*ఈరోజు శుక్రవారం హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, వసంతోత్సవం...*
తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వ దినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపు కుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.
పురాణాలు ఏం చెబుతున్నాయి ?
రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అంటారు.
✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి