*వ్యాఘ్ర గోమాయి సంవాదం* వ్యాసభారతం శాంతి పర్వం 11వ అధ్యాయం.
పూర్వకాలం సుసంపన్నమైన పురిక అనే పేరు గల పట్టణంలో పౌరికుడు అను ఒక రాజు ఉండేవాడు. అతడు క్రూరుడు. నరాధముడు. ఇతరులను హింసించడం వేడుకగా భావించేవాడు. అతడు ఆయువు తీరగానే ఎవరునూ కోరుకొనని గతిని పొందాడు. పూర్వ కర్మల వలన నక్క జన్మను పొందాడు. పూర్వజన్మ వైభవం స్మరించుకొని పరమ నిర్వేదమును పొందినాడు. ఇతరులు తెచ్చి ఇచ్చిన మాంసమును కూడా తినెడివాడు కాదు. సర్వప్రాణులను శిక్షించడం మానుకొన్నాడు. సత్యభాషణమును పాటించుచూ ఆ వ్రతాన్ని మిక్కిలి నియమంగా కొనసాగిస్తున్నాడు. చెట్లనుండి రాలిన పళ్ళనే నియమిత సమయాలలో ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. నియమంగా వ్రతాన్ని పాటిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి ఆకులను ఆహారంగా తీసుకొంటూ ఒక్కొక్కసారి నీటితో గడపుచూ సంయమనంతో ఉంటున్నాడు. స్మశానమే ఆ నక్కకు నివాస స్థానం అయినది. అదే దానికి ఇష్టమైనది జన్మభూమి అనే పట్టింపు వల్ల ఇతరత్రా నివసించడానికి ఇష్టపడలేదు. ఆ నక్క యొక్క సదాచారములంటే గిట్టక తోడబుట్టిన నక్కలన్నీ వినయంగా నమ్మకంగా మాటలాడుతూ దాని బుద్ధిని చలింప చేయాలని ప్రయత్నించాయి. నీవు మాంసాహారివై ఉండి శ్మశానంలో నివసిస్తూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇది విపరీతంగా ఉంది కాబట్టి నీవు మాతో సమానంగా ఉండు. నీకు భోజనం మేము పెడతాము. తిను. నీ సదాచారాలు వదలిపెట్టు. నీ జాతి వారికి ఏది ఆహారమో అదే నీకు ఎప్పుడు ఉండుగాక. అని పలికిన వాటి మాటలు విని ఆ నక్క ఏకాగ్రతతో మధురంగా వివరంగా యుక్తియుక్తంగా మృదువైన మాటలతో ఇలా బదులిచ్చింది. (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి