14, మార్చి 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం 177-*

 *తిరుమల సర్వస్వం 177-*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం2* 


 

 ఇప్పుడు ఆలయనిర్వహణ బాధ్యత ఈస్టిండియా కంపెనీ అధికారుల నుండి మహంతుల చేతిలోకి ఎందుకు, ఎలా వచ్చిందో పరిశీలిద్దాం.


 *పరాయి చెరనుండి ఆలయానికి విముక్తి* 


 హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల, మరీ ముఖ్యంగా, కుల వర్గ ప్రాంతీయ బేధాల కతీతంగా హిందువులందరూ ఆరాధించే తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి జోక్యం మితిమీరడంతో; హిందూ సాంప్రదాయ వాదుల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రబలింది. క్రమంగా వారి సహనం హద్దులు దాటి, బ్రిటీష్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వేగంగా విస్తరించడంతో; ముందుచూపు కలిగిన, వివేకవంతులైన కొందరు బ్రిటిష్ అధికారులు కళ్ళు తెరిచారు. లండన్ లోనూ, కలకత్తా లోనూ ఉన్న ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులకు అనేక రహస్య నివేదికలు పంపారు.

2 ఈ వ్యవహారాన్ని తెగే వరకు లాగవద్దని, తిరుమల ఆలయ వ్యవహారాలలో మితిమీరిన జోక్యం పనికిరాదని సందేశాలు ఇచ్చారు. ఇండియా లోని గవర్నర్ జనరల్ కు దాదాపుగా అన్ని హిందూ మరియు మహమ్మదీయ ధార్మిక సంస్థలకు సంబంధించి ఇలాంటి నివేదికలే అందాయి. వాటన్నింటిని సమీక్షించిన ఆంగ్లేయ పాలకవర్గం, భారతదేశంలోని అన్ని మతపరమైన సంస్థలలో క్రమంగా జోక్యం తగ్గించుకోవాలని తీర్మానించింది.


 తదనుగుణంగా, అప్పుడు తిరుమల దేవాలయం యొక్క వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకు ఆలయ నిర్వహణ విధుల నుండి తప్పుకొని; ఆ బాధ్యతను తగిన వ్యక్తులకు గానీ, వ్యవస్థకు గానీ అప్పగించ వలసిందిగా తాఖీదు అందింది.


 *ఎవరు సమర్థులు?* 


 అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు? తిరుమల క్షేత్రం లోనే కాకుండా తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు, మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది.


 అప్పట్లో స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి-నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళ్, వడగళ్ అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే!


 అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.


 జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ, కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా; వారి పాత్ర, పాలకవర్గానికి అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేంత వరకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు.


 ఇలా ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని, వారివల్ల దేవాలయానికి కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి *మహంతులపై* పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి.


 వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము, బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: