Mantra - 41 ARUNAM 5 anuvaakam
నిన్నటి మంత్రం లో మనకు కనిపిస్తున్న రంగురంగుల ప్రపంచం (ఇంద్రధనుస్సు), వెనుక ఉన్న ఒకే ఒక్క కాంతిని (బ్రహ్మని), దర్శించమని చెపితే, ఈ రోజు మంత్రం రుద్రుని ధనుస్సు యొక్క నారి తెగిపోవడం వల్ల యజ్ఞ పురుషుడి శిరస్సును కోల్పోవడం, ఆ శిరస్సే ప్రవర్గ్య రూపంగా మారడం అనే వైదిక గాథను వివరిస్తుంది. అద్వైత పరంగా దీని అంతరార్థం చాలా లోతైనది.
“రుద్రస్య త్వేవ ధనురార్త్నిః |
శిర ఉత్పిపేష |
స ప్రవర్గ్యో భవత్ ।
తస్మాద్య స్సప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే।”
భౌతిక అర్ధం:
‘రుద్రస్య త్వేవ ధనురార్త్నిః శిర ఉత్పిపేష’ - రుద్రుని ధనుస్సు (పినాకం) యొక్క చివర (ఆర్త్ని ) నారి తెగిపోవడం వల్ల ఎగిరి పడి, యజ్ఞ పురుషుని శిరస్సును ఖండించింది.
‘స ప్రవర్గ్యో భవత్’ - ఆ విడదీయబడిన శిరస్సే ప్రవర్గ్య. యజ్ఞంలో ఒక ముఖ్యమైన భాగం అయ్యింది.
‘తస్మాద్యస్స ప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే’ - అందుకే ఎవరైతే ఈ ప్రవర్గ్యంతో కూడిన యజ్ఞాన్ని చేస్తారో, వారు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు.
ప్రవర్గ్యం అంటే ఏంటో కొంత వివరణ చూద్దాం! యజ్ఞంలో ఒక మట్టి పాత్రను అగ్నిలో ఎర్రగా కాల్చుతారు. అందులో నెయ్యి, ఆవు పాలు, మేక పాలను పోస్తారు. అప్పుడు ఆ వేడికి పాలు ఒక్కసారిగా పైకి పొంగి, అగ్నిశిఖలా ఆకాశంలోకి ఎగసిపడుతుంది. ఇలా పైకి ఎగసిన ఆ తేజస్సునే 'ప్రవర్గ్యము' అంటారు.
ఈ భీకరమైన వర్ణన వెనుక ఉన్న వేదాంత సత్యం ఏమిటంటే:
రుద్రస్య త్వేవ ధనురార్త్నిః - రుద్రుడు అంటే అజ్ఞానాన్ని హరించేవాడు (సంహారకర్త).
శిర ఉత్పిపేష - శిరస్సు తెగిపోవడం అనేది భౌతిక మరణం కాదు, అది 'అహంకార నాశనం'. ‘తల తీసేసినట్లు’ ఉంది అనే లౌకిక ప్రయోగం సంఘం లో ఉంది. అహంకారం తొలగినప్పుడే 'నేను బ్రహ్మమును' (అహం బ్రహ్మాऽస్మి) అనే సత్యం వెలుగులోకి వస్తుంది.
‘స ప్రవర్గ్యో భవత్’ - ప్రవర్గ్య అంటే అత్యంత ప్రకాశవంతమైనది అని అర్థం. అజ్ఞానం అనే శిరస్సు (లింగ శరీరం లేదా అహంకారం) తొలగిపోయినప్పుడు, జీవుడు తన పరిమిత రూపాన్ని కోల్పోయి, అనంతమైన బ్రహ్మ తేజస్సుగా మిగిలిపోతాడు.
ఆ తెగిపోయిన శిరస్సే ఆదిత్యుడు లేదా సూర్యుడు అయ్యాడని వేదం చెబుతుంది. అంటే, అజ్ఞాన అంధకారం వీడి జ్ఞాన సూర్యుడు ఉదయించాడని అద్వైతార్థం.
"తస్మాద్య స్సప్రవర్గ్యేణ యజ్ఞేన యజతే" - ఎవరైతే ఈ ప్రవర్గ్య రహస్యాన్ని తెలిసి యజ్ఞం చేస్తారో, వారు పూర్ణత్వాన్ని పొందుతారు.
శిరస్సు - అహంకారానికి సంకేతం -
అద్వైతంలో 'శిరస్సు' అంటే కేవలం శరీర భాగం కాదు, అది అహంకారం (Ego) లేదా వ్యక్తిత్వానికి కేంద్రం. శిరస్సును ఆశ్రయించే కేశ అలంకరణములు, కిరీట, నాసిక, కర్ణ కంఠాభరణములు ఉంటాయి. ఇవి దేహాభిమానానికి, అహంకారానికి చిహ్నములు.
ధనుస్సు నారి తెగి శిరస్సు ఖండించబడటం: అంటే—జ్ఞానాగ్ని ద్వారా జీవుడిలో ఉన్న 'నేను' (దేహాభిమానం) అనే అహంకారం ఛేదించబడటం.
ప్రవర్గ్య యజ్ఞం - ఆత్మ విచారణ
ఎవరైతే ప్రవర్గ్యంతో యజ్ఞం చేస్తారో అంటే అర్థం—కేవలం బాహ్యమైన క్రతువులు చేయడం అని కాదు. తనలోని అహంకారాన్ని (శిరస్సును) ఈశ్వరార్పణం చేసి, సర్వం బ్రహ్మమయం అని గుర్తించే ఆత్మ విచారణ చేసేవాడే నిజమైన యజ్ఞకర్త.
అహంకారాన్ని త్యాగం (న మమ) చేయకుండా చేసే ఏ కార్యమైనా అసంపూర్ణమే. అహంకారం తొలగినప్పుడే యజ్ఞం (జీవితం) సంపూర్ణమవుతుంది.
‘రుద్రుని ధనుస్సు - కాలం మరియు జ్ఞానం’
రుద్రుడు లయకారుడు. ఇక్కడ లయం అంటే నాశనం కాదు, పరిమితులను తొలగించడం.
రుద్రుని ధనుస్సు కాలానికి లేదా జ్ఞానబలానికి సంకేతం. కాలక్రమేణా లేదా గురువు ఉపదేశించిన జ్ఞానము చేత జీవుడికి తన పరిమితులు తొలగిపోతాయని, ఆ తర్వాతే అతడు అద్వైత స్థితిని (ప్రవర్గ్య/పూర్ణత్వం) పొందుతాడని ఈ మంత్రం బోధిస్తోంది.
ఈ మంత్రం ఒక భౌతికమైన ఘటనను వర్ణిస్తున్నట్లు ఉన్నా, అంతరార్థంలో ఇది అహంకార వినాశనాన్ని, తద్వారా కలిగే బ్రహ్మజ్ఞానాన్ని సూచిస్తోంది. అహంకారం అనే శిరస్సు తెగిపోయినప్పుడే, జీవుడు పరమాత్మ అనే సంపూర్ణ యజ్ఞ స్వరూపాన్ని పొందుతాడు అని భావము.
ప్రతీ ఆదివారం చెన్నై మేడవాక్కం, హైదరాబాద్, USA, కెనడా లలో మనం చేసే సూర్య నమస్కారము లలో ఈ మంత్ర పారాయణ చేస్తున్నపుడు పై భావం స్పురణకు వస్తే మన అహంకారములు తొలగి పరిపూర్ణత్వం అనుభవంలోకి వస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి