1, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

*శ్రీమాత్రేనమః*

**

*81వ నామ మంత్రము* 1.9.2020

*ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః*

జీవుని అస్థిత్వమునకే ముప్ఫు కలిగించే అజ్ఞానము, అసురీభావములకు ప్రతీకలైన భండాసురుడు మరియు భండాసురుని సైన్యమును పాశుపతాస్త్రము నుండి వెలువడిన అగ్నిచే భస్మీపటలము కావించిన జ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు అజ్ఞానము, అసురీభావములు దరిజేరకుండా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై జగన్మాతను సేవించి తరించును.

భండాసురుని సైన్యము శక్తిసేనల పరాక్రమానికి లొంగి నశిస్తున్నారు. ఇంకను భండుడు, మరికొంతమంది పరాక్రమశాలులైన రాక్షసులు జగదాంబను ప్రతిఘటిస్తున్నారు. వారు విభిన్న అస్త్రములను ప్రయోగిస్తుంటే, జగన్మాత మంత్రపూర్వకమైన ప్రత్యస్త్రములతో వారిని నిలువరిస్తున్నది. ఇక ఏమాత్రము జాగుచేయకుండా యుద్ధము ముగించాలని అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని భండుని సైన్యముపై మంత్రపూర్వకంగా ప్రయోగించింది. మరుక్షణమే భండాసురుడు, అతని సైన్యము, భండుని నగరము పూర్తిగా భస్మీపటలమైనది.

పాశుపతాస్త్రములు రెండు రకములు. ఒకటి పాశుపతాస్త్రము అయితే రెండవది మహాపాశుపతాస్త్రము. ఇవి మంత్రపూర్వకమైన అస్త్రములు పాశుపతాస్త్రమునకు గల మంత్రము షడక్షరి అనగా ఆరక్షరములు గల మంత్రము. దీనికి అధిదేవత శివుడు. మహాపాశుపతాస్త్రమునకు గలమంత్రము పదునాలుగక్షరములు గలిగినది. దీనికి సదాశివుడు అధిదేవత. మహాపాశుపతాస్త్రము మహా ప్రభావవంతమైనది అగుటచే పరమేశ్వరి భండాసురుడు, అతని సైన్యము, అతని నగరమును భస్మీపటలము కావించుటకు మహాపాశుపతాన్ని ప్రయోగించి, శత్రుసేనలను నిర్మూలించినది. 

అజ్ఞానము, రాక్షసత్వము పెరిగిపోయి, పుణ్యకార్యము లొనరించే వారికి, అమాయకులకు అపకారం జరిగేసమయంలో, భండుడనే మహా అజ్ఞానమును తుదముట్టించడానికి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారు మహాపాశుపతమనే అస్త్రాన్ని ప్రయోగించి జీవులను కాపాడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 770209

0319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: