1, సెప్టెంబర్ 2020, మంగళవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*20.17 (పదిహేడవ శ్లోకము)*

*వింధ్యావలిస్తదాఽఽగత్య పత్నీ జాలకమాలినీ|*

*ఆనిన్యే కలశం హైమమవనేజన్యపాం భృతమ్॥7077॥*

అప్పుడు బలిచక్రవర్తి యొక్క భార్యయైన వింధ్యావళి ఒక బంగారు కలశముతో వచ్చెను. ఆమె ముత్యాలహారములచే అలంకృతయై ఉండెను. ఆమె పాద ప్రక్షాళనకు యోగ్యమైన సుగంధపూరిత జలములను కలశముతో తీసికొని వచ్చెను.

*20.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*యజమానః స్వయం తస్య శ్రీమత్పాదయుగం ముదా|*

*అవనిజ్యావహన్మూర్ధ్ని తదపో విశ్వపావనీః॥7078॥*

బలిచక్రవర్తి స్వయముగా మిగుల సంతోషముతో భగవానుని పాదయుగమును కడిగెను. లోకపావనమైన ఆ పాద తీర్థమును తన శిరస్సుప చల్లుకొనెను.

*యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామోఽస్మి సోఽహం దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశప్తోఽపి దైత్యః|*

*వింధ్యావల్యా నిజదయితయా దత్తపాద్యాయ తుభ్యం చిత్రం చిత్రం సకలమపి స ప్రార్పయత్ తోయపూర్వమ్॥5॥*

"ఆచార్యా! శ్రీమన్నారాయణుడే నన్ను యాచించినచో నేను నిజముగా కృతార్థుడనైతిని. అందువలన తప్పక అతనికి దానమిచ్చి తీరెదసు" అని తన దృఢనిశ్చయమును ప్రకటించెను. అంతట శుక్యాచార్యుడు బలిని శపించెను. ఐనప్పటికిని బలిచక్రవర్తి తన భార్యయైన వింధ్యావళి తెచ్చిన జలముచే నీ పాదములను కడిగి తన సర్వస్వమును సంకల్ప పూర్వకముగా దానము చేసెను. ఇది చాలా విచిత్రము.

*నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్ వ్యాతన్వానే ముముచుః ఋషయః సామరాః పుష్పవర్షమ్|*

*దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజామ్ ఉచ్చైరుచ్చైరవృధదవధీకృత్య విశ్వాండభాండమ్॥*

ఈ విధముగా రాక్షసేశ్వరుడైన బలిచక్రవర్తి ఎట్టి సందేహములేక నీకు భూమిని దానము చేయగా, దేవతలు, మునీంద్రులు, ఆనందముతో పుష్పవర్షమును కురిపించిరి. అప్పుడు అందరు చూచుచుండగనే నీ దివ్యరూపము క్రమక్రమముగా బ్రహ్మాండభాండము కంటె ఎత్తుగా ఎదిగినది. *(శ్రీమన్నారాయణీయము, దశకము 31-5,6)*

*20.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదాఽసురేంద్రం దివి దేవతాగణాః గంధర్వవిద్యాధరసిద్ధచారణాః|*

*తత్కర్మ సర్వేఽపి గృణంత ఆర్జవం ప్రసూనవర్షైర్వవృషుర్ముదాన్వితాః॥7079॥*

ఆ సమయమున ఆకాశమునందున్న దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు మొదలగువారు బలిచక్రవర్తియొక్క దివ్య కార్యమును, సరళత్వమును, సత్యనిష్ఠను ప్రశంసించిరి. వారు అతనిపై సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి.

*20.20 (ఇరువదియవ శ్లోకము)*

*నేదుర్ముహుర్దుందుభయః సహస్రశో గంధర్వకింపూరుషకిన్నరా జగుః|*

*మనస్వినానేన కృతం సుదుష్కరమ్ విద్వానదాద్యద్రిపవే జగత్త్రయమ్॥7080॥*

అప్పుడు వేలకొలది దుందుభులు ఒక్కసారిగా మ్రోగెను. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు *బలీ! నీవు ధన్యుడవు* అనుచు ఇట్లు కీర్తించిరి. ఉదారశీలుడైన బలి ఇతరులకు దుష్కరమైన కార్యమును గూడ ఆచరించెను. యాచించిన వాడు శత్రువు అని తెలిసియు, ముల్లోకములను దానము చేసెను.

*20.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*తద్వామనం రూపమవర్ధతాద్భుతమ్ హరేరనంతస్య గుణత్రయాత్మకమ్|*

*భూః ఖం దిశో ద్యౌర్వివరాః పయోధయస్తిర్యఙ్ నృదేవా ఋషయో యదాసత॥7081॥*

అదే సమయమున అత్యంత అద్భుతమైన సంఘటన జరిగెను. అనంతుడైన భగవానుని యొక్క త్రిగుణాత్మకమైన వామన రూపము పెరుగసాగెను. ఆ విరాడ్రూపములో పృథ్వి, ఆకాశము, దిక్కులు, స్వర్గము, పాతాళము, సముద్రములు, పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, ఋషులు మున్నగువారు అందరును అంతర్భాగమైరి.

*శార్దూల విక్రీడితము*

ఇంతింతై, వటుఁడింతయై
......మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున 
......కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై
......నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు
......బ్రహ్మాండాంత సంవర్ధియై.

*తాత్పర్యము*

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

*20.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*కాయే బలిస్తస్య మహావిభూతేః సహర్త్విగాచార్యసదస్య ఏతత్|*

*దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేంద్రియార్థాశయజీవయుక్తమ్॥7082॥*

ఋత్విజులు, ఆచార్యులు, సదస్యులు మొదలగు వారితో కూడిన బలిచక్రవర్తి సమస్త ఐశ్వర్యములకును నిలయమైన భగవంతుని త్రిగుణాత్మకమైన ఆ శరీరమందు పంచభూతములను, ఇంద్రియములను, వాటి విషయములను, అంతఃకరణమును, జీవులతోగూడిన త్రిగుణమయమైన సంపూర్ణజగత్తును తిలకించిరి.

*20.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*రసామచష్టాంఘ్రితలేఽథ పాదయోర్మహీం మహీధ్రాన్ పురుషస్య జంఘయోః|*

*పతత్త్రిణో జానుని విశ్వమూర్తేరూర్వోర్గణం మారుతమింద్రసేనః॥7083॥*

బలిచక్రవర్తి విరాట్ స్వరూపుడైన ఆ భగవంతుని పాదతలములందు, రసాతలమును, చరణములయందు పృథ్విని, పిక్కలయందు పర్వతములను, మోకాళ్ళయందు పక్షులను, ఊరువులయందు మరుద్గణములను చూచెను.

*20.24 (ఇరువది నాలూగవ శ్లోకము)*

*సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్ప్రజాపతీన్ జఘనే ఆత్మముఖ్యాన్|*

*నాభ్యాం నభః కుక్షిషు సప్తసింధూనురుక్రమస్యోరసి చర్క్షమాలామ్॥7084॥*

ఇదేవిధముగా ఆ త్రివిక్రముని వస్త్రముల యందు ఉభయసంధ్యలను, గుహ్యమందు ప్రజాపతులను, జఘనమున బలితో గూడిన దైత్య ప్రముఖులను, నాభియందు ఆకాశమును, ఉదరమునందు సప్తసముద్రములను. వక్షఃస్థలమునందు నక్షత్ర సమూహమును బలిచక్రవర్తి దర్శించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: