1, సెప్టెంబర్ 2020, మంగళవారం

సంస్కృత మహాభాగవతం



*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.9 (తొమ్మిదవ శ్లోకము)*

*సులభా యుధి విప్రర్షే హ్యనివృత్తాస్తనుత్యజః|*

*న తథా తీర్థ ఆయాతే శ్రద్ధయా యే ధనత్యజః॥7069॥*

మహాత్మా! యుద్ధములో వెన్నుచూపక తమ ప్రాణములను త్యజించువారు లోకములో పెక్కుమంది గలరు. కాని, పాత్రులైనవారికి శ్రద్ధతో ధనమును దానము చేయువారు, అందులోనూ ఇంతటి దివ్యమైన, అలౌకికమగు సత్పాత్రుడైన వటువునకు దానము చేయు భాగ్యము లభించెడివారు చాల అరుదుగా ఉందురు.

*20.10 (పదియవ శ్లోకము)*

*మనస్వినః కారుణికస్య శోభనంయదర్థికామోపనయేన దుర్గతిః|*

*కుతః పునర్బ్రహ్మవిదాం భవాదృశాం తతో వటోరస్య దదామి వాంఛితమ్॥7070॥*

ఒక సామాన్యుడైన యాచకుని కోరికను తీర్చినందులకు ఉదారుడు, దయాళువైన దాతకు దుర్గతి లభించిననూ, అతనికి అది శ్రేయస్కరమే. శోభనిచ్చునదే యగును. పైగా ఈ వటువు కూడా మీవంటి బ్రహ్మవేత్తగా తేజరిల్లుచున్నాడు. కనుక, ఇట్టి బ్రహ్మచారి కోరికను నేను తప్పక నెరవేర్చెదను. అందువలన నాకు ఎంతటి కీడు వాటిల్లినను అది నాకు గొప్ప శోభాదాయకము, శ్రేయస్కరము అగును.

*20.11 (పదకొండవ శ్లోకము)*

*యజంతి యజ్ఞక్రతుభిర్యమాదృతా భవంత ఆమ్నాయవిధానకోవిదాః|*

*స ఏవ విష్ణుర్వరదోఽస్తు వా పరో దాస్యామ్యముష్మై క్షితిమీప్సితాం మునే॥7071॥*

మహర్షీ! వేద విధులను ఎరిగిన మీరు యజ్ఞముల ద్వారా, క్రతువుల ద్వారా, సాదరముగా శ్రీమహావిష్ణువునే ఆరాధింతురు కదా! ఈ వచ్చినవాడు స్వయముగా ఆ మహావిష్ణువే కావచ్చును లేక వేరొకడు కావచ్చును. అతడు ఎవరైనను సరే, ఇతడు కోరినంత భూమిని నేను తప్పక ఇచ్చి తీరెదను.

*20.12 (పండ్రెండవ శ్లోకము)*

*యద్యప్యసావధర్మేణ మాం బధ్నీయాదనాగసమ్|*

*తథాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మతనుం రిపుమ్॥7072॥*

ఇతడు నిరపరాధినైన నన్ను అధర్మముగా బంధించినను, నేను ఇతనికి ఎట్టి ప్రతీకారమును తలపెట్టను. ఎందుకనగా, ఇతడు నాకు శత్రువే ఐనప్ఫటికిని భయముతో బ్రాహ్మణ శరీరమును దాల్చి యున్నాడు.

*20.13 (పదమూడవ శ్లోకము)*

*ఏష వా ఉత్తమశ్లోకో న జిహాసతి యద్యశః|*

*హత్వా మైనాం హరేద్యుద్ధే శయీత నిహతో మయా॥7073॥*

ఇతడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువేయైనచో, అతడు తన కీర్తిని పోగొట్టుకొనును లేదా యుద్ధములో నన్ను వధించియైనను నా భూమిని లాగుకొనవచ్చును. ఒకవేళ విష్ణువు కానిచో, సమరమున నాచే నిహతుడగును.

*శ్రీశుక ఉవాచ*

*20.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏవమశ్రద్ధితం శిష్యమనాదేశకరం గురుః|*

*శశాప దైవప్రహితః సత్యసంధం మనస్వినమ్॥7074॥*

*శ్రీశుకుడు పలికెను* బలిచక్రవర్తి స్వాభిమానముతో తన మాటను నిబెట్టు కొనుటకై తనగురువైన శుక్రాచార్యుని ఆదేశమును ఉల్లంఘించెను. అప్పుడు శుక్రాచార్యుడు దైవప్రేరితుడై ఇట్లు శపించెను. సత్యసంధుడు, ఉదారుడు ఐన బలిచక్రవర్తి వాస్తవముగా శాపమునకు అర్హుడుగాడు.

*20.15 (పదునైదవ శ్లోకము)*

*దృఢం పండితమాన్యజ్ఞః స్తబ్ధోఽస్యస్మదుపేక్షయా|*

*మచ్ఛాసనాతిగో యస్త్వమచిరాద్భ్రశ్యసే శ్రియః॥7075॥*

*అప్పుడు శుక్రాచార్యుడు ఇట్లు పలికెను* మూర్ఖుడా! నీవు అజ్ఞానివి (వినయవిధేయతలు లేనివాడవు) "నేనే పండితుడను అని భావించుచున్నావు. కావున, నా ఆజ్ఞను ఉల్లంఘించితివి. కాబట్టి, నీవు శీఘ్రముగా నీ రాజ్యసంపదలు కోల్పోవుదువు."

*20.16 (పదునారవ శ్లోకము)*

*ఏవం శప్తః స్వగురుణా సత్యాన్న చలితో మహాన్|*

*వామనాయ దదావేనామర్చిత్వోదకపూర్వకమ్॥7076॥*

మహాత్ముడైన బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునిచే ఇట్లు శపింపబడినను సత్యమునుండి (తానచ్చిన మాట నుండి) చలింపలేదు. అతడు వామన భగవానునికి విధ్యుక్తముగా పూజించెను. పిమ్మట ఉదక పూర్వకముగా మూడడుగుల భూమిని దానమిచ్చెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: