1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*రామనామ మహిమ*



           
*రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది*

త్రేతాయుగంలోనే రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ.

ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా’ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది.

అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది, అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలంగా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది.

సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి రాములవారిని చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు.

అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను’ అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత రామ నామ గానం చేస్తూ, ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.

*సర్వేజనా సుఖినొభవంతు.*

ఇది సేకరణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: