29, మార్చి 2026, ఆదివారం

పొగడ్తల రకాలు*

 *పొగడ్తల రకాలు*


పొగడ్తల్లో రెండు రకాలు. ఒకటి వ్యాజ స్తుతి, మరోటి వ్యాజ నింద. ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయంటే కొన్ని పొగడ్తలు బయటకి పొగుడుతున్నట్టే ఉంటాయి కాని లోపలి అర్ధం తిట్టడమే. దీన్నే వ్యాజ స్తుతి అని అంటారు. అంటే స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.


ఇందాకా చెప్పినట్టు మరొకటి బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని, నిజానికి అది పొగడడమే. దీన్ని వ్యాజ నింద అని అంటారు. నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.


ఇలా పొగడ్తల గురించిన వివరాలు ఇవ్వడానికి సందర్భం ఇదిగో. 


కవిత్వం అడగటానికి, చెప్పటానికీ వేళ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా అడిగితే ఎంత మెత్తని వానికైనా విసుగు పుడుతుంది. కోపమూ రావచ్చు. 


శ్రీనాథుని వంటి సకల విద్యాసనాథుని ఎవరుపడితే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పద్యం చెప్పండి అనో, సమస్య పూరించండి అనో అంటే ఊరుకుంటాడా? వేళగాని వేళ ఒకడెవరో అడిగాడు. 


*అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే* 


ఈ సమస్య పూరించండి! అన్నాడు, అదీ సదస్సులో. వాడెవడో అల్పుడై ఉండాలి. 


వెంటనే కవిరాజు శ్రీనాథుడి నోట ఈ పద్యం హాస్యలాస్యంగా వెలువడింది.


*కొందరు భైరవాశ్వములు కొందరు పార్ధుని తేరిటెక్కెముల్‌ కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్‌ కొందరు కృష్ణజన్మమున కూసినవారలు ఈ సదస్సులో అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!*

  

మన శ్రీనాథ కవులవారు ఈ పద్యంలో ఆశ్రయించింది వ్యాజ స్తుతి అన్నట్టు. ఆ పదాలు, వాడిన తీరు గమనిస్తే పొగడినట్టే కాని లోలోపల ఎంత అక్కసు ఉందంటే వారందరు అంటే ఆ పద్యంలో సంబోధింపబడిన వాళ్ళందరు కుక్కలు, కోతులు, పందులు, దున్నపోతులు, గాడిదలని. 


వాళ్ళకి మాత్రమే కాదు, ఆ జంతువులు కూడా చిందులు వేయగలవు ఇలాంటి మూర్ఖులను తమతో అన్వయించినందులకు.

😀😀

కామెంట్‌లు లేవు: