14, మార్చి 2025, శుక్రవారం

గరుడ పురాణం_*9వ భాగం:-

 గరుడ పురాణం_*9వ భాగం:- 


_రోహిణి మున్నగు ఇరువదేడు నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులూ, సింహికయను కూతురూ పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్లాద, ప్రద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి 'హ్లాదు’ లుగా ప్రసిద్ధి చెందారు._ 


_*ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంప్ల(హ్రా)దునికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు.*_


_హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహా బలశాలులు._


_*దనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంబర, ఏక చక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాతవీరులు.*_


_స్వర్భానుని కన్య సుప్రభ. వృష పర్వుని కూతురు శర్మిష్ఠ, అతని కింకా ఉపదానవి. హయశిర అను మరో ఇద్దరు శ్రేష్ఠకన్యలున్నారు._


_*పులోమా, కాలకా వైశ్వానరకన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలినుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి అరవై వేల మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములనీ కాలకంజులనీ వ్యవహరించాడు.*_


_విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు రెండు వందల మంది ఉదయించారు. తామ్రాకు సత్త్వ గుణ సంపన్నులైన ఆరుగురు కన్యలు పుట్టారు._ 


_*వారి పేర్లు :శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్రిక, వీరికి క్రమంగా 1. చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2. శ్యేనాలు 3. భాసాలు 4. అశ్వాలు, ఒంటెలు 5. నీటి పక్షులు 6. గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశమన్నారు.*_

_(క్రమతలో తేడా : సుగ్రీవునికి గుఱ్ఱాలూ, గృధ్రికు గ్రద్దలు పుట్టాయి.)_


_వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు గరుడుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా, కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు._


_*క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులూ, ఎద్దులూ, ఇరావతికి వృక్షకుటుంబమూ జన్మించాయి.*_


_ఖగా యను నామెకు యక్ష రాక్షస గణాలూ, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలూ, అరిష్టకు పరమసత్త్వసంపన్నులైన గంధర్వులూ పుట్టారు. నలభై తొమ్మిది మరుత్తులను దేవతలు (రాక్షస మాతయైన) దితి కడుపున పుట్టారు._


_*ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు ఏడుగురూ ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొకగణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం ఋత, ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది నాలుగవ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు. అయిదవ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది ఆరవమరుద్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయీ, విరాట్టు, ఉద్వేషణులది ఏడవ మరుద్గణం. వీటిని వాయుగణాలనీ, స్కంధాలనీ కూడా అంటారు.*_


_ఈ నలభై తొమ్మండుగురు మరుత్తులూ విష్ణురూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాదిగ్రహాలు వీరినే పూజిస్తారు._

_(6వ అధ్యాయం సమాప్తం)_

కామెంట్‌లు లేవు: