*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
2️⃣2️⃣6️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*226 వ రోజు*
*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*
*ప్రధమాశ్వాసం*```
జనమేజయుడు వైశంపాయనుని చూసి “ఒకరిని ఒకరు గెలవవలనన్న తలపుతో పాండవులు కౌరవులు ఎలా ప్రవర్తించారు. యుద్ధం ఎలా జరిగిందో నాకు వివరించండి" అని అడిగాడు.
వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పుణ్య క్షేత్రమైన కురుక్షేత్రంలో చేరిన ఇరు పక్షముల వారు కదనోత్సాహంతో విడిసి ఉన్నారు. తన కుమారుల అవిధేయతకు కలత పడిన ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించుకున్నాడు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు అర్ఘ్యపాద్యములు సమర్పించిన పిమ్మట వ్యాసుడు
"దృతరాష్ట్రా ! ఈ భూమి మీద ఉన్న రాజులందరికి కాలం తీరింది కనుకనే ఈ యుద్ధం సంప్రాప్తమైంది. ఇందుకు నీవు చింతించ పని లేదు. నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తాను నీవు యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో స్వయంగా చూడవచ్చు” అన్నాడు.
ధృతరాష్ట్రుడు “వ్యాసమహర్షీ ! అన్నదమ్ములు ఘోరంగా యుద్ధం చేసుకోవడం నేను ఎలా చూడగలను. నాకు యుద్ధ విశేషాలు వినే భాగ్యం ప్రసాదిస్తే చాలు" అన్నాడు.
వ్యాసమహర్షి సంజయుని చూసి
"సంజయా! నీవు దృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా నీకు రెండు పక్షములలో జరిగే రహస్య సంభాషణలు, వారి మనో వృత్తులు తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. నీవు తలచిన వెంటనే యుద్ధ భూమిలో ప్రవేశించి అంతటా సురక్షితంగా సంచరించగలవు ఏ అస్త్ర శస్త్రం నీకు హాని కలిగించదు. కనుక నీవు చూసినది చూసినట్లు దృతరాష్ట్రునికి వర్ణించు" అన్నాడు.
వ్యాసుడు ఆ తరువాత సంజయునికి శీఘ్రగమనము, దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదించాడు.
వ్యాసుడు "దృతరాష్ట్రా! భూభారం తగ్గించడానికి సంభవించిన ఈ యుద్ధానికి చింత వలదు. పలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. కనుక కుల క్షయం తప్పదు. అనేక రాజులు నశించక తప్పదు. ధర్మం జయిస్తుంది ఇప్పటికైనా మించి పోలేదు నీ కుమారులను ఒప్పించి పాండవుల రాజ్యభాగం ఇప్పించి ఈ మారణ హోమాన్ని ఆపించు " అన్నాడు. దృతరాష్ట్రుడు " మహాత్మా ! నా కుమారులు అవిధేయులు నా మాట వినరు. నా దోషం లేకుండా నేను అనేక విధముల చెప్పాను. అన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి నేను ఏమి చేయగలను " అన్నాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా ! జయాపజయాలు దైవాధీనాలు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది " అని చెప్పి వెళ్ళాడు.
*దృతరాష్ట్ర సంజయుల సంభాషణ*
దృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! ఈ భూమి కోసం ఎందరో యుద్ధాలు చేసి తమ ప్రాణాలు పోగొట్టు కున్నారు. భూమి అంటే అంత తీపి ఎందుకు? సంజయా ఈ భూమి యొక్క పరిమాణం, స్వరూపం గురించి నాకు వివరించు " అన్నాడు. సంజయుడు " రాజా ! ఈ భూమి నానా విధ చరాచరములకు నిలయం . ఆకాశం యొక్క గుణం శబ్దం. వాయువు గుణం శబ్దం, స్పర్శ. అగ్ని గుణములు శబ్దం, స్పర్శ, రూపములు. జలము యొక్క గుణము శబ్ధ, స్పర్శ, రూప, రసములు. భూమి యొక్క గుణం శబ్ధ, స్పర్శ, రూపం, రసము, గంధం (వాసన). కనుక పంచ భూతములలో ప్రధానమైనది. మేరు పర్వతమునకు దక్షిణమున సుదర్శనం అను పేరు కలిగిన ఒక సువిశాల ప్రదేశం ఉంది. దాని వైశాల్యం 2,500 యోజనములు. అందు మధురసభరితమైన ఒక జంబు (నేరేడు) వృక్షం ఉంది. దాని పండ్లు నేల రాలి చితికి ఆ రసము ఏరులై ప్రవహిస్తూ పర్వతములకు ప్రదక్షిణ చేస్తూ కురు భూమి గుండా ప్రవహించి సముద్రంలో చేరుతుంది. ఆ నదిని జంబు నది అంటారు. ఆ నదిలో ప్రవహించు నీరు సోకిన ప్రదేశం బంగారు మయమగును. కనుక బంగారమునకు జంబూనదం అనే పేరు కూడా ఉంది. ఆ జలం త్రాగిన వారికి ముసలి తనం, రోగములు, దాహం, ఉండదు. కనుకనే ఈ భూమికి జంబూ ద్వీపం, సుదర్శన ద్వీపం అనే పేర్లు వచ్చాయి. ఈ ద్వీపమునకు తూర్పు పడమరలు సముద్రముచే ఆవహించి ఉండును. ఈ ద్వీపమున హిమాలయం, దానికి ఆవల హేమకూటం, నిషిద పర్వతం క్రమముగా నీల, శ్వేత, శృంగ పర్వతములు ఉంటాయి. వీటన్నిటి నడుమ మేరు పర్వతం భూమి లోనికి చొచ్చుకొని 16,000 వేల యోజనములు విస్తరించి 84,000 యోజనములు పొడవున ఉంది. మేరు పర్వతములో దేవతలు, దేవమునులు, గంధర్వులు, కిన్నెర, కింపురుష, దిక్పాలకులు, బ్రహ్మదేవుడు విహరిస్తున్నారు. దానికి ఉత్తరంలో కర్ణికార వనంలో ఈశ్వరుడు గౌరీసమేతుడై విహరిస్తుంటాడు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి