శ్రీ సుందరమూర్తి నాయనారు (సంపూర్ణ చరిత్ర)
01. పూర్వజన్మ వృత్తాంతం
కైలాసంలో శివుడికి నిత్యం అలంకరణ చేసే సేవకుడు ఒకరు ఉండేవారు. అతని పేరు "హాలాహల సుందరుడు". ఒకరోజు తోటలో పూలు కోస్తుండగా, పార్వతీ దేవి చెలికత్తెలైన 'కమలిని', 'నిందిత' (అనిందిత) అనే ఇద్దరు అద్భుతమైన సౌందర్యరాశులను చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిలు కూడా సుందరుడిని ఇష్టపడతారు.ఈ విషయం సర్వజ్ఞుడైన శివుడికి తెలుస్తుంది. "కైలాసంలో కామ వాంఛలకు తావు లేదు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ముగ్గురూ భూలోకంలో జన్మించండి. మీ ఆశలు తీరాక తిరిగి నా దగ్గరకు వద్దురు గాక" అని ఆశీర్వదించి పంపిస్తాడు.
02. జననం -
రాజభోగం:శివుడి ఆజ్ఞ మేరకు ఆ సుందరుడు, తమిళనాడులోని 'తిరుమునైపాడి' అనే రాజ్యంలోని 'తిరునైవలూరు' గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు "నంబి ఆరూరార్".అతని అందం చూసి ముచ్చటపడిన ఆ దేశపు రాజు 'నరసింగ మునియరైయార్', బ్రాహ్మణుల అనుమతితో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రాజకుమారుడిలా పెంచాడు. వేదాలతో పాటు యుద్ధ విద్యలు, రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు.
3. పెళ్లి మండపంలో గొడవ
యుక్తవయసు రాగానే సుందరుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. సరిగ్గా మాంగళ్యధారణ సమయానికి, ఒక వృద్ధ బ్రాహ్మణుడు (శివుడు) చేతిలో తాటియాకుల గ్రంథం పట్టుకుని అక్కడికి వచ్చాడు.* వృద్ధుడు: "ఆగండి! ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ వరుడు నా బానిస."* సుందరుడు (కోపంతో): "పిచ్చివాడా (పిత్తా)! ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి బానిస ఎలా అవుతాడు? పో ఇక్కడి నుంచి."* వృద్ధుడు: "ఇదిగో సాక్ష్యం. నీ తాతగారు స్వయంగా రాసిచ్చిన పత్రం ఇది. 'మా వంశం మొత్తం ఈయనకు బానిసలుగా ఉంటాం' అని రాసి ఉంది."సభలోని పెద్దలు ఆ పత్రాన్ని పరిశీలించి, అది నిజమేనని తేల్చారు. సుందరుడు ఓడిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. ఆ ముసలివాడి వెంట బానిసగా వెళ్ళాడు
04. జ్ఞానోదయం
- మొదటి పాట:ఆ వృద్ధుడు సుందరుడిని తీసుకుని 'తిరువెణ్ణైనల్లూర్' శివాలయానికి తీసుకెళ్లి, గర్భగుడిలోకి వెళ్లి మాయమయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది."సుందరా! వాదనలో నన్ను పిచ్చివాడా (పిత్తా) అన్నావు కదా! ఆ పేరుతోనే నన్ను స్తుతిస్తూ పాట పాడు. భూమిపై నీ జీవితం ఉన్నంత కాలం నేను నీకు వెన్నంటే ఉంటాను."అప్పుడు సుందరుడు కన్నీళ్లతో "పిత్తా పిరై సూడి..." (ఓ పిచ్చివాడా! నెలవంకను ధరించినవాడా!) అంటూ తన మొదటి "తేవార" గీతాన్ని పాడాడు.
05. ఇద్దరు భార్యలు
- విచిత్ర దాంపత్యం:భూలోకానికి వచ్చింది పూర్వజన్మలో ఇష్టపడ్డ ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికే కదా!* తిరువారూర్ అనే ఊరిలో రుద్రగణిక కులంలో పుట్టిన 'పరవైయార్' (కమలిని అవతారం)ను చూసి ప్రేమించి, శివుడి ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నాడు.* కొన్నాళ్ళకు తీర్థయాత్రలకు వెళ్లి తిరువొత్తియూర్ అనే ఊరిలో 'సంకిలియార్' (నిందిత అవతారం)ను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి, "నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్లను" అని ప్రమాణం చేశాడు. కానీ శివుడి ఉత్సవాలు చూడాలనే ఆత్రుతలో ఆ ఊరు దాటగానే అతనికి కళ్లు పోయాయి (ప్రమాణ భంగం వల్ల)
06. స్నేహితుడిగా శివుడు
సుందరుడి చరిత్రలోముఖ్య ఘట్టం ఇదే. దేవుడిని ఒక ఆత్మమిత్రుడిగా చూశాడు.* బంగారం అడిగాడు: కరువు వచ్చినప్పుడు ప్రజలకు అన్నదానం చేయడానికి, ఇంటి ఖర్చుల కోసం శివుడిని నేరుగా బంగారం అడిగేవాడు. శివుడు ఇచ్చేవాడు కూడా!* శివుడే రాయబారి: మొదటి భార్య పరవైయార్‌కి, సుందరుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపం వచ్చింది. ఆమెను శాంతింపజేయడానికి సాక్షాత్తు పరమశివుడిని అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి దూతగా పంపాడు సుందరుడు. భక్తుడి కోసం దేవుడు వీధిలో నడిచి వెళ్లి రాజీ కుదిర్చాడు.
07. తిరుత్తొండ త్రొగై (నాయనార్ల చరిత్ర):
తిరువారూర్ దేవాలయంలో భక్తులందరూ ఉండగా, సుందరుడు గర్భగుడి వైపు వెళ్తుంటే "మా భక్తులను గౌరవించని వాడిని దేవుడు కూడా గౌరవించడు" అని విరన్మిండ నాయనారు అంటారు.అప్పుడు శివుడు సుందరుడికి, "నా భక్తుల గొప్పతనం నీకు తెలియదు.. వారి గురించి పాడు" అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుందరుడు "తిరుత్తొండ త్రొగై" అనే పదికాన్ని పాడాడు. ఇందులో 63 మంది నాయనార్ల పేర్లు, వారి గొప్పతనాన్ని ఒక్కో లైన్లో చెప్పాడు. దీని ఆధారంగానే తర్వాత 'పెరియపురాణం' వచ్చింది.
08. కైలాస ప్రాప్తి:
సుందరుడు తన 18వ ఏటనే భూమిపై తన కర్మ పూర్తి చేసుకున్నాడు. శివుడు అతన్ని తీసుకెళ్లడానికి ఐరావతాన్ని (తెల్ల ఏనుగు) పంపాడు. సుందరుడు దానిపై ఎక్కి కైలాసానికి వెళ్తుండగా, అతని మిత్రుడైన 'చేరమాన్ పెరుమాళ్' (మరొక నాయనారు) అది చూసి, తన గుర్రం చెవిలో శివమంత్రం చెప్పి, ఆ గుర్రంతో సహా ఆకాశమార్గాన కైలాసానికి వెళ్ళాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి