూపము చూసి ఎరుగడు.ఆయన మనస్సులో తండ్రిగురించిన ఏదో భయం పొడసూపింది .పామును తొక్కినవాడివలే భయపడ్డాడు.
.
అంతకు ముందు ఎప్పుడైనా కోపంగా ఉండే తండ్రి తనను చూడగానే ప్రసన్నుడయ్యేవాడు ,హాయిగా నవ్వేవాడు ! నేడేమిటి? ఆయన కోపంగా లేడు కానీ నన్ను చూడగనే హాయిగా ఉండే ఆయన ఇలా ఇంత విచారంగా ఉన్నాడేమిటి?
.
మనసులో ఆ శంక పీడిస్తుండగా రాముడు దీనుడై ,ముఖకాంతి తగ్గినవాడయి ప్రక్కనేఉన్న పినతల్లి కైకకు నమస్కరించి ,తల్లీ నా వలన అపరాధమేదీ జరుగలేదుకదా! నాపై ఈయన ఎందుకు కోపించినాడు? నీవయినా ఆయనకు నా పట్ల అనుగ్రహం కలిగించమ్మా! అని వేడుకున్నాడు.
.
నా తండ్రికి కోపం వచ్చినచో ఆయనను సంతోషపెట్టకుండా ,ఆయన ఆజ్ఞను పాటించకుండా ఒక్క క్షణం కూడ జీవించి ఉండలేను .
.
పూర్వమెన్నడూ నేను ఎరుగని ఈ వికారము నా తండ్రిలో ఏల కలిగినది చెప్పమ్మా! అని ప్రాధేయపడినాడు.
.
అప్పుడు సిగ్గు,లజ్జ, మర్యాద అన్నీ వదిలిన కైక ఇలా పలికింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: