21, ఏప్రిల్ 2026, మంగళవారం

వైశాఖ శుద్ధ పంచమి

 శ్రీరామ (125)


(నేడు 21-4-'26, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురు

 శ్రీ ఆదిశంకరుల జయంతి).


శ్లో//శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, 

అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై,

సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                             --------


శ్రీ శంకరభగవత్పాదులవారు కాలడిలో జన్మించడం, దుర్మతములను ఖండిస్తూ, భారతదేశమంతా మూడు పర్యాయములు పర్యటించడము, ప్రజలకు తన తరువాత కూడా సన్మార్గాన్ని నిరంతరం బోధించుటకు నలుదిక్కులా నాలుగు చతురామ్నాయ మఠములను స్థాపించడము అందరికీ తెలిసిన విషయమే.

అయితే ముఖ్యమైన విషయం వారి అద్వైత బోధ.

మానవజన్మ శాశ్వత సుఖం సంపాదించటానికి వచ్చింది.

దీనికి విరుద్ధంగా మానవజాతి అశాంతితోను, దుఃఖముతోను బాధపడుతున్నది.

దీనికి కారణం అజ్ఞానం.

సద్గురువులందరికి అజ్ఞానంతో దుఃఖములపాలవుతున్న ప్రజాబాహుళ్యంపై కరుణ ఎక్కువ.

శ్రీ శంకరభగవత్పాదులవారు కరుణామయులు

మానవులు సకల దుఃఖములనుండి తరించి, శాశ్వతానందం పొందగలిగే "అద్వైత స్థితిని" అనుభవం ద్వారా తెలుసుకున్నవారు. 


సామాన్యులకు కోట్లాది పూర్వజన్మలలో చేసిన పుణ్య పాపములు, అనేక జన్మలను కలిగించి నిరంతరం సుఖదుఃఖాలను అనుభవింపజేస్తూ ఉంటాయి.


బ్రహ్మజ్ఞాని మాత్రం ఆ పూర్వజన్మ కర్మలన్ని నశింపజేసుకొని శాశ్వతానందంలో ఉంటాడు.


అయితే బ్రహ్మజ్ఞానం ఉదయించగానే జ్ఞాని విదేహముక్తుడవుతాడని (అనగా దేహం నశిస్తుందని) కొందరంటారు.


కానీ అన్ని కర్మలు నశించినా ఇప్పుడు నడుస్తున్న జన్మ ఏ కర్మవల్ల వచ్చిందో ఆ కర్మమాత్రం దేహం నశించేపర్యంతం ఉంటుందని, 

దేహం నశించగానే అనగా మరణించగానే,ఆ కర్మ కూడా నశిస్తుందని, ఉపనిషత్తులు చెబుతున్నాయి.


భగవంతుని సంకల్పాన్ననుసరించి వేదవ్యాసమహర్షి వంటి కొంతమంది బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానం ఉదయించిన పిమ్మట కూడా శరీరధారణ చేస్తూ జగత్కార్యం నిర్వహిస్తున్నారు. 


అలాగే శ్రీ శంకరభగవత్పాదులవారు బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత కూడా కొంతకాలం దేహధారణ చేసి, లోకకల్యాణం కోసం అద్వైత స్థితి ఎలా సాధించాలో ప్రచారం చేశారు.


తాము బ్రహ్మజ్ఞానులై జీవన్ముక్తులుగా సంచరిస్తున్న తమ అనుభవాన్ని, శ్రీ శంకరభగవత్పాదులవారు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా సూచించారు.

        (బ్ర.సూ. భాష్యం 4 - 1 -15)


" అపి చ నైవాత్ర విదితవ్యం, బ్రహ్మవిదా కంచిత్కాలం శరీరం ధ్రియతే వా న వా ఇతి.

కథం హ్యేకస్య స్వహృదయ ప్రత్యయం, బ్రహ్మ వేదనం, దేహధారణం, చ అపరేణ ప్రతిక్షేప్తుం శక్యేత ? శ్రుతి, స్మృతిషు చ స్థితప్రజ్ఞ లక్షణ నిర్దేశేన ఏతదేవ నిరుచ్యతే "

( బ్రహ్మవేత్త కొంతకాలం శరీరాన్ని ధరించి జీవన్ముక్తుడుగా ఉంటాడా, ఉండడా, అని వివాదం చేయవలసిన పని లేదు. ఒకని హృదయానికి ప్రత్యక్షంగా గోచరిస్తున్న బ్రహ్మజ్ఞానము, దేహధారణము అనే వాటిని ఇతరుడు ఎలా నిరాకరించగలుగుతాడు ?

శ్రుతి స్మృతులలో స్థితప్రజ్ఞుని లక్షణాలను నిర్దేశించడంచేత ఇదే నిర్వచింప బడుచున్నది)


దీన్నిబట్టే ద్వైత, విశిష్టాద్వైత, సిద్ధాంతాలు సంపూర్ణజ్ఞానం ప్రసాదించలేవని,

అద్వైతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న 

శ్రీ శంకరుల సిద్ధాంతమే సత్యమని మనం గ్రహించవచ్చు.


భగవత్తత్త్వం అవగాహన చేసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

ఆ అవగాహనతో శాశ్వతానంద స్థితిలో ఉండటమే అద్వైతస్థితి.

అది ఈశ్వరానుగ్రహంతోనే సాధ్యం.


వేదం భగవంతుని గురించి

 "సత్యం, జ్ఞాన,మనంతం,బ్రహ్మ" 


(భగవంతుడు ఉన్నాడు.ఆయన సర్వజ్ఞుడు. సర్వ జగత్తును వ్యాపించి ఉన్న ఆ భగవంతుడు ఆద్యంతములు లేనివాడు)

 అని ఉపదేశించింది.

అది యథాతథంగా తెలుసుకోవడమే "బ్రహ్మజ్ఞానం" అన్నా, "ఆత్మజ్ఞానం"అన్నా.

అలా తెలుసుకున్నవాడు సమస్త దుఃఖములనుండి తరిస్తాడు.

అందువల్ల శ్రుతి "తరతి శోక మాత్మవిత్" (ఆత్మవేత్త సమస్త దుఃఖములనుండి తరిస్తాడు) అని చెబుతున్నది.


ఈ అద్వైత స్థితి భగవంతుని అనుగ్రహం వలన వస్తుంది అని ఉపదేశించారు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు. 


శ్లో// ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా/

మహాభయ కృత త్రాణా ద్విత్రాణాం యది జాయతే//

(జన్మ,మరణాది రూప సంసారం గురించిన మహాభయం పోగొట్టి,మోక్షస్థితి కలిగించే అద్వైత భావన, కోట్లాది మందిలో ఏ ఇద్దరు, ముగ్గురికో కలిగిందంటే అది కేవలం ఈశ్వరుని అనుగ్రహం వల్లనే). 



 "పరమేశ్వరుడు" అనేవాడు ఒకడున్నాడు,

 ఆయన అనుగ్రహం సంపాదించాలి,

 అనే ఆలోచన సంసారంలో నిమగ్నుడైన జీవునకు కలుగదు.

అంతేకాదు, పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా దేవునియందు అవిశ్వాసము,ద్వేషము కూడా కలుగుతాయి.


శ్లో//మహా పాపవతాం పుంసాం జ్ఞానయజ్ఞో 

న రోచతే/

ప్రత్యుత జ్ఞానయజ్ఞస్తు ప్రద్వేష్యో భాసతే స్వతః//


(పూర్వజన్మ పాప ప్రతిబంధకం వల్ల పురుషులకు జ్ఞానమార్గం రుచించక పోవడమే కాకుండా, దానిని గూర్చి స్వతః ద్వేషము కూడా జనించును).


మరి ఏ విధంగా ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందో

వేదమాత ఇలా చెబుతున్నది:

" అణోరణీయా న్మహతో మహీయా నాత్మాగుహాయాం నిహితో౽స్య జన్తోః/

తమక్రతుం పశ్యతి వీతశోకో థాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్ "

(ఆ పరమాత్మ అణువు కంటే సూక్ష్మమైన వాడు. గొప్పవైన ఆకాశాదికముకంటే గొప్పవాడు.

దేవ,మనుష్యాది ప్రాణిజాతము యొక్క హృదయ పద్మమందలి "బుద్ధి" అనే గుహలో గురువు ఉపదేశించిన విద్యచేత పొందబడుతున్నాడు.

ఈ స్థితి,

 "థాతుః - సర్వ జగన్నిర్మాత కాబట్టి థాత శబ్దముచే చెప్పబడుతున్న పరమేశ్వరుని యొక్క,

ప్రసాదాత్-- అనుగ్రహం వల్లనే,

మహిమానం - మిక్కిలి గొప్పవాడు,

ఆక్రతుం -- ఏ సంకల్పములు లేనివాడు అయిన

తం ఈశం -- ఆ ఈశ్వరుని,

పశ్యతి--సాక్షాత్కారం చేసికొనుచున్నాడు.

సాక్షాత్కారం చేసుకుని,

వీత శోకః--జన్మ,మరణాది శోకరహితుడు అగుచున్నాడు)


ఈ విధంగా "పరమేశ్వరుని" అనుగ్రహం వల్లనే ఆత్మ జ్ఞానం కలిగి జీవుడు సంసార బంధములనుండి ముక్తుడవుతాడు అని వేదమాత ఉద్బోధిస్తోంది.


ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఆయన ఆజ్ఞలైన

 "సత్యం వద(ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుము),

"ధర్మం చర"(ధర్మమునాచరింపుము),

"మాతృదేవో భవ" (తల్లిని దైవముగా పూజింపుము),

"పితృదేవో భవ" (తండ్రిని దైవముగా పూజింపుము)

మొదలైన సత్కర్మానుష్ఠానం వల్ల లభిస్తుంది.

ఈ వేద బోధలన్నింటినీ సమన్వయపరిచి మానవజాతి మీద ఉన్న పరమ కారుణ్యంతో,

 జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులవారు,

తాము ఏ మార్గాన్ని అనుసరించి అద్వైత స్థితి సాధించారో ఆ సన్మార్గాన్ని 'వేదో నిత్య మధీయతాం' తో మొదలైన ఉపదేశపంచకం అనే ఐదు శ్లోకములలో మనకు ఈ విధంగా అనుగ్రహించారు.



1. నిత్యము వేదాధ్యయనము,(లేదా తత్తుల్యములైన పురాణములను అధ్యయనం) చేయాలి.

2. ఆ వేదములందు చెప్పబడిన నిత్య,నైమిత్తికాది సత్కర్మలను చక్కగా ఆచరించాలి.

3. ఆ కర్మలయొక్క ఫలములను ఆశింపక, వాటిని ఈశ్వరునకు అర్పించి, అ ఈశ్వరుని భక్తిపూర్వకంగా ఆరాధన చేయాలి.

4. క్రమ క్రమంగా, కామ్యకర్మలందు ఆసక్తి త్యజించాలి.

5. సత్కర్మానుష్ఠానంతో, జ్ఞానోత్పత్తికి అవరోధంగా ఉన్న పాపములను పోగొట్టుకోవాలి.

6. ప్రాపంచిక సుఖములు దోషభూయిష్ఠములనే విషయం గ్రహించి, వాటియందు వైరాగ్యం వహించాలి.

7. ఆత్మజ్ఞానమునందు కోరికను దృఢంచేసుకోవాలి.

8. ఆ కోరిక ధృఢమైన వెంటనే నిరాటంకంగా సాధన సాగించి, అద్వైత స్థితి సాధించేందుకు స్వగృహము నుండి బయటపడాలి.

9. సత్పురుషులతో సాంగత్యము చేయాలి.

10. ఆ సాంగత్యం వల్ల భగవంతుని యందు భక్తిని దృఢం చేసుకోవాలి.

11.బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము అయిన శమదమాదులు వృద్ధి చేసుకోవాలి.

12.తరువాత సన్యాసం స్వీకరించాలి.

13. బ్రహ్మవేత్తయైన విద్వాంసుని గురువుగా ఏర్పరచుకుని వారికి తనను సమర్పించుకోవాలి.

14. అనుదినము భక్తితో గురువును సేవించాలి.

15. బ్రహ్మతత్త్వమును ఉపదేశించమని వారిని ప్రార్థించాలి.

16. గురువుయొక్క ఉపదేశమును ఏకాగ్రతతో శ్రవణం చేయాలి.

17. గురువు ఉపదేశించిన వాక్యములను యథాశాస్త్రంగా విచారణ చేయాలి.

18. ఆ విచారణ తన బుద్ధికి తోచినట్లు చేయక వేదసమ్మితమైన పక్షమునే ఆశ్రయించి విచారణ చేయాలి.

19. దుస్తర్కమును చేయకూడదు.

20. శ్రుతి సమ్మతమైన తర్కముతో వాక్యముల అర్థమును నిశ్చయించుకోవాలి.

21. ఆ నిశ్చయముయొక్క పర్యవసానంగా జీవుడు, భగవంతుడు, ఒకడేనని, భేదము లేదని గుర్తించి, జీవుడననుకొనుచున్న తాను బ్రహ్మను అని దృఢముగా భావించాలి.

22. ఆ భావనా బలంతో గర్వమును నిశ్శేషంగా పరిత్యజించాలి.

23. పాంచభౌతికమగు ఈ దేహమునందు "నేను"అను బుద్ధిని విడనాడాలి.

24. పండితులతో వాదములు చేయకూడదు..

25. ఆకలి అనునది వ్యాధి అని, దానికి చికిత్స చేయాలి అనే భావన కలిగి ఉండాలి.

26. ఆ ఆకలివ్యాధిని శమింపజేయుటకు 'భిక్ష' అను ఔషధమును స్వీకరించాలి.

27. రుచికరమైన పదార్థములను యాచించ కూడదు.

28. దైవవశంతో లభించినదానితో తృప్తి పడాలి.

29. శీతోష్ణములు, జయపరాజయములు, లాభనష్టములు,సుఖదుఃఖములు, మొదలైన ద్వందములను ఓర్పుతో సహించాలి.

30. వ్యర్థముగా లౌకిక వాక్యములు పలకడం మానివేయాలి.

31. అన్ని విషయములందు ఉదాసీన భావము అలవర్చుకోవాలి.

32. జనులు తనయందు దయాభావం కలిగి ఉండాలి అనే భావము, తనను ఎవరూ నిందించకూడదు అనే భావము త్యజించాలి.

33. ఏకాంత ప్రదేశంలో సుఖముగా కూర్చోవాలి.

34. బ్రహ్మ తత్త్వమునందు చిత్తమును ఏకాగ్రం చేసి ఆ తత్త్వమును ధ్యానిస్తూ ఉండాలి.

35.పరిపూర్ణముగా ప్రపంచమంతా వ్యాపించినది,సర్వాత్మకమైనది యగు తన శుద్ధాత్మ స్వరూపమును సాక్షాత్కరించుకోవాలి.

36. 'అహంబ్రహ్మాస్మి' తానే బ్రహ్మ అనే విజ్ఞానముచే, దృశ్యమానమగు ఈ ప్రపంచము తనకంటే వేరుగా లేదని గుర్తించాలి.

37. బ్రహ్మ, ఆత్మ(తాను) ఒకటే అనే జ్ఞానముచే జీవన్ముక్త భావమును పొంది, జ్ఞానోదయమునకు పూర్వము తానార్జించిన కర్మలనన్నిటినీ నశింపజేయాలి.

38. ఆ జీవన్ముక్త భావము యొక్క బలముతో ముందు చేయబోవు కర్మలతో సంశ్లేషము పొందకుండా ఉండాలి.

39. ఈ దేహారంభానికి కారణమైన ప్రారబ్ధ కర్మను నిర్లిప్తంగా అనుభవించాలి.

40. ప్రారబ్ధ కర్మ వేగము నశించగా తాను శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడై ఉండిపోవాలి (విదేహముక్తి)


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

21-4-'26.

కామెంట్‌లు లేవు: