1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 7*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                       
                                      *****
            *శ్లో:- అమృతం సద్గుణా భార్యా*౹
                    *అమృతం బాలభాషితమ్* ౹
                    *అమృతం రాజసమ్మానమ్*౹
                    *అమృతం మానభోజనమ్*౹౹
                                        *****
*భా:- మనసులో మనసై , తలపులో తలపై, మాటలో మాటై, బాటలో బాటై , కష్టసుఖాల్లో, సుఖదుఃఖాలలో, భోగభాగ్యాలలో, భర్తకు తోడూనీడగా, చేదోడు వాదోడుగా, పాలలో నీరులా కలిసిమెలిసి ఓర్పు, నేర్పుగల రథసారథిగా సంసారంలో లోటు రానీయకుండా నడుచుకునే సుగుణాలరాశి, యైన భార్య అమృతముతో సమానము. నోరు తిరిగి, తిరగని వయసులో తడబాటు, తొందరపాటులో దొర్లే చిన్నపిల్లల ముద్దులొలుకు పలుకులు అమృతముతో సమానము. ఆ మాటలే అమృతపు మూటలుగా ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉల్లాన్ని పల్లవింపజేస్తాయి. వృత్తిలోగాని, ప్రవృత్తిలోగాని మన ప్రతిభా పాటవాలకు, అవిరళ కృషికి, మేథోమథనానికి గుర్తింపుగా సభలో జరిగే ఘన సన్మానము అమృతముతో సమానము. అది వేయి యేనుగుల బలమై, మరెన్నో విజయాలు సాధించడానికి ప్రేరణ నిస్తుంది. ప్రేమ , ఆప్యాయత, ఆదరణ , గౌరవము కలగలిపి, రంగరించి కొసరి కొసరి వడ్డించిన సాధారణ భోజనమైనా సరే అది అమృతముతో సమానము. పదార్థం కాదు. పెట్టే వారి ప్రేమాదరాలే అమృతమయము. అనుకూలవతి యైన భార్య, సత్సంతానము,చక్కని ఉపాధి,సరిపడా కూడు, గూడు, గుడ్డ ఉన్న గృహస్థుకు వేరే స్వర్గము, అమృతములతో పనే లేదని సారాంశము*.
                                   *****
                    *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: