1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*అన్నదానం.మహిమా..*

   
     
*కోటి గోవుల దాన ఫలితంతో సమానం!* 🙏🙏🙏🙏🙏

విదర్భ రాజ్యాన్ని సుదేవుడి కుమారుడు శ్వేతుడు పాలించేవాడు. గొప్ప తపస్సంపన్నుడైన శ్వేతుడు ధర్మబద్ధంగా పాలించి తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు. అతడు మరణించిన తర్వాత విష్ణువు సేవకులు వచ్చి స్వర్గానికి తీసికెళ్లారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కానీ, అన్ని సుఖాలున్నా ఆకలిబాధ మాత్రం అతడిని వెంటాడింది. స్వర్గంలో ఉండేవారికి ఆకలి తెలియదు. ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కానీ శ్వేతుడికి స్వర్గ లోకంలో కూడా క్షుద్బాధ తప్పలేదు. ఈ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లి.. నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కానీ నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగలిన వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు.

శ్వేతుడి మాటలు విన్న బ్రహ్మ.. రాజా! నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికికి వచ్చావు. కానీ, ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలగడానికి కారణం నువ్వు ఎవరి ఆకలి బాధను తీర్చలేదు. ఎవరికైనా కనీసం పట్టెడు అన్నం పెట్టలేదు. దాహంతో అలమటించిన వారికి చుక్క నీరు కూడా ఇవ్వలేదు. దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే ఇది నిన్ను ఇప్పుడు బాధిస్తోంది.. దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావని అన్నాడు.

దీనికి మార్గం లేదా? బ్రహ్మదేవా.. నన్ను రక్షించండని శ్వేతుడు వేడుకున్నాడు. నువ్వు భూలోకం వెళ్లి నీ పార్దివకాయం ఎక్కడుందో వెతికి, దానిని రోజూ కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకో... నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్లీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదని అన్నాడు బ్రహ్మ. అలా నేను ఎంతకాలం తినాలని మళ్లీ సందేహంతో అడగ్గానే అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి పలకరించేవరకు తింటూనే ఉండాలని విధాత బదులిచ్చాడు.

బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు భూలోకం వెళ్లి తన శవాన్ని వెతికి రోజూ ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్లేసరికి ఆ భాగం మళ్లీ అలాగే ఉంటుంది. అది కూడ కుళ్లిపోకుండా, మనిషి నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అటువైపుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడకు వచ్చి శ్వేతుడిని పలకరించాడు. అంతట ఆగస్త్య మహర్షిని చూసి మహాత్మా! నా జన్మ ధన్యమైంది.. నా ఆకలి బాధ తీరింది. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్లిపోయాడు.

దీనిని బట్టి ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. 1000 ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.
 🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: