*దోసె అవతారములు*
(ఎవరు వ్రాసారో తెలియదు)
కం//
దోసెలముక్కలు గిన్నెన
పోసిన సాంబారునందు బుడబుడ తేలన్
చూసిన మీనము బోలెడి
దోసది 'మత్స్యావతార' తీరుర శ్యామా!
2 కం//
గర్మాగరమ్ము దోసెను
కూర్మాలోనంచుకొనుచు కూరిమి తినగన్
'కూర్మావతార' దోసని
ధర్మముగద దీనిఁ బిలువ ధరణిని శ్యామా!
3 కం//
కుడుమంత వెన్నముద్దను
మడచిన దోసందు నిల్పి మమకారముతో
పడకుండ నోట బెట్టిన
పుడమిని నిల్పిన 'వరాహ' మొప్పును శ్యామా!
4 కం//
గుంటూరు మిర్చి అల్లము
జంటగ కారంపుపొడిని చక్కగ జల్లన్
మంటలు రేగును నోటన
తింటే 'నరసింహ' దోస తిప్పలు శ్యామా!
5 కం//
కొద్దిగ మిగిలిన పిండిని
నొద్దికనొక చిన్నదోసె నోరిమి చేయన్
అద్దిర 'వామన' దోసన
ముద్దుగ పిల్లలకు ప్రీతి పుల్లెల శ్యామా!
6 కం//
చక్కగ చేతితొ దోసెను
ముక్కలుగా జేసి తినక స్పూనులు కత్తుల్
తక్కడు ఫోర్కులు వాడుట
తిక్కేగద 'పరశురామ' తీరున శ్యామా!
7 కం//
అల్లపుపచ్చడి మాత్రమె
చెల్లును దోసెకని యేకచెట్నీవ్రతమున్
ఎల్లప్పుడు పాటించిన
పిల్లా! యది 'రామ' దోసె పేర్కొన శ్యామా!
8 కం//
పుట్నాలల్లము వంటివి
చట్నీలొక యెనిమిదేసి చక్కగ దానిన్
'కిట్నుడి' దోసని పిలుతురు
పట్నమునొక హోటలందు భళిరా శ్యామ!
(కిట్నుడు is vernacular for కృష్ణుడు)
9 కం//
ఉప్పూ కారము వలదని
చప్పగ దోసెలను జేయ చచ్చును జిహ్వల్
చెప్పగ 'బుద్ధుని' దోసది
నప్పదు గద యట్లు తినుట నరులకు శ్యామా!
10 కం//
గుర్రపుదినుసులు జొన్నలు
కొర్రలతో దోసె చేసి కూరిమి తినగన్
హర్రీ కలియుగమున బల
మర్రా ఈ 'కల్కి' దోసె అవనిని శ్యామా!
(గుర్రపు దినుసులు = Horse Gram = ఉలవలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి