1, సెప్టెంబర్ 2020, మంగళవారం

గణపతి వైభవం:-6



🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

*శమంతకోపాఖ్యానం:-1*

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
#గణపతి #గణపతివైభవం #వినాయకుడు #వినాయకచవితి
వినాయకచవితి వ్రతకధలో ముఖ్యమైంది శమంతకోపాఖ్యానం.
వినాయకచవితి సందర్భంగా పుస్తకాలలో ప్రచురిస్తున్న కధలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఫలితంగా ఆ కధ విన్నా, అసలు ఫలితం రాదు. ఇప్పుడు మనం విష్ణు, స్కాందపురాణాలలో చెప్పబడిన అసలు కధ గురించి విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వినాయకచవితి నాడు చంద్రదర్శనం చేసినవారు నీలాపనిందల పాలవుతారని గణపతి శాపం అలానే ఉంది. అది ద్వాపర యుగం. సత్రాజిత్తు, ప్రసేనుడు అన్నదమ్ములు, ద్వారకలో ఉంటారు. సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. విష్ణుపురాణం ప్రకారం సత్రాజిత్తుకు సూర్యభగవానుడు మిత్రుడు. సత్రాజిత్తు సముద్రం వద్దకు వెళ్ళి సూర్యుడితో కాసేపు మాట్లాడుదామని పిలిస్తే సూర్యుడు వచ్చాడు. సూర్యుడంటే మాములువాడు కాదు. పెద్ద వెలుగు, దాంతో పాటు మెడలో శమంతకమణి. అందువల్ల సత్రాజిత్తుకు సూర్యుడి రూపం కనిపించలేదు. నాకు నీ రూపం కనిపించడంలేదు అని సత్రాజిత్తు అనడంతో సూర్యుడు ఆ శమంతకమణిని తీసి సముద్రపు ఒడ్డున పెట్టి, తన తేజస్సును తగ్గించికొని, ఆయనతో కాసేపు కబుర్లు చెప్పాడు. దేవతలను పిలిస్తే వరం ఇవ్వకుండా వెళ్ళరు. వెళ్ళకూడదు. అది వారికి ఉన్న నియమం. వినాయకచవితినాడు పూజించే వరసిద్ధివినాయకుడు కూడా వరాలు ఇచ్చే వెళతాడు.

అందువల్ల సూర్యుడు నీకు ఏమి వరం కావాలో అడుగు, ఇస్తానన్నాడు. శమంతకమణి సూర్యబింబంలా మెరసిపోతోంది. ఆ మణి కావాలన్నాడు సత్రాజిత్తు. సరే ఇస్తున్నా అన్నాడు సూర్యుడు. అది మెడలో వేసుకుంటే దాని కాంతివలన అందరు నిన్ను సూర్యుడిగా భావిస్తారు. కానీ ఆ మణిని పవిత్రంగా మాత్రమే ధరించాలి అన్నాడు (మణి, మంత్రము, ఔషధము స్వార్ధానికి వాడుకోకూడదు. మణి ఎవరికైన పనికొస్తుందంటే ఇవ్వాలి. మంత్రము ఎదుటివారు బాగుపడడం కోసం ఉపదేశించవచ్చు. ఔషధం డబ్బు ఇవ్వలేదని అని అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వకుండా ఉండకూడదన్నది శాస్త్రం). 

ఈ మణి రోజుకు 8 బారువుల బంగారం పెడుతుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు రావు, కరువు ఉండదు, ప్రమాదాలకు తావు ఉండదు అంటూ సూర్యుడు మణి గురించి వివరించాడు. ఈ మణిని ధరించాలి అంటే శారీరిక శౌచము (శుభ్రత), మానసిక శౌచము (కుళ్ళు, అహంకారము అసూయ, ద్వేషము, పరనింద వంటివి లేకుండా ఉండడం అవసరం. అలాగే నిజాయతి ఉండాలి) ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉదహరణకు ఒకవేళ శరీర అవసరాల దృష్ట్యా మూత్రవిసర్జన చేయాల్సి వస్తే, ముందు ఈ మణిని మెడలోనుండి తీసి పక్కన పెట్టి, విసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఆచమనం చేసి, ఆ తరువాతే ధరించాలి. "ఒకవేళ మానసికంగా కానీ,శారీరికంగా కానీ శౌచనికి భంగం ఏర్పడితే, ఆ సమయంలో ఇది ధరించి ఉంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అప్పుడు ఈ మణి ప్రాణాలను తీస్తుంది". అందువల్ల జాగ్రత్త మిత్రమా! అంటూ ఆ మణిని సత్రాజిత్తుకు వరంగా ఇచ్చాడు సూర్యుడు. 

సత్రాజిత్తు ఆ మణి మీద వ్యమోహంతో తీసుకొని మెడలో వేసుకున్నాడు. అది ధరించగానే ఆయన మనసులో కృష్ణుడు ఈ మణిని అడుగుతాడేమో, దొంగిలిస్తాడేమో అనే చెడు భావన కలిగింది. ఆయన ద్వారకకు చేరగా, ఆ మణిని ధరించి వస్తున్న సత్రాజిత్తును చుసిన ప్రజలు సూర్యుడే వస్తున్నాడని తలచి, అలాంటివారు కృష్ణదర్శనం కొసమే వస్తారని, ఈ విషయాన్ని కృష్ణునకు చెప్పారు.

ఈ శమంతకోపాఖ్యానం అనునది విష్ణు, స్కాంద పురాణంలో వివరించబడింది కాలక్రమేణా రచయితలు, పండితులు వివిధ మార్పులు చేయటం జరిగింది. యదార్థ కధను మీకు అందచేయాలని మా కోరిక.కొనసాగింపు తరువాత పోస్టు లో
సశేషం
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: