🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఈశ్వరుడు ఆది కిరాత మూర్తిగా ఒకప్పుడు రూపం ధరించాడు. కిరాతులు వేటాడేందుకు కావలసిన మహారణ్యములా, తన మనస్సు ఉంది కాబట్టి , తన మనస్సులోనే శివుని నివసింపుమని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు.*
*శ్లోకం : 43*
*మా గచ్ఛస్త్వమితస్తతో గిరిశ ! భో మయ్యేవ వాసం కురు*
*స్వామిన్నాది కిరాత ! మామకమనః కాంతార సీమాంతరే*
*వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయః*
*స్తాన్హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి!!*
*పదవిభాగం :~*
*మా _ గచ్ఛ _ త్వమ్ _ ఇత: _ తతః _ గిరిశ _ భో _ మయి _ ఏవ _ వాసం కురు _ స్వామిన్ _ ఆదికిరాత _ మామకమనఃకాంతార సీమాంతరే _ వర్తంతే - బహుశః _ మృగాః _ మదజుషః _ మాత్సర్యమోహాదయః _ తాన్ _ హత్వా _ మృగయా వినోద రుచితాలాభం _ చ _సంప్రాప్స్యసి.*
*తాత్పర్యము:~*
*కైలాస గిరి యందు శయనించే ఆదికిరాతుడవైన ఈశ్వరా ! నీవు ఇచ్చటికీ అచ్చటికీ తిరుగవద్దు. నాయందే నివసించు. దానివలన నీకు రెండు లాభములున్నాయి.* *నీవు మాటిమాటికీ అచ్చటికీ ఇచ్చటికీ తిరుగవలసిన పని ఉండదు. నామనస్సనే అడవి మధ్యలో మాత్సర్యము మోహము మొదలయిన అడవి జంతువులనేకం తిరుగు తున్నాయి. వాటిని చంపి నీవు కిరాతుడవు కాబట్టి, వేట వినోదమునందలి ప్రీతిని సైతమూ పొందవచ్చును. స్వామీ! నీవు నా హృదయంలో నివసించి , కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలను తొలగించి , నన్ను సత్త్వ సంపన్నునిగా చెయ్యి అని ప్రార్థన.*
*వివరణ:-*
*మహారణ్యంలో సింహ వ్యాఘ్రాది క్రూరమృగాలుంటాయి. మనస్సులో క్రూరములైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే అంతశ్శత్రువులు ఉంటాయి. మహారణ్యాలలోనికి సూర్యచంద్ర కిరణములుసైతమూ ప్రసరింపవు. మనస్సనే మహరణ్యములోనికి వివేకము, విజ్ఞానం అనే సద్గుణాలు ప్రవేశింపలేవు. కాగా మనస్సులలో పెద్ద చీకటి (అవిద్య) ఉంది. కాబట్టి మనస్సును మహారణ్యంతో పోల్చడం సమంజసమే అనాలి. అందువల్లనే శంకరులు తన మనస్సనే అరణ్యములో ప్రవేశించి కామక్రోధాదులను నిర్మూలించమని ,తనను సత్త్వగుణప్రధానునిగా చేయుమన్నదే శంకరుల కోరికలోని రహస్యం.*
*శివుడు ఆదికిరాతుడు:~*
*ఈ విషయంలో రెండు పురాణకథలు ఉన్నాయి.*
*1) బ్రహ్మ, " సరస్వతి" అనే కుమార్తను సృష్టి చేశాడు. ఆమె అందానికి తానే వశుడై , ఆమె పొందును కోరాడు. ఆమె లేడి రూపమును ధరించి, పరగుపెట్టింది. బ్రహ్మ జింకరూపం ధరించి ఆమెను వెంబడించాడు. శివుడా దుర్మార్గాన్ని చూసి ఉగ్రుడై తాను బ్రహ్మను శిక్షిస్తానని కిరాతరూపం ధరించాడని ఒక గాథ.*
*2). అర్జునుడు ఈశ్వరుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందడానికి తపస్సు చేశాడు. శివుడుకిరాతుడై ధనుర్భాణాలు ధరించి పరివారాన్ని చెంచులుగా మార్చి, "మూకుడనే " రాక్షసుణ్ణి పందిగా చేసి, అర్జునుడు తపస్సు చేసే వనానికి వెళ్ళాడు. అక్కడ పంది కోసం శివార్జునులు పోరాటం చేశారు. శివుడర్జునుని అస్త్ర శస్త్రాలను మాయంచేశాడు. అర్జునుడు తన గాండీవంతో, శివుని మీదకు వెళ్ళాడు. శివుడు అర్జునుని పరాక్రమానికి మెచ్చి పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇది భారతంలోని ప్రసిద్ధమైన కథ.*
*ఈవిధంగా ఈశ్వరుడు కిరాతరూపం ధరించాడన్నది ప్రసిద్ధమైన విషయం.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి