1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ధర్మసందేహం

*ధర్మసందేహం - సమాధానం*

సందేహం;- దర్భలకు ఎందుకు అంత ప్రాధాన్యత? వాటిని ఎవరు సృష్టించారు?

సమాధానం;- 
*కుశ మూలే స్థితో బ్రహ్మ,*
*కుశమధ్యే జనార్ధనః*
*కుశాగ్రే శంకరో దేవః*
*త్రయోదేవా కుశేస్థితాః*

ధర్బల మొదలులో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, చివరి భాగంలో శివుడు ఆవాహనమై ఉంటారు. అందుకే దర్భ అనేది త్రిమూర్తుల స్వరూపం.

దర్భలను బ్రహ్మదేవుడు సృష్టించాడు. హిందూ ఆచార సంప్రదాయాలలో దర్భలను పవిత్రంగా వాడతారు. వీటిని *కుశలు* అని కూడా అంటారు.

గరుత్మంతుడు తన తల్లి దాసీతనాన్ని తొలగించటానికి దేవ లోకం నుంచి అమృతకలశం తెచ్చి దర్భల మీద పెట్టి కద్రువ పుత్రులకి చూపించి, తన తల్లిని దాసీతనం నుంచి విముక్తి చేయండి అని కోరతాడు. అలా అమృతభాండం స్పర్శ వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. అందువల్లే సమస్త దేవ, పితృ కార్యాల్లో దర్భలు అంతటి ప్రాముఖ్యతను, అర్హతను పొందాయి.

కాలువల ఒడ్డున ఈ గడ్డి పెరుగుతుంది. పచ్చివిగా ఉన్నవాటికంటే ఎండిన దర్భలనే వాడతారు. ఆచార సంపన్నులు దర్భ ఆకారంలో ఉండే ఉంగరాన్ని దర్భాంగుళీయకాన్ని బంగారంతో తయారుచేసి పుణ్యకార్యాలలో వాడతారు. దర్భలు తీసుకొని సంకల్పించి మంత్రజలంతో వాటిని అస్త్రాలుగా మునులు ప్రయోగించారు.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: