విజయవాడలోని సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ - ఇప్పుడొక జ్ఞాపకం మాత్రమే :
వేసవి అంటేనే భయం . అందులో నూ చాలా మందికి బెజవాడ ఎండలు అంటే మరీ భయం. అటువంటి బెజవాడలో సత్యనారాయణ పురం అనే ప్రదేశం గురించి అందులో నివసించిన ప్రముఖ వ్యక్తులు ఎన్నోసార్లు ఈ మాధ్యమం ద్వారా తమ అభిప్రాయాలను అందంగా పంచుకున్నారు. నేను కూడా బెజవాడ వాసిని అయినా, ఆ ప్రదేశం తో ఎక్కువ పరిచయం లేకపోవడం చేత , దాని విశిష్టత ను వారందరి కంటే ఎక్కువగా చెప్పలేను. కానీ, సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ గురించి ఎప్పుడూ ప్రస్తావన ఉండేది కాదు, ఉనికిని కోల్పోయిన ఈ రోజు అసలే లేదు.
ఒకప్పుడు రైవస్ కాలువకి, ఏలూరు కాలువకి మధ్యగా , రైల్వే మార్గానికి అవతల ప్రక్కగా ఊరుకు ఉత్తరాన ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని కప్పుకుని ఉన్న చిన్న కాలనీ వంటి ప్రదేశం సత్యనారాయణ పురం . ఈ ప్రాంతానికి ఒక రైల్వే స్టేషన్ కూడా ఉండేది. ఆ స్టేషన్ సత్యనారాయణ పురాన్ని ; గాంధీనగరానికి శివారు, రామానగరంకి జోడు అయిన దుర్గా పురాన్ని విడదీసింది. వింత ఏమిటంటే , అది సింగిల్ రైల్వే లైన్ అవడం చేత , ఈ స్టేషన్ లోకి ప్రవేశ మార్గం దుర్గాపురం లోంచి మాత్రమే ఉండేది . స్టేషన్ ముందున్న పళ్ల దుకాణాలు, చిన్న కాఫీ హోటల్ , సైకిల్ షాపు , పూల కొట్టు దుర్గాపురానికి ఒక పల్లెటూరు వాతావరణం ఇచ్చాయి. స్టేషన్ బయట రిక్షాలు నిలిపి ఉండేవి. అటువంటి దుర్గాపురం కి శరభయ్య గారి గుడి ప్రత్యేకత . అందులోని ఎత్తైన రథం , ధ్వజ స్తంభం ప్రాచీన ఛాయలు కలుగజేసేవి . ఆ గుడి ప్రక్క రోడ్డు మొదట్లో రైల్వే లైన్ కి దగ్గరగా నేషనల్ లిథో ప్రింటర్స్ ఉండేది. అప్పటి సినిమా పోస్టర్లు అక్కడే తయారయ్యేవి.
సత్యనారాయణపురం స్టేషన్ దగ్గర గాంధీనగరం వైపు రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు ఉండేది. గాంధీనగరం నుంచి సత్యనారాయణ పురం వెళ్లడానికి ఆ గేటు దాటి వెళ్లాల్సిందే. రైళ్లు తరచుగా రావడం చేత ఈ గేటు మాటి మాటికి మూసివేసేవారు. విజయవాడలో ఈ గేటు ఒక్కటే రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండేది . ఈ స్టేషన్ బందరు రైల్వే మార్గంలో ఉండి, విజయవాడ తర్వాత వచ్చే స్టేషన్. ఈ గేటు దగ్గరలో ఒక ఖాళీ స్థలం ఉండేది. అందులో త్రీ రింగ్ కమలా సర్కస్ ఆడినప్పుడు మొట్ట మొదటి సారి సర్కస్ యాజమాన్యం సెర్చ్ లైట్ ఫోకస్ తో సర్కస్ పట్టణ ప్రవేశాన్ని తెలియజేశారు . తర్వాత రోజుల్లో కొంత కాలం ఆ ప్రాంతంలో రామకోటి సప్తాహాలు జరిగాయి. ఆ ప్రదేశంలోనే మొట్టమొదటిగా సంగీత కళాశాల కూడా ప్రారంభించారు.
స్టేషన్ కి రెండవ చివర ఒక గేటు లేని లెవెల్ క్రాసింగ్ ఉండేది. ఆ రోజుల్లో పోటీగా నడిచే ప్రైవేట్ సిటీ బస్సుల్ని ప్రధాన రైల్వే గేటు మూసినప్పుడు, ఈ గేటులేని( unmanned ) క్రాసింగ్ వైపు బస్సును వేగంగా నడిపించి సత్యనారాయణ పురంలోకి ప్రయాణీకుల్ని చేరవేసేవారు. అటువంటి ఒక సందర్భంలో నేను ఎక్కిన సిటీ బస్సు దైవికంగా ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ గేటు దగ్గరకే ఘంటసాల పేరిట ప్రభుత్వ సంగీత కళాశాలను మార్చారు.
సత్యనారాయణ పురం స్టేషన్ కు పగలు ఏ రైళ్లు వచ్చినా అంత తెలిసేది కాదు కానీ, అర్ధరాత్రి బందరు నుంచి ఒకటి వచ్చేది. దాన్ని దయ్యాల బండి అని, తెల్లవారుఝామున వచ్చే రైలులో పాల వాళ్లు ప్రక్క గ్రామాల నుంచి పాలు తెచ్చేవారు. అందుకని ఆ రైలును పాల బండి అనేవారు.
సత్యనారాయణ పురం లో ప్రముఖ శాస్త్రీయ గాయకుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పుట్టి పెరిగిన ఇల్లు ఉండటం, ఒక శివాలయం తో పాటు, మంచి రుచికరమైన టిఫిన్స్ అందించిన శివాజీ హోటల్ ,ఒక చిన్న లైబ్రరీ, ఒక మునిసిపల్ స్కూలు , కొంతమంది పాతకాలం సినిమా తారల ఇళ్లు కూడా ఉండటం ఆ ప్రాంతానికి ప్రత్యేకత తెచ్చింది . శివాలయంలో వివాహాలు కూడా జరిగేవి.
మొదటి నుంచి నాకు అటువైపు వెళ్లే అవకాశం ఎక్కువగా లేకపోవడం చేత అక్కడి విషయాలు బాగా తెలియవు. అయినా 1975 లో తాత్కాలికంగా ఆ ప్రాంతంలో రెండు నెలలు వుండాల్సి వచ్చింది. అప్పుడు నేను రేలంగి వద్ద ఇంటిని కొన్నవారి ఇంట్లో నేను అద్దెకున్నాను . ప్రక్కనే కన్నాంబ గారిల్లు ఉండేది. ఏలూరులో అగరుబత్తీల ఫ్యాక్టరీల మాదిరి , ఆ వీధిలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలు రెండో, మూడో ఉండేవి.
ఇప్పుడు ఆ సత్యనారాయణపురం స్టేషన్ లేదు, రైల్వే లైనూ లేదు. స్టేషన్ ని 2001 లో తీసివేసి, దానిపైన వెడల్పైన రింగ్ రోడ్ ఒకటి వెలిసి, అది రామవరప్పాడును హోటల్ నోవాటెల్ వద్ద కలిసి ఏలూరు వైపు వాహనాల ప్రయాణం అతి శీఘ్రం చేసింది . అదే BRTS రోడ్ (Bus Rapid Transit System Road). ఇప్పుడు ఈ రోడ్డుకు ఇరుపక్కలా వాణిజ్య సముదాయాలు ఎన్నో ఏర్పడ్డాయి. పెరిగే జనాభా, దానితో ముడిపడి పెరిగిన వాహనాల కారణంగా దుర్గాపురం , సత్యనారాయణ పురం ప్రాంతాలు అనూహ్యంగా విస్తరించడానికి ఈ రోడ్డు దోహదం చేసింది . ఒకప్పుడు పురాన్ని పట్టణంతో విడదీసిన రైలు మార్గంలో, ఇప్పుడున్న 4 కి మీ పొడవు , 4 మార్గాలున్న (lanes)ఈ విశాలమైన రోడ్డు మార్గం ఆ ప్రాంతానికి కొత్త ఛాయలు ఏర్పరచింది.
ఈ రోడ్డుపై ఈ మధ్య వెళ్ళిన నేను విజయవాడలో ఏర్పడిన అనూహ్యమైన ఈ ముఖ్య మార్పుకు ఆశ్చర్య పడ్డాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి