*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*
*316. వ రోజు*
ద్రోణుడు ధృష్టద్యుమ్నుని భీముని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ద్రోణుడు తను పన్నిన శకటవ్యూహం చెదరకుండా కాపాడుతున్నాడు. రణరంగం విరిగిన రథములు, విల్లులు, కేతనములు, చిందరవందరాగా పడిన దుస్తులు కాళ్ళు చేతులు, ఏనుగుల కళేబరాలు, గుర్రముల శవాలు పదాతి దళాల పీనుగులతో భీకరంగా ఉంది. ద్రోణుని రథమును ధృష్టద్యుమ్నుడు ఢీకొట్టి డాలు కత్తి తీసుకుని ద్రోణుని మీద కలియబడ్డాడు. ద్రోణుడు ఈ హటాత్పరినామానికి జంకక ధృష్టద్యుమ్నుని కత్తిని ముక్కలు చేసి డాలును విరిచి రథాశ్వములను, సారథిని చంపి దృష్టద్యుమ్నుని మీద క్రూర నారాచమును వేసాడు. సాత్యకి ఆ నారాచమును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు సాత్యకి రథం ఎక్కి పక్కకు తప్పుకున్నాడు. చేతికి చిక్కిన ధృష్టద్యుమ్నుని తప్పించినందుకు ద్రోణునికి సాత్యకి మీద కోపం వచ్చి సాత్యకిని కోపంగా ఎదుర్కొన్నాడు. సాత్యకి జంకక తన రథమును ద్రోణుని ముందు నిలిపాడు. వారిరువురు ఘోరయుద్ధం సాగించారు. రథములు విరుగుతున్నాయి, కేతనములు తెగి పడుతున్నాయి. సైనికుల శరీరములు మట్టిలో దొర్లుతున్నాయి. అప్పుడు సాత్యకి ద్రోణుని విల్లు విరిచాడు, ద్రోణుడు మరొక విల్లు తీసుకుని సంధేచే లోపల దానిని విరిచాడు. ఆ విధంగా ద్రోణుడు ఎన్ని విల్లులు తీసుకున్నా వాటిని విరిచాడు సాత్యకి. పట్టువదలని ద్రోణుడు ఆఖరికి ఒక విల్లు తీసుకుని బాణములు సంధించి అత్యంత వేగంగా సాత్యకిపై శరములు ప్రయోగించాడు. సాత్యకి వాటినిన్నంటిని త్తుతునియలు చేసాడు. ద్రోణుడు సాత్యకిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. భీకర జ్వాలలను చిమ్ముతూ సాత్యకి వైపు వచ్చిన ఆగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రం ప్రయోగించి సాత్యకి నిర్వీర్యం చేసాడు. సాత్యకికి బాసటగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నిలిచారు. ద్రోణునికి బాసటగా దుశ్శాసనాదులు నిలిచి యుద్ధం చేస్తున్నారు
*అర్జునుడి సమరం*
అర్జునుడు తాను వెళ్ళే మార్గంలో ఎదురైన యోధులను హతమారుస్తూ సైంధవుని కొరకు ముందుకు దూసుకు వెళుతున్నాడు. ఇంతలో విందాను విందులు తమ సైన్యంతో అర్జునుడిని చుట్టుముట్టి కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించాడు. అర్జునుడు వారి ధనస్సులును విరిచి, పతాకములు పడగొట్టి, వారి రథాశ్వములను చంపి ముందుగా విందుని తల తెగ నరికాడు. అన్న గారి మరణానికి ఆగ్రహించి అనువిందుడు గదను తీసుకుని రథం దిగి అర్జునుని రథం సమీపించి తన గదను శ్రీకృష్ణుని మీద విసిరాడు. అర్జునుడు ఆ గదను విరిచి మరొక బాణంతో అనువిందుని శిరస్సు ఖండించాడు. విందానువిందులు మరణించగానే వారి సేనలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వారినందరిని తన శరాఘాతంతో తరిమి తరిమి కొట్టాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి