12, ఏప్రిల్ 2026, ఆదివారం

జయతాచ్ఛంకరోగురుః

 *జయతాచ్ఛంకరోగురుః-१९*


   జగత్తు ధర్మానికి అవసరమైనది ప్రవృత్తి మార్గము. ప్రకృష్టమైన ప్రధానమైన ప్రహృష్టమైన ప్రసార యోగ్యమైన వృత్తి ప్రవృత్తి. జగత్తునుంచి తరింౘడానికి అవసరమైన మార్గము నివృత్తి. నిర్వికారమైన నిరపేక్షితమైన నిస్తులమైన నిర్గుణతత్త్వ ప్రసారభూతమైనది నివృత్తి. మన సనాతన ధర్మాచరణకై ఈ రెండు మార్గములు ప్రశస్తములు అనన్యములు. ఎందరో అవతార పురుషులు ఈ రెంటిలో ఏదియో ఒక మార్గమును ప్రధానమైనదిగా మఱియొకటి గౌణమైనదిగా పరిగణించి ఆదరించి ఆచరించి అనుసరింపఁజేసినారు. వారిలో విష్ణుభగవానుని అంశావతారములలో ప్రవృత్తి మార్గము ప్రధానముగా నివృత్తి మార్గము గౌణముగా మనము దర్శింపవౘ్చును. శివ భగవానుడి అంశావతారములలో నివృత్తి మార్గము ముఖ్యతమముగా ప్రవృత్తి మార్గము నిమిత్తమాత్రముగా గోచరింౘును. కాలచక్ర భ్రమణమున కలుగు సృష్టి రక్షణకై ప్రవృత్తి ధర్మస్థాపనలో స్థితి కారకుఁడైన విష్ణు పరమాత్మ అవతారములెట్లనేకములో నివృత్తి ధర్మ ప్రసారమునకై లయ కారకుడైన శంకరదేవుని అవతారములట్లే యనేకములు. ముఖ్యంగా శ్రీరామచంద్రచక్రవర్తి శ్రీకృష్ణభగవానుడు ప్రవృత్తి ధర్మానికి ప్రతీకలుగా శ్రీ దక్షిణామూర్తి ఆదిశంకరభగవత్పాదులు నివృత్తి ధర్మానికి నిదర్శనములుగా మనకు దిశా నిర్దేశనము చేసినారు.

   వేదముల మూలమును అందించినది బ్రహ్మదేవుఁడు. మహర్షులైన బృహస్పతి వశిష్ఠ పరాశర వ్యాస జైమిని గర్గ... వేదమునందలి ఒక్కొక్క భాగమును విస్తరింప జేసిన వరిష్ఠులు. శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు సమస్త వేదస్వరూపులు. అందుకే వారు ఋషి పూర్ణ స్వరూపులని గణుతికెక్కినారు.


*వందే గురు పరంపరామ్*

కామెంట్‌లు లేవు: