శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(28-3-'26 పోష్టు తరువాయి భాగము)
సీతారామ కళ్యాణానంతరం, పరివారసహితుడై అయోధ్యకు తిరిగివెళ్తున్న దశరథ మహారాజుకు మార్గమధ్యంలో, హఠాత్తుగా పరశురాముడు ప్రత్యక్షమవడం గురించి, ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాం.
ఇరవైయొక్క మార్లు ప్రపంచమంతా తిరిగి, సకల క్షత్రియ సంహారం చేసిన ఆ పరశురాముడు, తన గురువైన శివుని యొక్క ధనుస్సును విరిచిన రామునియందు తీవ్రమైన క్రోధంతో ఉన్నాడు.
సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న ఆ "పరశురాముడు"
హఠాత్తుగా ఆవిధంగా ప్రత్యక్ష మవగానే వశిష్ఠాది ఋషులు ఆశ్చర్యపోయారు.
తన తండ్రి హత్యకు ప్రతీకారంగా క్షత్రియవధ చేసి, కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు, మళ్లీ క్షత్రియనాశనానికే వచ్చాడా అనుకుంటూ, ఆ మహర్షులంతా శాస్త్రోక్తవిధానంగా ఆయనకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు.
"రామా!రామా!" అని మధురంగా సంబోధిస్తూ పరశురాముని పూజించారు.
పరశురాముడు శాస్త్రోక్తమైన వారి పూజను స్వీకరించాడు.
రాముని పరీక్షగా చూస్తూ అతనితో ఇలా అన్నాడు:
శ్లో//రామ! దాశరథే రామ! వీర్యం తే శ్రూయతే౽ద్భుతమ్ /
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్//
(ఓ దశరథ రామా! రామా! నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. నీవు చేసిన శివధనుర్భంగం గురించి కూడా పూర్తిగా విన్నాను)
నీవు చేసిన శివధనుర్భంగము,అద్భుతమే కాదు, ఎవరూ మనస్సులో కూడా ఊహించుటకు శక్యం కానిది.
అది విని నేను మా తండ్రి జమదగ్నిమహర్షి ద్వారా నాకు సంక్రమించిన వేరొక గొప్ప ధనస్సును తీసుకు వచ్చాను.
ఇది నీవు ఎక్కుపెట్టగలిగితే, అప్పుడు నిన్ను నాకు సమ ఉజ్జీగా భావించి నీతో ద్వంద యుద్ధం చేస్తాను",
అన్నాడు.
పరశురాముడు పలికిన ఈ మాటలు విని దశరథుడు విషణ్ణుడయ్యాడు.
రాముని సంహరించవద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు.
శ్లో// భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయ వ్రత శాలినామ్/
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి//
( ఓ భార్గవ రామా! నిత్య స్వాధ్యాయము మొదలైన ఉత్తమ వ్రతములాచరించే భృగు వంశంలో జన్మించావు.శస్త్రధారణ చేయనని దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచి వేశావు).
నీ చేత జయింపబడిన భూమినంతా "కశ్యప మహర్షి"కి దానమిచ్చి, శాంతుడవై "మహేంద్రగిరి"పై నివాసమేర్పరచుకున్నావు.
ఓ మహామునీ! రాముణ్ణి సంహరించ వద్దు.
రాముణ్ణి సంహరిస్తే మేమందరమూ మరణింతుము కదా!"
అని ఈ విధంగా ప్రాధేయపడుతున్న దశరథుని మాటలు లెక్కచేయకుండా,
పరశురాముడు,దశరథ రామునితో ఇలా అన్నాడు:
"విశ్వకర్మచేత నిర్మించబడిన ఈ రెండు ధనస్సులు దివ్యమైనవి.
త్రిపురములను నశింపజేయటానికి, శివుడు ఉపయోగించిన, ధనస్సును నీవు విరిచావు.
ఇప్పుడు నేను తీసుకు వచ్చినది విశ్వకర్మ నిర్మించిన రెండవ ధనస్సు. దీనిని దేవతలు విష్ణుమూర్తికి ఇచ్చారు.
శ్లో// ఇదం ద్వితీయం దుర్ధర్షం,విష్ణోర్దత్తం సురోత్తమైః/
తదిదం వైష్ణవం రామ ధనుః పరమ భాస్వరమ్/
సమాన సారం కాకుత్థ్స రౌద్రేణ ధనుషాత్విదమ్//
(ఓ కాకుత్థ్సా! ఎవరికీ ఎదిరింప శక్యము గాని ఈ రెండవ ధనస్సును దేవతలు విష్ణువునకిచ్చినారు.
మిక్కిలి ప్రకాశవంతమైన ఈ వైష్ణవ చాపము శివ ధనస్సుతో సమాన సారం కలది).
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
29-3-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి