🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*83వ భాగం*
*శ్రీరామావతారం-4*
*సీతా స్వయం వరం,*
*శివధనుర్భంగo*```
విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు మిథిలానగరంలో ప్రవేశించారు. నగర ప్రవేశ ద్వారము వద్ద నున్న రక్షక భటులు విశ్వామిత్ర మహర్షి ఆగమన సమాచారాన్ని జనక మహారాజుకి తెలియజేశారు.
జనకుడు తన మంత్రి పరివార గణంతో మహర్షికి స్వాగతం పలకడానికి బయలుదేరాడు.
విశ్వామిత్ర మహర్షి వెంట వినయంగా నడిచే నీలమేఘశ్యామ వర్ణపు దివ్య సుందర శరీరముతో ప్రకాశిస్తున్న శ్రీరాముడు “పదహారు ఏళ్ల వయస్సులోనే తాటకి సుబాహువు మొదలైన పద్నాలుగు వేల రాక్షసులను వధించాడు” అన్న సమాచారం తెలిసిన నగర ప్రజలు దారికి రెండు వైపుల నుంచుని గౌరవభావంతో నమస్కరిస్తున్నారు.
“శ్రీరాముని సుందర ఆకారము చూసి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే మన మిథిలకు వచ్చినట్లుంది. మన సీతమ్మకు తగిన వరుడు” అని పూలు చల్లుతూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. తమకు నమస్కరిస్తున్న ప్రజలకు శ్రీరాముడు లక్షణునితో కలసి చిరునవ్వుతో ప్రతినమస్కారం చేస్తూ విశ్వామిత్ర మహర్షి వెంట ముందుకు వెళుతున్నారు.
రాజమార్గము చేరిన విశ్వామిత్ర మహర్షికి, రామలక్ష్మణులకు జనకుడు ఎదురు వెళ్లి స్వాగతం పలికి రాజభవనం లోకి తీసుకువెళ్లి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అతిథి సేవ చేసి సముచిత ఆసనం పై విరాజమానుని చేసాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వెనుక వినయంగా చేతులు కట్టుకుని నిలిచిన రామలక్ష్మణులను చూసి జనకుడు “మహర్షీ! పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని, తాటకి సుబాహుల వంటి భయంకర రాక్షసులను సంహరించి యాగ రక్షణ చేసిన బాలవీరులు వీరేనా?” అని అడిగాడు.
విశ్వామిత్రుడు చిరునవ్వుతో అవునన్నట్టు చూసి, వారిని జనకునికి పరిచయం చేస్తూ “జనక మహారాజా! ఈ నీలమేఘశ్యాముడు కోసలరాజు దశరథుని పెద్దకుమారుడు శ్రీరాముడు. ఆ సువర్ణవర్ణ రూపుడు శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు. పరమేశ్వర ప్రసాదిత శివ ధనుస్సుని చూడాలనే అభిలాషతో నా వెంట వచ్చారు” అని చెప్పాడు.
తన పుత్రిక సీతకు తగిన వరుడు రాముడు అని భావించిన జనకుడు “స్వయంవరానికి కాదు. ధనుస్సు చూడటానికి” అని విశ్వామిత్రుడు చెప్పటంతో జనకుడు మదిలో కొంత నిరాశ చెందాడు. బయటకు కనపడనీయకుండా జనకుడు మహర్షిని, రామలక్ష్మణులను మరునాడు జరుగబోయే స్వయంవరానికి ఆహ్వానిస్తూ “రేపు స్వయంవర సభలో శివధనుస్సును స్వయంగా చూడవచ్చును” అని పలికి వారికి తగిన విడిది ఏర్పాటు చేసాడు.
శ్రీరాముని విడిది గృహంలో చాటుగా చూసిన పరిచారికలు సీతాదేవి మందిరానికి వెళ్లి ఆమెతో తాటకాది రాక్షసులను సంహరించిన రాముని పరాక్రమాలు, అందచందాలు వర్ణించి “సీతాదేవికి అన్నింటిలో తగిన జోడు శ్రీరాముడు. స్వయంవరంలో ధనుస్సు ఎత్తి జానకమ్మను తప్పక చేపడతాడు” అని తమ అభిప్రాయం ప్రకటించేసారు.
ఆ రోజు సాయంత్రం వనవిహారానికి వచ్చిన శ్రీరాముని దుర్గాదేవి ఆలయానికి పూజకు వెళుతున్న సీతాదేవి క్షణం పాటు చూసింది. రాముడు సీతను క్షణం పాటు చూసాడు. ఇరువురి చూపులు కలుసుకుని మనస్సులు పలకరించుకున్నాయి. తనను శ్రీరాముని భార్యగా చేయమని సీతాదేవి అమ్మవారిని ప్రార్ధిస్తూ పూజించింది.
మరుసటి రోజు స్వయంవర సభకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో వచ్చాడు.
జనకుడు వారికి స్వాగతం పలికి తగిన ఆసనం పై ఆసీనులను చేసాడు. సీతాదేవి అంతఃపుర గవాక్షపు తెరచాటు నుండి రాముని చూసి ఆనందపడింది. స్థిమిత పడింది. స్వయంవర సభ ప్రాంగణం ఆహ్వానితులైన రాజులతో నిండి పోయింది. మిథిల నగర ప్రజలు స్వయంవరం చూడటానికి విచ్చేశారు.
జనకుడు స్వయంవరం ప్రకటించాడు. సీతాదేవి వరమాలతో జనకుని పక్కన వచ్చి నిలుచుంది. 5 వేల మంది ధృడకాయులు శివధనుస్సు గల శకటాన్ని తమ బలం పూర్తిగా ఉపయోగిస్తూ తీసుకు వచ్చి సభా మండపం మధ్యలో ఉంచారు. చెమటలు పడుతూ ఆయాసపడుతున్న ఆ ధృడకాయులను చూసి కొందరు రాజులు శివధనుస్సు ఎత్తడం తమ వలన కాదని పోటి నుండి విరమించుకుని ప్రేక్షకులగా ఉండిపోయారు.
సీతాదేవి సౌందర్యానికి ముగ్ధులైన మిగిలిన రాజులు ఒకరి తర్వాత ఒకరు శివధనుస్సు ఎత్తడానికి ప్రయత్నం చేసి విఫలులు అయ్యారు. పరాభవంతో తల దించుకుని తమ ఆసనాలలో కూర్చున్నారు. చూస్తూ చూస్తుండగానే రాజులందరు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సభ నిశబ్దంగా ఉండి పోయింది. రాముడు లేచి శివధనుస్సు ఎత్తడానికి ఇంకా రావటం లేదని సీతాదేవి అనుకుంటుంటే శ్రీరాముడు, లక్ష్మణుడు శివధనుస్సు గొప్పదనాన్ని చూస్తున్నారు.
సభలోని వారందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ లంకాధిపతి రావణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. "పరమేశ్వరుడు నివసించే కైలాసాన్నే శిరస్సు పైకి ఎత్తి ధరించిన మహబలవంతుడైన నాకు ఈ శివధనుస్సు ఒక లెక్కా" అని అహంకారంతో పలుకుతూ శివధనుస్సు దగ్గరకు వెళ్లాడు. ఒక్క చేతితో ఎత్తలేక పోయేసరికి రెండు చేతులతో పట్టుకుని పైకి లేపసాగాడు.
సభాసదులు అందరు రావణుడు తప్పక శివధనుస్సు ఎత్తుతాడని భావించి చప్పట్లు కొట్టబోయారు. కానీ కొంచెం ఎత్తు లేచిన శివధనుస్సు బరువు రావణుడు మోయలేక పోవడంతో పెద్దశబ్దంతో కిందకు జారి పడింది. సభ నిశ్చేష్టమై నిశబ్దమయ్యింది. రావణుడి రెండు చేతులు ధనుస్సు కింద చిక్కుకున్నాయి. ధనుస్సు బరువుకి రావణుడు బాధతో విలవిలలాడుతూ కన్నులు మూసుకుని "ఈశ్వరా! నన్ను క్షమించు! అహంకారం తో ధనుస్సు ఎత్తబోయి భంగపడ్డాను. నన్ను కాపాడి పరువు దక్కించుము" అని శివుని ప్రార్ధించ సాగాడు.
విశ్వామిత్రుడు శ్రీరాముని వంక అర్ధవంతంగా శివధనుస్సుని ఎత్తమన్నట్లు చూశాడు.
గురువు గారి కనుసైగను ఆజ్ఞగా పాటించి శ్రీరాముడు తన ధనుస్సు తూణీరం లక్ష్మణునికి ఇచ్చాడు. ముందుగా విశ్వామిత్రునికి, తరువాత జనక మహారాజుకి, ఆతరువాత సభాసదులకు నమస్కరించి శివధనుస్సు ఉన్న సభామండప మధ్యప్రదేశానికి వచ్చాడు. ధనుస్సు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి పరమేశ్వరునికి నమస్కరించి మనస్సులో శివధనుస్సు ఎత్తడానికి తగిన శక్తి ఇవ్వమని" ప్రార్ధించాడు.
వామహస్తంతో ధనుస్సు మధ్యభాగం పట్టుకుని అవలీలగా పైకి ఎత్తి నిలిపాడు. అంతవరకు ధనుస్సు కింద చేతులు పడి బాధపడుతూ శివధ్యానం చేస్తున్న రావణుడు క్షణంలో అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. శ్రీరాముడు ఎడమకాలి బొటనవేలితో ధనుస్సు కిందిభాగం నొక్కిపెట్టి నారి తీసుకుని వింటి పై కొక్కేనికి బిగించాడు. సభికులందరు ఆశ్చర్యానందాలతో చూస్తుంటే నారి లాగి ధనుష్టంకారం చేయబోయాడు. రాముని శక్తిని తట్టుకోలేనట్టు భయంకరంగా పెళపెళ శబ్దం చేస్తూ శివధనుస్సు మధ్యలో విరిగి రెండు ముక్కలయ్యింది.
"శివధనుస్సు ఎత్తితే చాలు అనుకుంటే ఈ అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు శివధనుస్సునే విరిచేసాడు" అనుకున్న ప్రజలు, సభాసదులు హర్షధ్వానాలు "శ్రీరామచంద్రమూర్తికి జై" అంటూ చేసారు. ఆకాశం నుండి దేవతలు, దేవర్షులు పుష్పవర్షం కురిపించారు.
సీతాదేవి హృదయం ఆనందంతో నిండింది. తన ఆరాధ్య దైవాలైన పార్వతీపరమేశ్వరులకు కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి జనకుని వెంట వచ్చి శ్రీరాముని మెడలో వరమాల వేసింది. శ్రీరాముడు సీతాదేవి విశ్వామిత్రునికి, జనక మహారాజుకి నమస్కరించి ఆశీస్సులు పొందారు. జనకుడు విశ్వామిత్ర మహర్షి ఆదేశం ప్రకారం సీతారాముల స్వయంవరం విశేషాలు తెలుపుతూ సీతారాముల కళ్యాణం చేయడానికి మిథిలానగరం రమ్మని దశరథుని ఆహ్వానిస్తూ శుభ సమాచారం పంపాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి