9, మే 2026, శనివారం

పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం


 పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే అపోహ. భారతీయ సాహిత్యంలో భార్య, పత్నీ, సహచరి, జటాజూటవాసిని, సుత, కుమారుడు, ఇలా ఇటువంటి పదాలు ఎల్లప్పుడూ లౌకిక అర్థంలోనే ఉండవు. చాలా సందర్భాల్లో అవి తాత్త్విక, కవితాత్మక, సంకేతాత్మక భావాలను సూచిస్తాయి.

ఉదాహరణకు: గంగా శివజటాజూటంలో నిలిచింది అంటే శివుడు గంగావేగాన్ని నియంత్రించాడు.

పార్వతి శివపత్ని అంటే శక్తి తత్వానికి ప్రతీక.

గంగా శివుని శిరస్సుపై ఉంది అంటే పవిత్రత, జ్ఞానం, కరుణ ప్రవాహానికి సంకేతం.

అందువల్ల ఎక్కడైనా కవి గంగను “శివుని మరో భార్య” అన్నట్లుగా చెప్పినా అది న్యాయపరమైన వివాహం కాదు. కవిసమయం.


కవిత్వంలో అలంకారం, భావవ్యక్తీకరణ, కవిసమయం అని ఉంటాయి. సంస్కృత, తెలుగు కవిత్వంలో కవిసమయం అనే ఒక సంప్రదాయం ఉంది. అంటే కవులు అందరికీ తెలిసిన చిహ్నాలను, అలంకారాలను, రూపకాలను ఉపయోగించి భావాన్ని బలంగా చెప్పడం.

ఎలా అంటే, 

చంద్రుడు ప్రేమికుడు,

భూమి తల్లి,

గంగా దేవి,

శివుడు గంగాధరుడు,

లక్ష్మి సముద్రతనయ, ఇలా,...

ఇవి చరిత్ర నిజాలు కాదు.

 సాహిత్యరూపకాలు.

ఇక్కడ చెప్పిన చాటువులో కూడా కవి నీటి కొరత తీవ్రతను చెప్పడానికి గంగను విడిచిపెట్టు, పార్వతి చాలు అని హాస్యరసంతో అన్నాడు. ఇది శివతత్వంపై దూషణ కాదు.


నాస్తిక వాదులు, హిందూ వ్యతిరేకుల వాదనలో లోపం

ఏమిటంటే ఒక కవితలోని రూపకాన్ని పట్టుకుని దేవతలను అపహస్యం చేయడం.


“భారతమాత” అంటే దేశం ఒక స్త్రీనా? అని ఒక మూర్ఖుడు అడిగినట్టే, “సూర్యుడు ఉదయించాడు” అంటే సూర్యుడు నిజంగా నడిచి వచ్చాడా? అనేవాళ్ళు ఉన్నారు. అలాగే నా చిన్నప్పుడు చదివాను

“గంగమ్మ తల్లి” అంటే నది ప్రసవించిందా? అని ఒక వామపక్షవాది వ్యంగ్యంగా అన్నది. ఇలా రూపకాన్ని యథార్థంగా తీసుకుని వెక్కిరించడం సబబు కాదు.


గంగాదేవి స్థానం ఏమిటి?

ఒక కవి వర్ణించినట్టు గంగా అనేది పవిత్రనది, దేవలోక ప్రవాహం, పాపనాశిని, భగీరథ తపస్సుకు ప్రసన్నమైన దివ్యశక్తి, శివజటాజూటంలో స్థిరపడిన కరుణస్వరూపిణి. ఆమెను అవమానించడం అంటే భారతీయ సంస్కృతిలో పవిత్రత భావనను అవమానించడం.


కాబట్టి, కవిత్వంలోని రూపకాన్ని చరిత్రగా తీసుకుని హేళన చేయడం అజ్ఞానం. గంగ శివుని భార్య అని శాస్త్రసిద్ధ వివాహం ఎక్కడా లేదు. గంగాధరుడు అనే శివనామాన్ని కవులు అలంకారంగా విస్తరించారు. దాన్ని అపహాస్యానికి వాడటం సాహిత్యానికీ, సంస్కృతికీ అవమానం. కవిత్వంలో భావరూపకాలు ఉంటాయి. అవన్నీ యథార్థ నిర్ణయాలు కావు. రూపకాన్ని యథార్థంగా తీసుకుని దేవతలను దూషించే వారు విమర్శకులు కాదు, వికృత దృష్టి కలవారు అని నా అభిప్రాయం.


సనాతన ధర్మంలో గంగా పవిత్రతకు ప్రతీక. శివుడు నియంత్రణకు ప్రతీక. పార్వతి శక్తికి ప్రతీక. ఇవి తత్వాలు, వీధి చర్చల విషయాలు కావు.


_*పురాణాన్ని చదవని వారు ప్రశ్నిస్తారు.*_

_*సాహిత్యాన్ని అర్థం చేసుకోని వారు వెక్కిరిస్తారు.*_

_*సంస్కృతి తెలిసినవారు మాత్రం నమస్కరిస్తారు.*_


 

 మనకు ఈ జగత్తులో రెండు గోచరిస్తున్నాయి ఒకటి శక్తి 2 పదార్థ ం ఏ పదార్థంలో చైతన్యం కావాలన్నా ఆ పదార్థంలో నిగుడికృతమైన శక్తి చైతన్య పరచటము వలన పదార్థం చైతన్యవంతంగా మనకు కనబడుతున్నది 


మన మహర్షిలు బహుశా శక్తిని ఆదిపరాశక్తిగా పదార్థాన్ని పరమేశ్వరుడు గా పేర్కొని ఉండవచ్చు కాదా 


 మనము ఎప్పుడు భగవంతుడు మనలాగే అవయవాలు కలిగి ఉన్న మానవుడి లాగా తలవకూడదు భగవంతుడు శక్తి స్వరూపుడు శక్తి మనకు కనబడదు అటువంటి పరిస్థితుల్లో భగవంతుని చూడలేము అన్నది సత్యం


 కానీ సామాన్య మానవులు దైవ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించి మన మనస్సుని ఆ రూపాన్ని ఆరాధించే దిశలో పంపించి ముందుగా మనస్సును స్థిరపరచుకొని తర్వాత జ్ఞానంతో భగవంతుని చేరుకోవాలని మనకు మన మహర్షులు వారు ఆచరించి ఆ దైవ తత్వాన్ని అనుభవించి మనకు   బోధించారు

 నాస్తికుడు కనబడే దానిని కూడా నమ్మడు

 భక్తుడు భగవంతుడు వేరు తాను వేరు అని తలుస్తాడు

 కేవలం జ్ఞాని మాత్రమే భగవంతుడు మాత్రమే ఉన్నాడు తాను కూడా భగవంతుడే అని నమ్ముతాడు

కామెంట్‌లు లేవు: