12, ఏప్రిల్ 2026, ఆదివారం

కుటుంబ సమస్యలు - విశ్లేషణ బ్రాహ్మణి దేవి - imp

 సావడి కబుర్లు - 8


వందేమాతరం 


కుటుంబ సమస్యలు - విశ్లేషణ 


*సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమి వః ।*

*అన్యోన్యం అభిహర్యత వత్సం జాతమివాఘ్న్యా ॥*


_మన హృదయాలు ఒకటిగా ఉండాలి, మన భావనలు సమన్వితంగా ఉండాలి, పరస్పర ద్వేషానికి తావు ఉండకూడదు. ఒక ఆవు తన దూడను ఎంత ప్రేమగా ఆదరిస్తుందో అంత ప్రేమతో మనం ఒకరినొకరం ఆదరణతో ఉండాలి_ అంటూ అధర్వణ వేదం రూపంలో వేదమాత మానవ కుటుంబజీవనానికి ఇచ్చిన  అద్భుతమైన ఉపదేశం ఎంతో విలువైనది. అదే నిజమైన కుటుంబ స్వరూపం.


కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో నివసించే రక్తసంబంధాల కలయిక కల వ్యక్తుల సమాహారం మాత్రమే కాదు. ఒకే హృదయస్పందనతో  జీవించే మనసుల సమూహం. అది  ప్రేమ, కర్తవ్య, త్యాగ, క్షమ, సహనం, గౌరవం అనే ఆరు స్తంభాలపై నిలిచే పవిత్ర జీవనవ్యవస్థ. రక్తసంబంధం కుటుంబానికి రూపాన్ని ఇస్తే, ప్రేమ దానికి ప్రాణాన్ని ఇస్తుంది.‌ కర్తవ్యబోధన దానికి స్థిరత్వం ఇస్తుంది.‌ క్షమ దానికి చిరకాలం నిలిచే విశ్వాసాన్నిస్తుంది.

ఒక విధంగా మనిషి జీవితంలో కుటుంబమే  తొలి పాఠశాల. తల్లిదండ్రులే తొలి గురువులు. కుటుంబమే సంస్కార బోధన చేసే తొలి దేవాలయం. అందుకే మన సంస్కృతిలో  గృహాన్ని “ఇల్లు” అని మాత్రమే కాక “గృహస్థాశ్రమం” అని గౌరవంగా సంబోధిస్తారు.‌


అయితే, ఇంత పవిత్రమైన బంధాలలో  ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ప్రేమతో కలిసిన మనసులు ఎందుకు దూరమవుతున్నాయి ?.  కలిసి జీవించాలనే సంకల్పంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానం వెతికితే మనకి మానవస్వభావంలోనే  కనిపిస్తుంది.


కుటుంబ కలహాలకు ప్రధాన కారణం ప్రేమ, అపేక్షలు.

 అపేక్షలు అతిగా పెరిగితే అవి బాధకు మూలమవుతాయి. “వారు నన్ను అర్థం చేసుకోవాలి”, “నేను అనుకున్నట్టే ప్రవర్తించాలి”, “నా మనసుకు అనుగుణంగా ఉండాలి” అనే మౌనమైన ఆశలు నెరవేరనప్పుడు అసంతృప్తి పుడుతుంది. ఆ అసంతృప్తి మెల్లగా మనసులో మంటగా మారి కలహాలకు కారణమవుతుంది.


దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 

*కామాత్ క్రోధోఽభిజాయతే క్రోధాత్ భవతి సంమోహః ।*

*సంమోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః ॥*

అంటూ, అతిశయమైన ఆశల నుంచే క్రోధం పుడుతుంది.  క్రోధం వివేకాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు. 


కుటుంబ కలహాలకు అపేక్షలు మొదటి కారణమైతే, రెండో ప్రధాన కారణం అహంకారం. ప్రేమ “మనము” అంటే,  అహంకారం “నేను” అంటుంది.  “నేనే ఎందుకు తగ్గాలి?”, “నా మాటే ఎందుకు వినకూడదు?”, “ప్రతి సారి నేనే ఎందుకు క్షమించాలి?” అనే భావనలు ఎప్పుడైతే మనసులో కలుగుతాయో,  అవే కుటుంబంలో చీలికలకు తీసుకొని వస్తాయి. అంటే ప్రేమ తగ్గిన చోట అహం పెరుగుతుంది, అహం పెరిగిన చోట శాంతి నిలవడం కష్టం. 


ఇక మూడవ కారణం సంభాషణలో లోపం.

కుటుంబాలు పెద్ద సమస్యల వలన కూలిపోవు,  చిన్న అపార్థాలను పెద్దవిగా పెంచడం వలన కూలిపోతాయి. చెప్పవలసిన మాట చెప్పకపోవడం, వినవలసిన మాట వినకపోవడం, అర్థం చేసుకోవలసిన సందర్భంలో తీర్పు ఇవ్వడం, ఇవే అనేక బంధాలను దెబ్బతీస్తాయి. మాటలతో సరిచేయవలసిన చోట మౌనం దానిని మరింత కఠినతరం చేస్తుంది.


నాలుగవ ముఖ్య కారణం పోలికలు. “వారి ఇంట్లో ఇలా ఉంది”, “వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు”, “అతని భార్య ఇలా, ఆమె భర్త అలా.." వంటి  పోలికలు కుటుంబాల్లో ఆనందాన్ని హరించి వేయడమే కాక  అసంతృప్తిని పెంచుతాయి. పోలిక ఉన్నచోట కృతజ్ఞత ఉండదు,  కృతజ్ఞత లేని చోట సంతోషం నిలవదు.


ఇక చివరిగా, ఐదవ కారణం  క్షమాభావం లేకపోవడం.

తప్పులేని మనిషి ఉండడు.‌ కలిసి జీవించాలంటే పరస్పరం లోపాలను అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో భరించాలి కూడా. ప్రతి చిన్న పొరపాటును మనసులో దాచుకుంటూ పోతే, అది మనుషుల మధ్య సంబంధాన్ని లోపల్నుంచి క్రమంగా క్షీణింపజేస్తుంది. అందుకే *క్షమా వీరస్య భూషణమ్*  క్షమించడం అనేది బలహీనత కాదు, బలం అంటారు.


ఇవే కాక, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం, బాహ్యప్రభావాలు, ధార్మిక విలువలు లేకపోవడం, పరస్పర గౌరవం తగ్గిపోవడం కూడా కుటుంబంలో కలహాలకు కారణం అవుతున్నాయి. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను పెంచినా, హృదయాల మధ్య దూరాన్ని కూడా పెంచుతోంది. ఒకే ఇంట్లో నివసిస్తున్నా, మనసులు వేర్వేరు లోకాలలో విహరిస్తున్నాయి. కలిసి భోజనం చేసే అలవాటు తగ్గిపోవడం, మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం, బాధ పంచుకునే సంస్కారం తగ్గిపోవడం, నావాళ్లు స్థానంలో నేను అనే భావం పెరిగిపోవడం‌ కూడా కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.


మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. మొదట కుటుంబంలో హక్కుల గురించి కాక బాధ్యతల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. 

“నాకు ఏమి దక్కింది?” అనే ప్రశ్న కంటే “నేను ఏమి ఇచ్చాను?” అనే ఆలోచన కుటుంబాన్ని కాపాడుతుంది.

రెండవది, ముఖ్యంగా వినడం నేర్చుకోవాలి. సంబంధాలు నిలవాలంటే ఎదుటివారి మాటను సమాధానం చెప్పడానికి కాక, అర్థం చేసుకోవడానికి వినాలి.


మూడవది గెలవడం కాదు బలపడడం ముఖ్యం‌ అన్నది గ్రహించాలి.  వాదనలో గెలిచి మనసును కోల్పోవడం మూర్ఖత్వం అవుతుంది. కుటుంబంలో “నేను గెలిచాను” అన్న భావం కన్నా “మన బంధం నిలిచింది” అన్న భావం గొప్పతనం తెలుసుకోవాలి. నాలుగవది, కలిసి ఆచరించే సంస్కృతి పెంపొందించుకోవడం.


ఇక ఐదవది, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడం. కుటుంబ సభ్యులలోని మంచి లక్షణాలను ప్రశంసించాలి. ప్రశంసించని ప్రేమ క్రమంగా అలసిపోతుంది.

ఆరవది, ఆర్థిక ఒత్తిళ్లు. ధనం కుటుంబాన్ని పోషించడానికి సాధనంగా ఉండాలి కానీ అదే లక్ష్యమైపోతే సంబంధాలు బలహీనమవుతాయి. సంపాదన పెరిగినా సమయం, ప్రేమ, పరస్పర గౌరవం తగ్గితే కుటుంబంలో శూన్యత పెరుగుతుంది.


చివరిగా ముఖ్యమైనది, సహనాన్ని సాధనగా స్వీకరించాలి. కుటుంబంలో కొన్నిసార్లు సత్యం కన్నా శాంతి ముఖ్యమవుతుంది, తర్కం కన్నా ప్రేమ గొప్పదవుతుంది.


కౌరవ వంశం బాహ్య శక్తుల వల్ల కాదు, అంతర్గత ద్వేషం వల్లే నశించింది‌‌. ఇది కుటుంబాన్ని బాహ్య శత్రువులు కన్నా  అంతర్గత విభేదాలే ఎక్కువ నాశనం చేస్తాయి అన్నదానికి  మహాభారతమే మనకు గొప్ప ఉదాహరణ.


కలహాలు రావడం అసహజం కాదు, కానీ కలహాల కంటే బంధం గొప్పదని గుర్తుంచుకొని వాటిని అధిగమించడం సంస్కారం. 


అంతిమంగా, కుటుంబం అనేది సంపూర్ణుల సమూహం కాదు, పరస్పర అపూర్ణతలను ప్రేమతో అంగీకరించిన మనుషుల పవిత్ర బంధం. ఇల్లు ఇటుకలతో నిర్మించబడితే,‌ కుటుంబం హృదయాలతో నిర్మించబడుతుంది.


కుటుంబం నిలవాలంటే ఒకరినొకరు మార్చుకోవాలని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి.


మన సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాల కుటుంబ ఐక్యతకు ఒక అందమైన మార్గదర్శక శ్లోకాన్ని‌ ఋగ్వేదం

*సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ ।*

అంటూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, పరస్పరం మనస్సులు తెలుసుకోండి, అని బోధించింది.

ఇదే ఆదర్శమైన కుటుంబ జీవనానికి అవసరమైన సూత్రం.



మృశి

(దశిక ప్రభాకర శాస్త్రి)

9849795167

11.04.2026

కామెంట్‌లు లేవు: