☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(75వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ఒకప్పుడు భూమి మీద దైత్యులు విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. వారి దుర్మార్గాలనూ, దురాగతాలనూ భూదేవి సహించలేకపోయింది.*
*గోవు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుని వద్దకు గోలు గోలున చేరుకుందామె. కష్టాన్నంతా చెప్పుకుని విలపించింది. అప్పుడు శంకరుడు, ఇంద్రాది దేవతలు సహా బ్రహ్మ వైకుంఠానికి చేరుకున్నాడు. భూదేవి కష్టాన్ని తెలియజేసి, విష్ణుమూర్తిని ప్రార్థించారంతా.*
*వారి ప్రార్థనకు విష్ణువు ఇలా స్పందించాడు. తాను త్వరలో యాదవకులంలో జన్మిస్తానన్నాడు. దుష్టులను సంహరిస్తానని, భూభారాన్ని తొలగిస్తానని చెప్పాడు.*
*దేవతలను వారి వారి అంశలతో భూమి మీద జన్మించమని ఆదేశించాడు. దేవతా స్త్రీలను కూడా భూమి మీద జన్మించాల్సిందిగా కోరాడు. ఫలితంగానే విష్ణుమూర్తీ, మిగిలిన దేవతలూ భూలోకంలో జన్మించారు.*
*గంగను చూసిన వాడు, గంగాజలంలో స్నానించిన వాడు, దానిని తాగిన వాడు ఎలా అయితే సకలపాపాల నుండి విముక్తమవుతారో అలాగే వసుదేవుని కుమారుడయిన వాసుదేవునికథ చెప్పమని అడిగినవాడు, దానిని చెప్పినవాడు, ఆ కథ విన్నవాడు ఈ ముగ్గురూ పరమపావనమై సద్గతులు పొందుతారు.*
*వాసుదేవుడు:-*
*పూర్వం కాళింది నదీతీరాన మధువనం అని ఒక వనం ఉండేది. దానిని మధువు అనే వాడు పాలించాడు. ఈ కారణంగానే మధురానగరం ఏర్పడింది. ఈ మధురానగరమే యాదవులకు రాజధాని అయింది.*
*మధువు తర్వాత అతని కుమారుడు లవణుడు రాజయినాడు. ఇతను రాక్షస ప్రవృత్తితో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డాడు. శ్రీరాముని తమ్ముడు శత్రుఘ్నుడు, ఈ లవణాసురుణ్ణి చంపి, మధురానగరాన్ని తన కుమారులయిన పుష్కర, పుష్కరాక్షులకు అందజేశాడు.*
*సూర్యవంశపు రాజులు అంతరించిన తర్వాత ఈ నగరం యాదవుల వశమయింది. ఆనాటి నుంచి యాదవులకు అది రాజధాని అయింది.*
*మాధురం, శూరసేనం అనే రెండు రాజ్యాలూ పక్కపక్కనే ఉండేవి. యాదవులలో శూరుడయిన శూరసేనుడు, మధురానగరం రాజధానిగా చేసుకుని, ఆ రెండు రాజ్యాలనూ పాలించాడు. అతని భార్య మారిష. వారికి పదకొండుమంది కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడు వసుదేవుడు. ఈ వసుదేవుని కుమారుడే శ్రీకృష్ణుడు.*
*వసుదేవుడు పూర్వజన్మలో ఒక ప్రజాపతి. పిల్లలు లేరతనికి. పిల్లలకోసం అతనూ, భార్యా తీవ్రంగా తపస్సు చేశారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తమకు కుమారునిగా విష్ణువునే జన్మించమని వరం కోరుకున్నారు వారు. ఆ వరం ఈ జన్మలో ఫలించదని, వచ్చే జన్మలో ఫలింపజేస్తానన్నాడు విష్ణువు. ఫలితంగానే విష్ణువు శ్రీకృష్ణుడిగా వసుదేవునికి జన్మించాడు.*
*శూరసేనునికి అయిదుగురు కుమార్తెలు జన్మించారు. వారిలో పెద్దది పృథ. మేనత్త కుమారుడు కుంతిభోజునకు పిల్లలు లేని కారణంగా పృథను పెంచుకోమని ఇచ్చాడు శూరసేనుడు. కుంతిభోజుడు పెంచిన కారణంగా పృథకు ‘కుంతి’ అని పేరొచ్చింది. ఆ విధంగా కుంతి, కృష్ణునికి మేనత్త అయింది.*
*ఆమె పాండురాజుని పెళ్ళాడం, పాండవులు ఆమె పుత్రులు అన్న సంగతి సర్వులకూ తెలిసిందే!*
*కుంతి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసమహర్షి వారి ఇంటికి వచ్చాడు. ఆ మునికి అత్యంత భక్తిశ్రద్ధలతో కుంతి పరిచర్యలు చేసింది. అందుకు దుర్వాసుడు సంతోషించి, ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఏ దేవుని తలచుకుని ఆ మంత్రాన్ని పఠిస్తే ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. కోరిన కోరిక తీరుస్తాడు. ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించదలచింది కుంతి. సూర్యుని కోరుకుంటూ మంత్రాన్ని పఠించింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. పరీక్షకు పిలిచిందేకాని, వలచి పిలవలేదన్నది కుంతి. తనని చెడగొట్టవద్దని బతిమలాడింది. క్షమించమంది. ఫలితంగా ఆమె కన్యాత్వం చెడకుండా గర్భం ప్రసాదించాడు సూర్యుడు. కొన్నాళ్ళకు ఆమె ఓ కుమారుణ్ణి కన్నది. లోకోపవాదుకి భయపడి, ఆ కుమారుణ్ణి ఓ పెట్టెలో పెట్టి, గంగలో విడచిపెట్టింది.*
*బృహద్రథుని వంశానికి చెందిన అతిరథుడు అనే సూతునికి ఆ పెట్టె లభించింది. తెరచి చూశాడతను. సహజకవచకుండలాలతో సూర్యునిలా వెలుగుతున్న బాలుని చూసి ఆశ్చర్యపోయాడు. దైవప్రసాదంగా భావించి, ఆ బాలుని పెంచసాగాడు. ఆ బాలుడే కర్ణుడు.*
*కర్ణుడు కుంతిపుత్రుడనీ, ధర్మరాజాదులకు జ్యేష్ఠసోదరుడనీ కృష్ణునికి తెలుసు. తెలిసినా ఆ సంగతి పాండవులకు చెప్పలేదతను. చెబితే భారతయుద్ధం జరగదని తలచాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి