1, సెప్టెంబర్ 2020, మంగళవారం

రేడియో అక్కయ్య తురగా జానకి రాణి

*నేడు..రేడియో అక్కయ్య తురగా జానకి రాణి
గారి.. పుట్టిన రోజు..!!

*చలం భక్తులందరూ….”ఉన్మాదులా?.”..
తురగా జానకి రాణి.!!

చలం కాముక స్వేచ్ఛ ..మానవ స్థాయి నుంచి
" పశు "‘ స్థాయికి దిగజారింది !!

చలం మనవరాలు ,ప్రముఖ రచయిత్రి,స్వర్గీయ
తురగా జానకి రాణి గారి మాటలివి.
తన పుస్తకం “ మా తాతయ్య చలం “ (పే 66 ,67 )
లో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది.
చలం తాత గురించి తనలో అంతర్గతంగా గూడుకట్టుకున్న విషయాల “ గుట్టు “ విప్పింది.
తురగా అభిప్రాయం పట్ల చలం గారి వీరాభిమానులు
బాధ పడొచ్చు గానీ, ఆమె మాత్రం
తాను చెప్పిన విషయాలను ఉదాహరణలతో సహా సవివరంగా వివరించింది.

నిజానికి ఆమె కూడా చలం భక్తురాలే.చలం
సాహిత్యం చదివింది.చలం గారిని ప్రత్యక్షంగా
చూసింది.మాట్లాడింది. చలంగారికి ఉత్తరాలు
రాసింది .జవాబులు పొందింది.చలం గారిది
సంబంధం, సన్నిహితత్వం,కొనసాగించింది…
అయినా ఆయన గురించి థన అభిప్రాయాల్ని
మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

 *చలం గారి కాముక స్వేచ్ఛ …!!

“ చలం బతుకు ఏదో ఒకటి అయింది.ఆయనను
నమ్ముకున్న వాళ్ళ బతుకులు ఏదో ఒకటి
అయినాయి.ఆ మార్గం మనకు అనుసరణీయం
కాదు.నా చదువు,నా పెళ్ళి,నా సంపాదన,
నా ఆర్థిక సామాజిక కష్ట సుఖాలు ..
యివన్నీ ఆయన పద్ధతికి ఎన్నో యుగాలు
 దూరం .వాటితో ఏవిధమైన ఆచరణాత్మక
సంబంధం పెట్టుకునే. అవసరం లేదు.అని
నాకు 1960 లోనే స్పష్టమైంది.

ఆయన బోధించిన కాముక స్వేచ్ఛ నాకు పరమ
రోత కలిగించింది .అది మానవ స్థాయి నుంచి
పశు స్థాయికి దిగడం అని నా చిన్న బుర్రకు
తోచింది! ” అంటూ జానకి రాణి తన మనసులో
మాటను బయటపెట్టింది.

అంతే కాదు చలం గారుఒక చెల్లెలి కూతురుతో
ఇలా అన్నారట...అంటూ తన అనుభవంలోని
విషయాన్ని ఇలా ….ఉదాహరణగా చెప్పింది.!!

 “ఒసే..వాడు ఎర్రగా వున్నాడు.వాడితో పోతే నీకు
ఎర్రని పిల్లలు పుడతారు “ అని. ఆమె ఆ పనే
చేసింది.ఆమెకు ఒక కూతురు,కొడుకూ పుట్టారు.
వారు మహమ్మదీయులో, హిందువులో తెలీదు.
కొన్నాళ్ళు ఆపేర్లు..కొన్నాళ్ళు ఈ పేర్లు పెట్టు
కున్నారు.ఆ పిల్లల తండ్రి పాకిస్తాన్ కు వెళ్ళిపోయి
నాడు.ఈమెకి ఆనాటి హైదరాబాదు ప్రభుత్వంలో
ఏదో ఉద్యోగం దొరికింది.సంపాదించి,పిల్లల్ని
పెంచుకుని ,పెళ్ళిళ్ళు చేసి ,యిల్లు,మేడలు
కట్టుకొని బతుకుతోంది.ఆయన (చలం గారు )
ఎంతబాధ్యతా రహితమో ,దాన్ని ఆచరణలోకి
పెట్టిన ఆమెది ఎంత బేలతనమో నేను. 
గుర్తించాను.అందరూ గుర్తించి ఆయన సహేతుకతని చీల్చాలిగా..!”.(పే66.మా తాతయ్య చలం )

  ఇదీ చలం గారి సిద్ధాంతాలపై జానకి రాణి గారి
  వివరణ.
 
 చలం గారికి దేశభక్తి లేదా ?

చలం గారికి దేశభక్తి అంటలేదు.మాతృభక్తి లేదు. సోదర,సోదరీ ప్రేమ ఎంతవరకున్నదో తెలీదు.
తన గొడవ తనది అనిపిస్తుంది అంటారు జానకి రాణి.

‌శ్రీశ్రీ మహాప్రస్తానానికి రాసిన యోగ్యతా పత్రంలో
 “దేశభక్తి మహా పాపం అంటారు చలం.

“ కవిత్వంలోనూ.! Economy of Words and
 Thoughts లేకపోవడం దేశభక్తి కన్న హీనమైన
 పాపం.ఆత్మ లోకంలో దివాళా “ 

అయితే ఇలా మాట్లాడటం చలం గారికి మొదటి
సారేం కాదు. మ్యూజింగ్స్ లో కూడా ఇదే రకమైన
అభిప్రాయం వచ్చేట్లు “ దేశభక్తి అన్నది వెధవల
 అథమ లక్షణం “ అన్నాడు.దీన్ని బట్టి దేశభక్తి
పాపంగా, హీనంగా భావించడం చలం గారికి
అలవాటే అని తెలుస్తోంద

ఈశ్వర భక్తిలో పడ్డ వాళ్ళు ప్రశాంతిని పొందగలిగారు.
ప్రశ్న లేకుండా అర్పణ చేహసుకొని ,చిదా
నందానికి చేరువైనారు.తన రచనలతో ఈశ్వరుణ్ణి చేరుకోవాలనే చూశాడు.అనుకున్న శాంతి దొరికిందో
లేదో ,తను లోకం పై గుమ్మరించిన లక్షల అక్షరాలు వెలుగుదీపాలై యితరులకి దారి చూపాయో,నిరాశా నిస్పృహకీలలై బూడిద చేశాయో తెలియదు.

చలం భక్తులు..ఉన్మాదులా ?

“చలం పేరు మీద కలుసుకుంటూ పిచిక,నెమలి ,ఆవుదూడలను గురించి,పెంచిన పిల్లలు,వారి
పిల్లలూ,ఇసుక గూళ్ళు గురించి చలం చుట్టూ
 వున్న పరిసరాలువాటిలోని నవ్యత,చమత్కారం,
గురించి పదే పదే చెప్పుకుంటున్న భక్తులందరూ…,
మరో మాటలో ఉన్మాదులందరూ గుర్తించ
వలసింది ఒకటుంది. ఆ రొమాన్స్ ను మించి ,
ఆయన తత్వం,సిద్ధాంతం,బోధన , జీవన శైలీ
వున్నాయి.వాటిని అనుకరించగలమా? ఆ సాహసం మనకుందా? అనుకరిస్తే మనం లాభ పడ
తామా?,వ్యక్తిగతంగా సుఖం,శాంతి,పొందుతామా?
అని ఆత్మ వివేచన చేసుకోవాలి.” అన్నది
జానకి రాణి గారి అభిప్రాయం.!!

ఎ.రజాహుస్సేన్.!!

కామెంట్‌లు లేవు: