1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మళ్ళీ జన్మంటూ ఉంటే.....



నాపేరు శారద. మేము ఉండేది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం. మా నాన్నగారు సోమయాజులు గారు దేవాదాయశాఖలో గుమాస్తా. నాకు ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు. మా నాన్నగారు మా నలుగురికి చక్కటి విద్యాబుధ్ధులు నేర్పించే ప్రయత్నం చేసారు. మా అన్నయ్యకు చదువు వంటబట్టలేదు. వరాహలక్షీనృసింహ స్వామి వారి దేవస్థానంలో (సింహాచలం దేవస్థానం) మానాన్నగారు తన పలుకుబడి ఉపయోగించి మా అన్నయ్యకు అటెండర్ ఉద్యోగం వేయించారు. నా ఇద్దరు అక్కలు ఇంజినీరింగ్ పూర్తి చేసారు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నాను.

మా పెద్దక్కకు పూనేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ, నా చిన్నక్కకు నొయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తితోనూ వివాహం జరిపించారు. నా అన్నయ్యకు సంబంధాలు చూస్తున్నారు. నేను ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను.

మా నాన్నగారికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. వలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవలసి వచ్చింది. నాన్నగారికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులో సగం డబ్బుతో ఒక ఇల్లు కొన్నారు. మిగిలిన డబ్బు నాన్నగారి వైద్యానికి, అన్నయ్య పెళ్ళికి, ఇంట్లో అవసరమైన సామాన్లు కొనటానికి దాదాపుగా ఖర్చు ఐపోయింది. నాన్నగారికి వస్తున్న పెన్సన్ తోనే ఇల్లు గడుస్తుంది. అన్నయ్యకు వివాహం ఐనప్పటినుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా, తన ఉద్యోగం, తన భార్య, తన సంపాదన తప్ప, అమ్మానాన్నలను నన్ను అంతగా పట్టించుకోవటం లేదు. నా చదువు అటకెక్కింది. నాకు వివాహం ఎలా జరిపించాలి అని రోజూ అమ్మానాన్న తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

సింహాచలం లో నివాసం ఉంటున్న మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు సోమనాథ శాస్త్రి గారు విషయం తెలిసి సతీసమేతంగా మా నాన్నగారిని పరామర్శించటానికి మా ఇంటికి వచ్చారు. ఆమాటా ఈమాటా మాటాడుకున్న తరువాత ఒక పైసా కట్నం తీసుకోకుండా నన్ను తమ ఇంటి కోడలిని చేసుకుంటాము అన్నారు. మాకు ఇబ్బందిగా ఉంటే పెళ్ళి ఖర్చులు కూడా తామే భరిస్తాము అని చెప్పారు. సోమనాథ శాస్త్రి గారు జ్యోతిష పండితులు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. వారి కూతురుకి ఈమధ్యనే సింహాచలం దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. వారి కొడుకు రామకృష్ణ శాస్త్రి. చిన్న వయసులోనే వాస్తు, జ్యోతిష్యం, మంత్రశాస్త్రములపై మంచి పట్టు సాధించాడు. బారసాల మొదలుకుని సహస్రచంద్రదర్శనం వరకూ ఏకార్యక్రమమైన చక్కగా శాస్త్రప్రకారం నిర్వహించగలడు అని మంచిపేరు కొద్దికాలంలోనే తెచ్చుకున్నాడు. చాలా నిరాడంబరుడు. ఎక్కడికైనా నడిచి కాని, సైకిల్ మీద కాని, బస్సుల మీద కాని వెళ్తాడు. పూర్వీకులు సంపాదించిన ఆస్థి తన తండ్రిగారి వాటాకు ఓ ఐదెకరాల పొలం వచ్చింది. రాకమృష్ణశాస్త్రి ఆపొలం లో స్వయంగా పంటలు పండిస్తున్నాడు.

మా నాన్నగారు నా ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు ఈవిషయం చెప్పారు. వారు ఎంతమాత్రం సమ్మతించలేదు. నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఎందుకు సరే అంటున్నావు కారణాలు చెప్పగలవా అని అన్నయ్య, అక్కయ్యలు నన్ను అడిగారు. అక్కయ్యలిద్దరూ దూరంగా ఉంటున్నారు, నేను అమ్మానాన్నలకు దగ్గరగా ఉండొచ్చు అని, ప్రస్థుత పరిస్థితులలో నాన్నగారు డబ్బు ఖర్చు పెట్టలేరని, నాన్నగారి చిన్ననాటి స్నేహితుని ఇంటికి కోడలిగా వెళ్తున్నాను కాబట్టి అవసరమైతే నా అత్తింటివారు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పాను. అలా నా వివాహం జరిగింది.

వివాహం జరిగి అత్తారింటికి వచ్చిన నాకు పుట్టింటికంటే ఆనందంగా ఉంది. అత్తమ్మ, ఆడపడుచు చాలా మంచివారు. రెండు మూడు రోజులకు ఒకమారైనా నన్ను పుట్టింటికి పంపుతున్నారు. మావారికి వరాహ పుష్కరిణిలో స్నానం ఆచరించి, భైరవకోనకు వెళ్ళి, భైరవస్వామివారిని దర్శించుకోవటం నిత్యకృత్యం. ఒకరోజు రాత్రి నిద్రపోయేముందు ఏవండోయ్ శ్రీవారూ! రోజూ మీరొక్కరే వెళ్తారా? నన్ను తీసుకుని వెళ్ళరూ అని అడిగాను. సరేనోయ్, రేపు ఉదయం 5 గంటలకు సిధ్ధంగా ఉండు, వెళ్దాం అన్నారు.

తెల్లారి నిద్రలేచి అత్తమామలకు చేయాల్సిన ఏర్పాట్లు చేసి ఐదు గంటలకల్లా సిధ్ధంగా ఉన్నాను. శ్రీవారు తయారై వచ్చారు. సైకిల్ ఎక్కి కూర్చేవే అన్నారు. హాండిల్ కి సీట్ కి మధ్య ఉన్న పైప్ మీద కూర్చున్నా. శ్రీవారు సైకిల్ తొక్కటం ప్రారంభించారు.

ఇంటి నుంచి పుష్కరిణి కి వెళ్ళటానికి పట్టిన సమయం దాదాపు 8 నిముషాలు. ఈ సమయంలో మాశ్రీవారికి, నాకు జరిగిన మధుర సంభాషణలు ఎన్నటికీ మరువలేను. పుష్కరిణిలో స్నానమాచరిస్తున్నప్పుడు నాకు శ్రీవారు జాగ్రత్తలు చెబుతూ ఉంటే నేను మావారి మీదకు నీళ్ళు విసురుతూ, మావారు నా తల మీద చెయ్యి వేసి నన్ను ముంచుతూ ఎంతగానో ఆనందించాము. స్నాన, సంధ్యాదులు ముగించుకున్నాక తిరిగి సైకిల్ ఎక్కి కూర్చున్నాను, కబుర్లు చెప్పుకుంటూ భైరవకోనకు వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంతకుముందు ఎన్నో మార్లు వరాహపుష్కరిణికి, భైరవకోనకు వెళ్ళినప్పటికీ ఈరోజు పొందిన ఆనందం ఎన్నటికీ మరువలేను. మావారిని నాకొక సైకిల్ కొని ఇస్తే కొన్ని కొన్ని పనులకు వెళ్ళటానికి అలానే నా పుట్టింటికి వెళ్ళటానికి నాకు సౌకర్యంగా ఉంటుందని అడిగాను. ఓ మంచిరోజు చూసి నాకు సైకిల్ కొని ఇచ్చారు.

రోజులు గడుస్తున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల పెంపకంలో శ్రధ్ధవహిస్తూ బిజీ ఐపోయాను. నా పెద్దకొడుక్కి సరస్వతీవిద్యామందిర్ లో చేర్పించాము. రోజూ నేనే సైకిల్ మీద తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర దించి తిరిగి వస్తున్నాను. ఇలా ఉండగా మా నాన్నగారు చనిపోయారు. అక్కయ్యలిద్దరూ వచ్చారు. చాలా బాధగా ఉంది. రాత్రికి ఆకలి వేస్తుంది. కాని భోజనం చేయాలని లేదు. పెద్ద బావ గారు వచ్చారు. పెద్దక్క కుటుంబం అంతా బయటకు వెళ్ళారు. పెద్దబావ గారు రెస్టారెంట్ కు తీసుకుని వెళ్ళారట. అక్కడ మా పెద్దక్క బాధతో ఏమీ తినలేదట. మా పెద్దబావ గారు, వారి పిల్లలు తినేసి వచ్చారట. చిన్నబావ గారి బంధువులు సింహాచలం లో ఉన్నారు. వారింటికి చిన్నక్క కుటుంబం వెళ్ళింది. చిన్నక్క కూడా చాలా బాధ పడుతుంది. ఒకటి రెండు మార్లు భోజనం చెయ్యమని చిన్నక్కను అడిగి తను తినటానికి ఇష్టపడకపోగా మిగిలినవారంతా తిన్నారట.

నేను మా ఇంటికి వచ్చాను. స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. ఆడపడుచు అప్పటికే వచ్చి వంట చేసి అత్తమ్మకు, మామగారికి, పిల్లలకు బోజనం పెట్టేసింది. శారదా బోజనం చేస్తావా? ఎప్పుడు తిన్నావో, ఏమిటో అంది. నువ్వు, మా తమ్ముడు మీరిద్దరే బోజనం చెయ్యాలి అంది. నా భర్త నాకోసం భోజనం చెయ్యకుండా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది. ఇంతలో నా శ్రీవారు, పిల్లలు, అత్తమ్మ-మామ గారు అంతా నేను-నా ఆడపడుచు ఉన్న గదిలోకి వచ్చారు. శారదా! బాధపడుతూ కూర్చుని తినకుండా ఉంటే నీరసం ఐపోతావే, తిను అంటూ అత్తమ్మ ప్రేమగా నా తలపై నిమిరి అన్నం ముద్దచేసి నా నోట్లో పెట్టింది., తరువాత నా ఆడపడుచు, నా పిల్లలు ఒక్కరొక్కరే ఏదో ఒకటి చెబుతూ నాకు అన్నం తినిపిస్తుంటే, లక్షలు కోట్లు సంపాదిస్తున్నా కనీసప్రేమాభిమానాలు లేని కుటుంబంలో ఉన్న నా ఇద్దరు అక్కలకంటే నేను ఎన్నోరెట్లు ధనవంతురాలినా అనిపించింది. మావారు, మా మామగారు రోజూ నా పుట్టింటికి వస్తూ అక్కడ జరపాల్సిన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. 10 వ రోజు కార్యక్రమం పూర్తి అయ్యాక అక్కయ్యలిద్దరు వెళ్ళిపోయారు.

మావారికి మంచి పేరుప్రఖ్యాతులు రోజు రోజుకూ వస్తున్నాయి. నేను రోడ్డు మీదకు వెళ్ళినప్పుడళ్ళా ఎవరో ఒకరు పలానా పురోహితుని భార్య అని నన్ను గుర్తిస్తూ పలకరించి మాటాడుతున్నారు. నా ముగ్గురు పిల్లలను అంతా ముద్దుచేసేవారే. ఎవరింట్లో శుభాకార్యం జరుగుతున్నా మొట్టమొదట పిలిచేది మా అత్తమ్మను, నన్నే. మావారి సంపాదన కూడబెట్టి ఇల్లు పెద్దగా కట్టించుకున్నాము. ఇప్పుడు మా ఇంటికి ఏసమయంలో నైనా ఓ పదిమంది అనుకోని అతిథులు వస్తే వారికి వసతి, బోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాము. మా ముగ్గురు పిల్లలూ ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు.

ఉదయం లేచి అత్తమామలకు కావలసినవన్నీ ఏర్పాటు చేసాను. శ్రీవారు పౌరోహిత్యానికి వెళ్ళారు. సైకిల్ కి ముగ్గురు పిల్లల పుస్తకాల సంచీలు తగిలించి, నా కూతురుని సైకిల్ మీద కూర్చుండబెట్టి సైకిల్ నడుపుతున్నాను. నా ఇద్దరు కొడుకులూ నడుస్తూ నా వెంట వస్తున్నారు. నా పిల్లలు చదువుతున్న స్కూల్ సరస్వతీ విద్యా మందిర్ ఎదురుగా ఉన్న రామాళయం వచ్చింది. పాపను సైకిల్ మీద నుంచి దించాను. పిల్లలు ముగ్గురూ తన పాదరక్షలు విడిచి రామాళయం లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తమ పాదరక్షలు ధరించి ఎవరి పుస్తకాల సంచీ వారు తీసుకుని స్కూల్ లోనికి వెళ్ళి పోయారు. సైకిల్ స్టాండ్ వేసి రామాళయం లోనికి వెళ్ళి స్వామీ! సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీరామచంద్రా! నాకు ప్రసాదించిన ఈ అదృష్టం చాలు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక పురోహితునికి కూతురుగా, ఒక పురోహితునికి భార్యగా, ఒక పురోహితునికి తల్లిగా. ........... జన్మించేటట్టు అనుగ్రహించు అని అర్ధించి, దేవాళయం బయటకు వచ్చి, నా సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాను.

కామెంట్‌లు లేవు: