1, సెప్టెంబర్ 2020, మంగళవారం

ప్రభుత్వం సంచలన నిర్ణయం


By Srikanth K - September 1, 20203536
   

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి లేఔట్‌ రెగ్యూలరైజేషన్‌ స్కీం (ఎల్ఆర్ఎస్)ను ప్రకటించింది. అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు.. తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకొని.. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ 151 విడుదల చేసింది.

అనుమతుల్లేని లేఔట్లలోని ప్లాట్లు, ప్లాన్లు లేని భవనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మందగించింది. చిన్నచిన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్లాట్లు కొనుగోలుదారులు గుండెల్లో ఈ నిర్ణయం గుబులు రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా లేఔట్‌ రెగ్యులరైజేషన్ స్కీమ్ సౌకర్యం కల్పించడంతో.. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించనుంది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రెగ్యూలరైజేషన్ స్కీమ్‌)‌ ద్వారా ప్లాన్లు లేని భవనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది.

ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి లేఔట్‌ అనుమతులు, భవనాలకు సంబంధించి ఆమోదిత ప్లాన్లు ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లపై పెను ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. లేఅవుట్‌ అనుమతులు, భవన నిర్మాణ ప్లాన్లు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీ చిరంజీవులు గత బుధవారం ఉత్తర్వులు ఇవ్వడం.. రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఒక కుదుపు కుదిపింది. లేఅవుట్‌ అనుమతులు, ప్లాన్లు ఉంటేనే డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేస్తుండటం.. ఏమాత్రం తేడా ఉన్నా గిఫ్ట్‌ డీడ్లనూ తిరస్కరిస్తుండటంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల భారీగా సంఖ్య పడిపోయింది.

తప్పక చదవండి: తెలంగాణ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం విధివిధానాలు- దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే

కామెంట్‌లు లేవు: