15, మే 2026, శుక్రవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*742 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

అశ్వము ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించుట

తరువాత అశ్వము ప్రాగ్జ్యోతిషపురములో ప్రవేశించింది. భగదత్తుడికుమారుడు వజ్రదత్తుడు ప్రాగ్జ్యోతిషపురమును పాలిస్తున్నాడు. అతడు హయమును అడ్డగించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి వాడి అయిన బాణముల ధాటికి తాళలేక పారి పోయిన వజ్రదత్తుడు హయమును వదిలి పారిపోయి తిరిగి ఏనుగు ఎక్కి వచ్చాడు. అర్జునుడు ముందు వజ్రదత్తుడి బాణములను మధ్యలో తుంచినా అతడి మీద వాడి అయిన బాణ ప్రయోగము చేయ లేదు. వజ్రదత్తుడు అర్జునుడి మీద ప్రయోగించిన వాడి అయిన బాణములకు ప్రతిగా అర్జునుడు కూడా వాడి అయిన బాణములు ప్రయోగించి వజ్రదత్తుడిని కింద పడవేసాడు. కింద పడిన వజ్రదత్తుడు తిరిగి ఏనుగు ఎక్కి అర్జునుడిని తన బాణములతో కప్పి వేసాడు. ఇలా వారి మధ్య మూడు రోజులపాటు హోరాహోరీగా యుద్ధము సాగింది. నాలుగవ రోజున వజ్రదత్తుడు విజృంబించి " అర్జునా ! నా తండ్రి వృద్ధుడు కనుక అతడు యుద్ధములో మీ చేత మరణించాడు. కాని యువకుడిని అయిన నన్ను జయించడము అసాధ్యము " అన్నడు. అంటూ అర్జునుడి మీదకు కొండవంటి ఏనుగును తోలి అర్జునుడి మీద బాణవర్షము కురిపించాడు. అర్జునుడు ఒకే బాణముతో ఆ ఏనుగును పడగొట్టి వజ్రదత్తుడిని కింద పడవేసి అతడిని చూసి " వజ్రదత్తా ! ఈ యాగాశ్వమును వదులుతూ ధర్మరాజు నన్ను ఈ యాగాశ్వముకు రక్షకుడిగా నియమించి " అర్జునా ! ఈ అశ్వమును అడ్డగించిన వారిని వధించక వారిమీద కరుణ వహించు" అని చెప్పాడు. కనుక నేను నిన్ను చంపను. నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ధర్మరాజు తరఫున నేను నిన్ను బంధుమిత్ర సమేతంగా వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి నాటికి ధర్మరాజు నిర్వహిస్తున్న అశ్వమేధయాగానికి ఆహ్వానిస్తున్నాను. నీవూ అ యాగముకు వచ్చి యాగమును జయప్రథము చెయ్యి " అని పలికాడు. వజ్రదత్తుడు కూడా అందుకు సమ్మతించి యాగాశ్వమును వదిలి అర్జునుడితో సంధి చేసుకున్నాడు.

అశ్వము సింధుదేశములో ప్రవేశించుట

తరువాత యాగాశ్వము సింధుదేశములో ప్రవేశించింది. సింధుదేశపురాజు సైంధవుడు మహాభారతయుద్ధములో మరణించగా అతడి కుమారులు మనుమలు మాత్రము రాజ్యముచేస్తున్నారు. వారంతా అర్జునుడి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి ధాటికి అర్జునుడు తట్టుకోలేక గాడీవమును జారవిడిచి తిరిగి శక్తిని కూడతీసుకుని వారిమీద విరుచుకు పడి సింధురాజుల మీద వారి సైన్యాలను చీల్చిచెండాడి రణభూమిని శవాల పెంటకుప్పగా మార్చాడు. సైన్యము చెల్లాచెదురు అయినా సింధురాజులు సైన్యాలను కూడదీసుకుని యుద్ధానికి తలపడ్డారు. అర్జునుడు వారితో ధర్మరాజు చెప్పిన శాంతి వచనాలు చెప్పాడు. అయినా సింధురాజులు వాటిని పెడచెవిన పెట్టి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు చేసేది ఏమి లేక వారి వీరులను సంహరించారు. అప్పుడు దుస్సల రోదిస్తూ వారి వద్దకు వచ్చింది. అర్జునుడు దుస్సలను చూడగానే రధము దిగి ఆమెను సమీపించాడు. దుస్సల అర్జునుడితో " అన్నయ్యా ! వీడు నీ మేనల్లుడి కుమారుడు. నీ మనుమడు. వీడిని రక్షించు " అన్నది. అర్జునుడు " అమ్మా దుస్సలా ! నా మేనల్లుడు ఎక్కడ? " అని అడిగాడు. దుస్సల " అన్నా ! తన తండ్రి సైంధవుడు నీ చేతిలో భారతయుద్ధములో మరణించిన విషయము తెలిసి నా కుమారుడు చాలా దుఃఖించాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన విషయము తెలిసి గుండె ఆగి మరణించాడు. ఇప్పుడు వీడొక్కడే వంశాంకురము మిగిలాడు " అని చెప్పింది. ఆ మాటాలకు అర్జునుడు కూడా దుఃఖించాడు. తిరిగి దుస్సల " అన్నయ్యా అర్జునా ! ధృతరాష్ట్రులు మీకు చేసిన అపకారములు, సైంధవుని అనుచిత ప్రవర్తన మనసులో పెట్టుకోకు. తండ్రి లేని వాడైన నా మనుమడిని రక్షించు " అని మనుమడితో అర్జునుడికి పాదాభివందనము చేయించింది. అర్జునుడు " అమ్మా ! నీ సోదరుడు సుయోధనుడు దుర్మార్గుడే కాని మేము మాత్రము తక్కువా చెప్పు. ఇంతటి ఘోరయుద్ధానికి మేము కూడా కారణం అయ్యాము. రాచకులములో పుట్టడం ఎంతటి మహాపాపము. దుస్సలా ! నీ మనుమడికి హానిచెయ్యను నీవూ భయపడవలసిన పని లేదు " అని పలికాడు. ఆ మాటలకు దుస్సల సంతోషించిన దుస్సల మనుమడిని తీసుకుని వెళ్ళింది. అర్జునుడు అశ్వాన్ని విడిపించుకుని జయిత్రయాత్ర సాగించాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: