14, మార్చి 2025, శుక్రవారం

హోలీ.. జీవితం వర్ణమయం..!

 హోలీ.. జీవితం వర్ణమయం..!

 

   ప్రతి సంవత్సరం హిందూ సంప్రదాయం ప్రకారం పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోలీ పండుగను జరుపుకుంటాము. రంగుల ఆనందంతో చిన్నా, పెద్ద, మత, వయో బేధం లేకుండా హోలీ ఉత్సవాలను జరుపుకుంటారు. హోలీ పూర్ణిమను కాముని పున్నంగా పిలుస్తుంటారు. ఈ పౌర్ణమికి ముందురోజు రాత్రి అన్ని ప్రాంతాలలో కాముడి దహానాన్ని గ్రామంలో ఇంటింటి నుండి సేకరించిన పిడుకలతో దగ్ధం చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్ఘుణోత్సవమని, వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాము.


మన తెలుగు నేలలోనూ కాముని పున్నమ, మదనోత్సవం అనే పేర్లతోనూ హోళీ వేడుకలను జరుపుకుంటాము. కన్నడ ప్రాంతంలో 'కామన హబ్బ', తమిళనాట 'కామక్ పండిగె' అని పిలుస్తారు. మదనుడి దహనం, ఆయన పునరుజ్జీవనాన్ని పురస్కరించుకుని ఈ వేడుక చేసుకుంటారు. దక్షిణాదికన్నా ఉత్తర భారతంలో హోలీ పండుగకు ఎక్కవ ప్రాముఖ్యం ఉంది.


పురాణ గాథలు

హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి. దైవకార్య నిమిత్తం.. యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీనిపై ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు.. తన మూడో కంటిని తెరచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మధుడు.. రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మధుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ కూడా ఓ కారణమైందని కొందరు విశ్వసిస్తారు.


పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే ఓ రాక్షసి ఉండేదట. అది పసిపిల్లలను సంహరిస్తుండేది. ఒక యోగి సూచన మేరకు ఓ వృద్ధురాలు.. పిల్లల చేత ఆ రాక్షసిని బాగా తిట్టించిందట. ఆ తిట్లు వినలేక హోలిక చినిపోయింది. ఆమెను ఊరి ప్రజలందరూ తగలబెట్టి హోలీ పండుగను జేరుపుకున్నారట. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోందని మరికొందరి నమ్మకం.


హోలీ పండుగ పుట్టుకకు మరో కథ కూడా ఉంది. చిన్నారి శ్రీకృష్ణుడు తన శరీరరంగు... రాథ శరీరరంగు మథ్య ఎందుకింత వ్యత్యాసం ఉందని తల్లికి ఫిర్యాదు చేయడంతో.... యశోద... రాథను ముఖానికి రంగువేసుకోమని కోరిందంట. అలా హోళీ ప్రసిద్ధిగాంచింది. శ్రీకృష్ణుడు పెరిగిన మథుర, బృందావనంలో ఇప్పటికీ 16 రోజులపాటు హోళీ వేడుకలను జరుపుకుంటారు.


మరో కథ కూడా వాడుకలో ఉంది. అయితే ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచాలనుకుంటాడు. ఇందులో భాగంగా అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు. అయితే, భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.


ఇలా దేశవ్యాప్తంగా ఎన్నెన్నోకథలు హోలీ ఆవిర్భావానికి కారణాలుగా చెబుతారు. వసంత రుతువు శోభకు ప్రకృతి పులకిస్తూ ఉన్న తరుణంలో ప్రజలంతా మహోఉత్సాహభరితంగా ఈ వసంతోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ హోలీ మీ అందరి జీవితాలను మరింత వర్ణమయంగా మార్చాలని, శుభం చేకూర్చాలని దీవిస్తూ...మీ.. చింతా గోపీశర్మ సిద్ధాంతి. 9866193557

కామెంట్‌లు లేవు: