9, మే 2026, శనివారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

      *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

              *82వ భాగం*


*శ్రీరామావతారం -3*

*తాటకి సుబాహువుల వధ *అహల్యా శాప విమోచనం*```


దశరథుడు తనకు అతిప్రియమైన శ్రీరామునితో ఎక్కువ కాలం ఉండలేక పోయాడు. ఒకరోజు దశరథుని రాజసభకు కార్యార్థియై విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. 


దశరథుడు మహర్షిని సాదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచితాసనుని చేసి నమస్కరించి “వచ్చిన కార్యం ఆజ్ఞాపించమని” వినయంగా అడిగాడు.


విశ్వామిత్రుడు దశరథునితో “రాజా! విశ్వశాంతి కోసం నేను యాగం చేస్తూ యాగదీక్ష తీసు కున్నాను. నా యాగాన్ని తాటకి అనే రాక్షసి, ఆమె కుమారులు మారీచ సుబాహువులు అనేక విఘ్నాలు కల్పిస్తూ పూర్తి 

కానివ్వకుండా చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న నేను అస్త్రశస్త్రాలు, తపశ్శక్తి వినియోగించలేను. రాక్షసులను సంహరించి యాగం సమాప్తి చేయడంలో నీ సహాయం కోరి వచ్చాను” అని తను వచ్చిన పని చెప్పాడు.


దశరథుడు వెంటనే “మహర్షీ! నా సమస్త సైన్యం తమ వెంట పంపుతాను” అనగానే విశ్వామిత్రుడు వద్దన్నాడు. 


"నేనే స్వయంగా వస్తాను" అని దశరథుడు అంటే విశ్వామిత్రుడు "రాజు రాజ్యంలో ఉండాలి. 

నీ అవసరం లేదు" అన్నాడు. 


దశరథుడు సందేహంగా "మరి ఏమి కావాలి మహర్షీ!" అని అడిగాడు.


అప్పుడే రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వచ్చాడని తెలిసి దర్శనానికి వచ్చి మహర్షికి నమస్కరించారు. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశీర్వదించి దశరథుని వంక చూసి "నీ తనయుడు శ్రీరాముని నాతో పంపించుము! యాగ రక్షణకు రాముడు ఒక్కడు చాలును" అని అడిగాడు.


దశరథుడు ఉలిక్కిపడ్డాడు. "పసివాడు రాముడు రాక్షసులను సంహరిస్తాడా! వసిష్టాశ్రమం నుండి వచ్చి కొద్ది సమయమే అయ్యింది. ఇంతలో తిరిగి ప్రియ పుత్రుని, పసివానిని మునితో రాక్షస సంహారానికి పంపడమా!" అనుకుని విశ్వామిత్రునితో “మహర్షీ! పసివాడు రాముడు మొన్ననే వసిష్టాశ్రమంలో పదహారేళ్ళు విద్యాభ్యాసం చేసి వచ్చాడు. బాలుని వలన రాక్షస సంహారం ఏమవుతుంది? నేను సకల సైన్యాలతో వచ్చి యాగరక్షణ చేస్తాను. అంగీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.


“శ్రీరాముడు తప్ప అన్యులు నాకు వద్దు. లేదంటే వెళ్లిపోతాను. మాట ఇచ్చి తప్పిన ఇక్ష్వాకు వంశపు మొదటి రాజువి అవుతావు" అని విశ్వామిత్రుడు కోపంగా లేచి వెళ్ళబోయాడు. 


వంశగురువు వసిష్ట మహర్షి లేచి విశ్వామిత్రుని ఉండమని చెప్పి దశరథునితో “దశరథా! తలచుకుంటే విశ్వామిత్ర మహర్షి క్షణంలో రాక్షస సంహారం చేయగలడు. అటువంటి మహాశక్తి సంపన్నుడు అడుగుతుంటే ధైర్యంగా రాముని పంపించుము. శ్రీరాముడు విశ్వామిత్రుడి వలన అనేక మహిమాన్విత శస్త్రాస్త్రాలు పొంది జగదేక వీరుడు అవుతాడు. రాక్షస సంహారంతో శ్రీరాముని కీర్తి దశదిశల వ్యాపిస్తుంది" అని నచ్చచెప్పి శ్రీరాముని విశ్వామిత్రునితో పంపించడానికి ఒప్పించాడు.


దశరథుడు రాముని వెంట రావడానికి లక్ష్మణుడి అనుమతించమని కోరగా విశ్వామిత్రుడు అంగీకరించాడు. 


రామలక్ష్మణులు తండ్రికి, వసిష్ట మహర్షికి నమస్కరించి అనుమతి, ఆశీస్సులు తీసుకుని విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళ్లారు. చీకటి పడే సమయానికి సరయూనది అవతల తీరంచేరి విశ్రమించారు. మహావిష్ణువు అవతార కథలు విశ్వామిత్రుడు ఆ రాత్రి రామలక్ష్మణులకు వినిపించాడు.


మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరామ లక్ష్మణులను నిద్ర లేపి స్నానసంధ్యలు పూర్తి చేయించాడు. తరువాత వారిరువురిని తనకు అభిముఖంగా కూర్చోబెట్టి రాముని వంక చూసి "రామా! దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నీవు మహావిష్ణు స్వరూపంగా భూమిపై అవతరించావు. రాక్షస దానవ సంహారం కోసం మీ అన్నదమ్ములకు బల,అతిబల, మహాబల మొదలైన మహావిద్యలతో పాటు బ్రహ్మ ఇంద్ర అగ్ని వరుణ మొదలైన దేవతల శక్తుల గల దేవతాస్త్రాలను ప్రయోగ ఉపసంహార మంత్రాది పూర్వకంగా ఉపదేశి స్తాను" అని సకల అస్త్ర శాస్త్రాలు రామలక్ష్మణులకు ఉపదేశించాడు.


తరువాత బయలుదేరి అరణ్యాల గుండా ప్రయాణం చేసి దండకారణ్యంలో తాటకి ఉండే ప్రదేశానికి వచ్చారు. 


తాటకి వీరిని చూడగానే భీకర ఆకారం దాల్చి పెద్ద పెద్ద వృక్షాలను, బండరాళ్ళను వీరి పైకి విసిరి వేయసాగింది. పడుతున్న వృక్షాలను, బండరాళ్ళను రామలక్ష్మణులు ఆకాశంలోనే బాణాలతో ఛేదించి పడగొట్ట సాగారు.


తాటకి మరింతగా విజృంభించడంతో విశ్వామిత్రుడు తాటకిని చంపమని రామునికి చెప్పాడు.   


"తాటకి రాక్షసి అయినా స్త్రీకదా" అని చంపడానికి రాముడు సందేహించాడు. 


విశ్వామిత్రుడు గ్రహించి రామునికి "ధర్మ సంరక్షణార్ధం రాక్షస స్త్రీ తాటకిని చంపడం ధర్మవిరుద్దం కాదు" అని ధర్మసూక్ష్మాన్ని వివరించాడు. 


సందేహం తొలగటంతో బాణం సంధించి రాముడు ఒక్కవేటుతో తాటకిని నేలకూల్చాడు. మహాపర్వతం నేలకు పడినట్లు తాటకి నేలపై పడి మరణించింది.


ఆశ్రమంచేరుకున్నవిశ్వామిత్రుడు యాగ రక్షణ బాధ్యత రామలక్ష్మణులకు అప్పగించి యాగ దీక్షలో కూర్చుని యాగం చేయసాగాడు. 


తాటకి మరణవార్త తెలిసిన ఆమె కుమారులు మారీచ సుబాహువులు ప్రతీకారేశ్ఛతో తమ పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని విశ్వామిత్రుడి ఆశ్రమం పై దాడికి పంపారు.


రామలక్ష్మణులు రాక్షస సేనలను అవలీలగా సంహరించడంతో మరింత కోపంతో మారీచ సుబాహువులు ఆకాశంలో అదృశ్యం రూపంలో ఉండి యాగం భగ్నం చేయడానికి జంతు మానవ రక్త మాంసాలు, ఎముకలు మొదలైనవి యాగ కుండంలో పడవేసే ప్రయత్నం చేసారు. రామలక్ష్మణులు యాగశాలపై బాణాలతో రక్షణ కవచం ఏర్పాటు చేసి ఒక్క చుక్క కూడా యాగ కుండలో పడకుండా చేసారు.


తరువాత శ్రీరాముడు ఒక బాణంతో సుబాహుని చంపివేశాడు. మరొక బాణంతో తప్పించుకుని పారిపోతున్న మారీచుని సప్తసముద్రాల అవతల పడేటట్టు చేసాడు.  


విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. విశ్వామిత్రుడు మరియు ఇతర ఋషులు పురుష సూక్తం పఠించి రామలక్ష్మణులను

ఆశీర్వదించారు.


అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడకు వచ్చాడు. విశ్వశాంతి యాగం సుసంపన్నం అయినందుకు విశ్వామిత్రుని అభినందించి రామలక్ష్మణులను ఆశీర్వదించాడు. 


మిథిలానగరంలో జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వివాహానికి ఏర్పాటు చేసిన స్వయంవరం గురించి చెప్పాడు.


“సాక్షాత్తు పరమేశ్వరుడు 

విదేహ వంశానికి ప్రసాదించిన అమోఘమైన శివధనస్సు ఎత్తినవారికే సీతాదేవితో వివాహం అని జనకుడు ప్రకటించి సకల దేశ రాజులను ఆహ్వానించాడు. సీతాదేవి జనన వృత్తాంతం చెప్పి వేయి మంది మహావీరులైనా కదలించ లేని శివధనుస్సు గల శకటాన్ని బాలికగా ఉన్న జానకి అవలీలగా పక్కకు జరిపింది ఆడుకునే బంతి కోసం. అందుకే జనకుడు శివధనస్సు ఎత్తి నారి సంధించిన వానికే సీత నిచ్చి కన్యాదానం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు అని చెప్పి నారదుడు వెళ్లి పోయాడు.


"మహా మహిమాన్వతమైన శివధనుస్సు చూడాలని ఉందా రామా" అని విశ్వామిత్రుడు శ్రీరాముని వంక చూస్తూ అడిగాడు. 


రాముడు వినయంగా "తమరు అనుగ్రహిస్తే పరమేశ్వరుని నిజ ధనుస్సు చూడాలని ఉంది" అని అన్నాడు. 


"సరే మిథిలానగరం వెళ్లి వద్దాం" అని రామలక్ష్మణులను వెంట తీసుకుని విశ్వామిత్రుడు మిథిల బయలుదేరి వెళ్లాడు.


మిథిలానగరానికి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించింది. అడవిలా ఉన్న ఆశ్రమాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఇంద్రుని దుశ్చర్య వలన గౌతమ మహర్షి అహల్యకు రాయిగా పడి ఉండమని ఇచ్చిన శాపం గురించి వివరంగా చెప్పాడు. ఇంద్రుడు చేసిన దుష్కర్మలో అహల్య నిర్దోషి అని తెలుసుకున్న గౌతమ మహర్షి "భవిష్యత్తులో మహావిష్ణువు అవతారమైన ఇక్ష్వాకు వంశజుని చేత అహల్యకు శాప విమోచనం కలుగుతుంది" అని చెప్పి ఆశ్రమం వదలి వెళ్లి పోయాడు.


ఆనాటి నుండి ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. ‘అహల్య రాయిగా శాప విమోచనం కోసం ఎదురు చూస్తోంది’ అని రాముని వంక చూశాడు. 


విశ్వామిత్ర మహర్షి చూపులోని అర్ధం గ్రహించిన ఇక్ష్వాకు వంశజుడు అయిన శ్రీరాముడు, అక్కడి వారు శాపగ్రస్తమైన ఆశ్రమంలోకి వద్దంటున్నా లోపలికి వెళ్లాడు. ఆశ్రమం అంతా రకరకాల చెట్లు, పొదలు, దుమ్ము, ధూళి, రాళ్ళతో నిండి పోయి ఉంది. శిథిలావస్థలో ఉన్న ఆశ్రమం ముఖద్వారం వద్దకు రాముడు రాగానే, అక్కడ రాయిగా మారి ఉండిన అహల్యకు శ్రీరాముని పాదం తగిలింది.


శ్రీమహావిష్ణువు అవతారం, ఇక్ష్వాకు వంశజుడైన రాముని పాదం తగలగానే అహల్యకు శాప విమోచనం కలిగి స్త్రీ రూపం పొందింది. క్షణంలో ఆశ్రమానికి శిథిలావస్థ రూపం పోయి సుందర రూపం వచ్చింది. గౌతమ మహర్షి అక్కడకు వచ్చాడు. అహల్యను పత్నిగా స్వీకరించాడు. దంపతులిరువురు శ్రీరామునికి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు ఇచ్చారు. గౌతమ మహర్షి "రాముని తీసుకువచ్చి అహల్యకు శాప విమోచనం చేసినందుకు" విశ్వామిత్రునికి కృతజ్ఞతలు తెలియ జేశాడు. 


విశ్వామిత్రుడు గౌతమ మహర్షి, అహల్యలకు వీడ్కోలు పలికి రామలక్ష్మణులను తీసుకుని మిథిలకు బయలుదేరి వెళ్లాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: