1, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

*శ్రీమాత్రేనమః*

**

*658వ నామ మంత్రము* 1.8.2020

*ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః*

ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కృపాకటాక్షములచే ఆత్మానందానుభూతి ప్రాప్తించి సత్యమైన, నిత్యమైన ఆనందములో జీవనము గడుపుదురు.

పరమేశ్వరి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నాము. అమ్మవారి స్వరూపమునందు శిరస్సు ఇచ్ఛాశక్తి కాగా, కంఠమునుండి కటివరకూ జ్ఞానశక్తి, కటి నుండి పాదముల వరకు క్రియాశక్తి.

85వ నామ మంత్రములో *శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా* అని స్తుతించుతాము. అనగా పరమేశ్వరి ముఖపంకజము (శిరస్సు) వాగ్భవకూటము (పంచదశిలో మొదటి ఐదు బీజాక్షరములు) అని భావము.

86వ నామ మంత్రములో *కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ* అని స్తుతిస్తాము. అనగా కంఠమునుండి దిగువన కటి పర్యంతము మధ్యకూటము అనగా  కామరాజ కూటము (పంచదశిలో మధ్యనున్న ఆరు బీజాక్షరములు) అని భావము.

87వ నామ మంత్రములో *శక్తికూటైకతాపన్న కట్యనోభాగ ధారిణీ* అని స్తుతిస్తాము. అనగా కటి నుండి పాదముల వరకు శక్తి కూటము (పంచదశిలోని చివరి నాలుగ బీజాక్షరములు)

88వ నామ మంత్రములో *మూల మంత్రాత్మికా* అని శ్రీమాతను స్తుతిస్తాము. అనగా పదునైదక్షరముల పంచదశాక్షరీ మంత్రమే ఆత్మస్వరూపము అని భావము.

89వ నామ మంత్రములో *మూలకూటత్రయ కళేబరా* అని స్తుతిస్తాము. అనగా పంచదశాక్షరీ మంత్రములోగల వాగ్భవ, కామరాజ, శక్తి కూటములుతో ఏర్పడిన శరీరము గలదని భావము.

ఈ విధంగా *ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ* అను నామ మంత్రముతో సమన్వయించు కోవచ్చును.

శ్రీచక్రంలోని బిందువు దగ్గర త్రిభుజ త్రికోణాలవద్ద ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అను ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని.

ఏదైనా పనిచేయాలనుకొనే సంకల్పమే ఇచ్ఛాశక్తి అంటారు. ఆ సంకల్పించిన పనిని ఏవిధంగా చేయాలి అనేది జ్ఞానశక్తి. సంకల్పించిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం క్రియాశక్తి. విశ్వములు సృష్టించునఫుడుగాని, మానవుడు ఏదైనా కార్యము నిర్వహించునప్ఫుడు గాని ఈ మూడు శక్తులూ వాటంతట అవే జరిగిపోతాయి. అటువంటి శక్తినిచ్చేదే ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్థి, క్రియాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు.

అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు
*ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః* అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: