ఆత్మతత్త్వం - శక్తి నిత్యత్వ నియమం: ఒక విశ్లేషణ
అద్వైత తత్త్వ విచారణలో పుట్టడం, మరణించడం ఉండవు. పుట్టటం మరణించటం అనే విషయాలు శరీరానికి మాత్రమే ఉంటాయి. నీవు శరీరానివి కాదు ఆత్మవి. ఎలాగో ఈ క్రింది వివరణాత్మక విషయాలు చూద్దాం!
జీవకణాల ప్రవాహం - నిత్య ప్రళయం:
జీవి పుట్టడమే ప్రాణానికి ప్రారంభము కాదు. ఒక శిశువు అప్పుడే పుట్టాడు. అంటే అంతకు ముందు ప్రాణం లేదా? ఉంది. తల్లి గర్భంలో ప్రాణంతో జీవించే నవ మాసాలు ఉన్నాడు. నవ మాసాలకు ముందు ప్రాణం లేదా? ఉంది. ఒక చిన్న జీవ కణం (శుక్ర, శోణిత రూపంలో) ఉంది. ఈ చిన్న జీవ కణంలో ఆ జీవి యొక్క DNA కోడ్ నిక్షిప్తమై ఉంటుంది. ఎలాగంటే, మర్రి చెట్టు విత్తనం (వట వృక్ష బీజం) ఎంత సూక్ష్మంగా ఉంటుందో, కానీ ఆ వట వృక్షం ఎంతో పెద్దది గా పెరుగుతుంది. పెద్ద చెట్టు నిర్మాణం అంతా ఆ చిన్న బీజంలో నిక్షిప్తమై ఉంది.
అలాంటి జీవ కణాలు ప్రతీ మనిషిలో సుమారు 40 ట్రిలియన్ ఉంటాయి. ఈ జీవ కణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. కొన్ని జీవ కణాలు పుట్టిన కొన్ని గంటలలో మరణిస్తే, ఎముకలో ఉన్న జీవ కణాలు గరిష్ఠంగా 14 సంవత్సరాలు జీవిస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. జీవ కణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి అట్టి జీవ కణాలను సాక్షి గా చూడటం తప్ప ఏమీ చేయలేడు. అంటే ఒక 14 సంవత్సరాలలో ఒకమనిషి లోని అన్ని జీవ కణాలు పాతవిపోయి కొత్తవి రావటానికి సుమారు 13-14 సంవత్సరాలు పడతాయి. ఆ వ్యక్తి కొత్తవ్యక్తి గా మారతాడు. శరీరంలో మొత్తం సెల్స్ అన్నీ రీప్లేస్ అవటానికి సుమారు 14 సంవత్సరాలు పడుతుంది. అంటే భౌతికంగా కొత్త మనిషి కానీ అతని ఆత్మ మారదు.
రామాయణ భారతాలలో 14 ఏళ్ల ప్రాధాన్యత:
బహుశా అందుకే మన ఇతిహాసాలలో 14 ఏళ్ల వనవాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. రామాయణ, భారతాల్లో సీతారామలక్ష్మణులు, పాండవుల వనవాసం ముగిసేసరికి వారు భౌతికంగా పాత శరీర సంబంధాలు లేని 'కొత్త వ్యక్తులు'. శరీరంలో మార్పులు నిరంతరం జరుగుతున్నా, వాటిని గమనించే 'సాక్షి' (ఆత్మ) మాత్రం మారదు. జీవకణాల స్థాయిలో జరిగే ఈ మార్పును ఒక రకమైన 'నిత్య ప్రళయం' అని చెప్పవచ్చు.
ఆత్మ మరియు జీవశక్తి: సంబంధం
అయితే, ఇది జీవ కణాల పుట్టుక మరణం నిరంతరం జరిగే ప్రక్రియ. శరీరంలో మార్పులు ఎన్ని వస్తూ వెళుతున్నా, జీవ శక్తి ఒక కణం నుండి మరొక కణానికి ప్రవహిస్తూనే ఉంటుంది కానీ నశించదు. కొత్త కణం పుడుతుంది పాత కణం నశిస్తుంది. ఇది ఒక రకమైన జీవ కణాల స్థాయిలో ప్రళయం. జీవ లేదా ప్రాణ శక్తి అనేది ఆత్మ యొక్క క్రియాశీలక శక్తి (Active Energy) అయితే ఆత్మ అనేది నిశ్చలమైన చైతన్యం (Constant Consciousness).
అయితే, ఇలా కొంత కాలం అనగా (ఆయువు తీరిన తరువాత) శరీరంలోని జీవ శక్తి పరమాత్మలో కలిసిపోతుంది. దీనికి ఉదాహరణగా, కుండలోని ఘటాకాశం కుండ పగిలినపుడు మహదాకాశంలో కలిసిపోయినట్లు, బల్బు లో ఫిలమెంట్ మాడిపోయినప్పుడు బల్బు లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్తు లో కలిసిపోయినట్లు వ్యష్టి సమష్టి లో కలిసిపోతుంది. ప్రాణ శక్తి నశించదు. ఒక కణం నుండి మరో కణానికి, ఒక శరీరం నుండి మరో శరీరానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ప్రాణుల స్థాయిలో ప్రళయం తో సమానం. ఆగే జగత్తు స్థాయిలో మహా ప్రళయం కూడా ఇటువంటిదే. ఈ జగత్తు అంతా నశించి కొత్త జగతి పుడుతుంది కానీ పరమాత్మ మారడు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం - శక్తి నిత్యత్వ నియమం
First Law of Thermodynamics లోని శక్తి నిత్యత్వ నియమం (Law of Conservation of Energy) ప్రకారం శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. కానీ శక్తిని ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చవచ్చు. దీనిని భౌతిక వాదులు అందరూ అంగీకరిస్తారు. అదే విధంగా ప్రాణ శక్తి, జీవ శక్తి, చైతన్య శక్తి ని మనం పుట్టించలేము నశింపచేయలేము కానీ ఒక రూపం నుండి మరో రూపానికి మార్పు చెందుతుంది అని సనాతన అద్వైత సిద్ధాంతాలు ప్రతిపాదించాయి. అయితే దీనిని ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు అందరిముందూ బాహాటంగా ఒప్పుకోరు.
ప్రాణ శక్తి అనేది ఆత్మ నుండి ఉద్భవించే క్రియాశీల శక్తి. ఆత్మ యొక్క ఉనికి వల్ల శరీరంలో కలిగే కదలికనే ప్రాణం అంటారు. ఆత్మ సూర్యుడు అయితే, ప్రాణం ఆ సూర్యుని నుండి వచ్చే కిరణం వంటిది. సూర్యుడి నుండి సూర్య కిరణాలను ఎలా వేరుచేయాలేమో ప్రాణ శక్తిని ఆత్మ నుండి వేరుచేయలేము.
ఉపనిషత్తులు మరియు గీత బోధన:
మన ఉపనిషత్ లలో, భగవద్గీతలో ఈ విషయాలను స్పష్టంగా మహర్షులు బోధించారు. ఈ క్రింది సందర్భాలను చూస్తే..
కఠోపనిషత్తు లో యమధర్మరాజు నచికేతుడికి ఆత్మ తత్వాన్ని బోధిస్తూ ఇలా అంటాడు:
"న జాయతే మ్రియతే వా విపశ్చి-
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||".
(కఠోపనిషత్తు - 1.2.18)
ఈ మంత్రంలో ఆత్మను 'విపశ్చిత్' అని పిలిచారు. అంటే ఆత్మ ఎప్పుడూ ఎరుకతో (Consciousness) ఉండేది. దానికి చావు పుట్టుకలు లేవు. అది దేని నుండి పుట్టలేదు, దాని నుండి ఏదీ విడివడి పుట్టలేదు. అది స్వయంప్రకాశకం.
ఇంకా దీనికి అనుబంధంగా తరువాత మంత్రం:
"హంతా చేన్మన్యతే హంతం
హతశ్చేన్మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే ||"
(కఠోపనిషత్తు - 1.2.19)
ఒకవేళ చంపేవాడు "నేను చంపుతున్నాను" అని అనుకున్నా, చనిపోయేవాడు "నేను చనిపోతున్నాను" అని అనుకున్నా... వారిద్దరికీ సత్యం తెలియదు. ఎందుకంటే ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు.
భగవద్గీత ఉపనిషత్ సారం కనుక పై కఠ మంత్రాలనే గీతాచార్యులు అర్జునునకు ఈ విధంగా చెప్పారు.
“న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః |
అజో నిత్యః శాశ్వతోఁయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||” గీత 2.20
ఆత్మకు ఎప్పుడూ పుట్టుక లేదు, మరణం లేదు. అది ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేకపోవడం లేదా ఇకముందు పుట్టబోవడం అనేది ఉండదు. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు పురాతనమైనది. శరీరం నశించినా ఆత్మ నశించదు. ఆత్మ ఒక పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా, ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని స్వీకరిస్తుందని దీని సారాంశం.
సంధ్యా వందన సూర్యోపస్థాన మంత్ర భాగము అయిన అయిన “న హన్యతే న జీయతే…” లో పరమాత్మ తత్త్వం సంహరింపబడదు, క్షీణించదు లేదా ముసలితనానికి గురికాదు అనగా మార్పు చెందనిది అనే భావన ఉంది.
శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఆత్మ చైతన్యము తో కూడిన ప్రాణ శక్తి కి పుట్టుక చావు లేదు. ఆ శక్తి ఒక రూపం నుండి మరో రూపానికి మారుతాయి. నువ్వు శరీరానికి కాదు. ఆత్మవి. నీకు పుట్టుక లేదు మరణం లేదు. వాటిగురించి చింతించనవసరం లేదు. స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి