మానవుడిపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. అయితే జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సమస్యలను నుంచి బయటపడేందుకు, ఉపశమనం పొందేందుకు శాంతి మార్గాలను అన్వేషించాల్సిందే. నిజానికి గ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం, ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించాలి.
అయితే జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలలో రవి ఈశ్వరారాధన చేస్తారు. చంద్రుడు గౌరీ ఉపాసకులు. కుజ దిశ సుబ్రహ్మణ్యం అధిదేవత అని, బుధుడికి విష్ణువు ఆరాధ్య దైవము అని, గురువుకు శివుడు, శుక్రుడికి లక్ష్మీ ఉపాసన, శనికి శివారాధన, రాహువుకు దుర్గ, కేతువుకు గణపతి అని చెప్పబడింది. దీని ఆధారంగా వివిధమైన విధానాలు పెద్దలు, మహర్షులు వ్యవస్థ చేశారు.
శ్రీమహావిష్ణుమూర్తి సృష్టి పరిపాలకుడు. ఆయన పరిపాలనకు గాను తన అనుచరులుగా ఈ నవగ్రహాలను ఉంచారు. అందువల్ల సృష్టి పాలకులయిన హరిహరులను నిత్యం అర్చించడం నవగ్రహాలకు యధోచిత సేవ చేయడం చాలా మంచిది. నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేయడం వంటివి అవసరం. ఇది కనీస శాంతి మార్గము.
సాధారణంగా ఆరోగ్య సమస్యలు నడిచే విషయంలో సూర్య నమస్కారాలు అరుణ పారాయణ చేయించడం ఒక విధి. రవి దశ, గురు దశ, శని దశ, కేతు దశ నడిచేటప్పుడు ఇది బాగా పని చేస్తుంది. చంద్రగ్రహం వలన వచ్చే ఆరోగ్య సమస్యలకు సూర్య నమస్కారాలతోపాటు దుర్గా అనుష్ఠానం చేయించాలి. అలాగే కుజ దశ నడిచే సందర్భంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ దశ విషయంలో లక్ష్మీనృసింహానుష్ఠానం, శుక్ర దశలోనూ కేతు దశలోనూ లక్ష్మీ నృసింహానుష్ఠానం, శనితో సంబంధంగా ఆరోగ్య సమస్యలు వున్నప్పుడు మృత్యుంజయ జపం, రాహువుతో సంబంధంగా ఆరోగ్య సమస్యలకు దుర్గా అనుష్ఠానం మంచిది. అలాగే మృత్యుప్రదం అయిన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధించే సమయంలో నిత్యం ‘మృత్యుంజయ పాశుపతం’ చేయించాలి.
వివాహము ఆలస్యం
వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం, చంద్రుడితో దోషం ఉన్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం మరియు సుబ్రహ్మణ్య పూజలు చేయడం, బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం, గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం. శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.
శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం, రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ, ఇంకా లలితా సహస్ర పారాయణ చేయడం, కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శుభకరం.
అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు. గ్రహ సంబంధమైన ఏ విధమైన దోషం ఉన్ననూ నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణలు 11 చేసి అనంతరం శివుడికి 11 ప్రదక్షిణలు చేసి శివసన్నిధిలో విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభం. దీనికి కారణం సృష్టి పరిపాలకులు గ్రహ గమన నిర్దేశకులు హరిహరులు సంతృప్తి పొందితే సత్వరం శుభ ఫలితాలు ఉంటాయి. పై శాంతి చేయించడం ద్వారా జాతకంలో రాసి వున్న వివాహ దశలు కాలం మారవు. ప్రయత్నాలలో అవరోధాలు చికాకులు తొలగుతాయి.
ఇక విద్యా విషయంగా పరిశీలిస్తే రవి దోషంగా ఉంటే అనుగ్రహం కావలసి వచ్చినను గురు శని విషయంలో కూడా దక్షిణా మూర్తి ఆరాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుంది. చంద్రగ్రహ విషయంలో బాలానుష్ఠానం, కుజ గ్రహ విషయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, బుధ గ్రహ విషయంలో హయగ్రీవోపాసన, శుక్రగ్రహ విషయంలో హయగ్రీవోపాసన, రాహు గ్రహ విషయంలో బాలామంత్రానుష్ఠానం, కేతువు గ్రహ విషయంలో శ్రీవిద్యా గణపతి అనుష్ఠానం చెబుతారు. అయితే ‘ఈశానస్సర్వ విద్యానాం’ అనే వేద వాక్యం ఆధారంగా ‘ఓం నమశ్శివాయ’ శివ షడక్షరీ మంత్రానుష్ఠానం దీక్షగా మెడిటేషన్ చేసిన వారికి విద్యా విజ్ఞాన యోగం తప్పక లభిస్తుంది.
పిల్లలు సరిగా మాట వినకపోయినా, సరైన దారిలో లేకున్నానూ, విద్యా ఉద్యోగ వివాహ విషయములలో సమస్యలతో ఉంటే.. శ్రీరామ శ్శరణం మమ’ అని 108 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి ప్రతిరోజూ చేయడం ద్వారా తల్లిదండ్రులు సత్ఫలితాలు అందుకుంటారు.
ఉద్యోగ విషయంలో రవి గురు శని దోషం ఉంటే పాశుపతి అభిషేకం చేయించి ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేయాలి. చంద్ర శుక్ర రాహు దోషం ఉంటే చండీ సప్తశతీ పారాయణ, కుజగ్రహ దోషం ఉంటే సర్పసూక్తంతో అభిషేకం, బుధ కేతు గ్రహ దోషం ఉంటే లక్ష్మీ గణపతి అనుష్ఠానం శ్రేయస్కరం.
సంతానం కొరకు పురాణాలలో చాలా విశేషములు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ వ్యాస మహర్షి మొదలగు వారు సంతానం కొరకు శివారాధన చేసినట్లు పురాణాలలో చెప్పబడింది. సంసారంలో చికాకులు తొలగి భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుటకు ‘శివకామేశ్వరాంకస్టా శివాస్వాధీన వల్లభా’ అనే వాక్యం లలితా సహస్రంలో ప్రతి శ్లోకానికి ముందు వెనుక చెప్పి మూడు కాలాలతో చేయుట ద్వారా మంచి ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి.
స్నానాలు కూడా..
గ్రహ దోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలు కూడా ఉన్నాయి. కుంకుమ, ఎర్ర చందనం కలిపిన రాగిపాత్రలోని నీటితో స్నానం చేయడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ - గంధం కలిపిన నీటిని 'శంఖం'తో పోసుకుంటే చంద్ర గ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం, తిలలు కలిపిన 'రజిత పాత్ర'లోని నీటితో స్నానమాచరించడం వలన కుజ దోషాల బారినుంచి బయటపడ వచ్చును.
ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టిపాత్రలో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి, మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ 'రజిత పాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇక నువ్వులు, మినువులు కలిపిన 'లోహపాత్ర'లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు.. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి