17, మార్చి 2026, మంగళవారం

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 16 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

 `` *27వ భాగం*``

        

*కపిలమహర్షితల్లిదేవహూతికి చేసిన తత్త్వోపదేశం (3)*```


“తల్లీ! శరీరంలోకి వచ్చి పోయే జీవుడు ఎవరో తెలుసునా? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు అనే పంచభూతాల సూక్ష్మ రూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతి వలె శరీరంలో ప్రజ్వరిల్లుతూ ‘ఆత్మ’ పేరున ప్రకాశిస్తాడు. ఇటువంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ స్వరూపము.


ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే భగవంతుడు. జీవులకు జనన మార్గమైన భగము తానైన వాడు భగవంతుడు. స్త్రీనుంచి ఉత్పన్నమైన అండమును, పంచభూతాల మయమైన పురుష ఓజస్సును మాతృగర్భంలో కలిపి పరాసృష్టికి మూలమైన వాడు భగవంతుడు.


ఆది, అనాది అయిన ఈ భగ వంతుడు నిరాకారమైన పరమాత్మ గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు నిరాకారం వదలి జీవాత్మగామారి సాకారరూపమైన దేహము ధరిస్తాడు. శరీరంలో 

చైతన్యుడైన ఆత్మగా నివసిస్తూ తాను నివసించే దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఇలా భగవంతుడు ఒక దేహము నుండి కోట్లాది దేహాలను సృష్టిస్తాడు.


అన్ని దేహాలలో తాను ఆత్మగా ఉంటూ పరమాత్మగా దేహులందరి చేత జగన్నాటకం నడిపిస్తాడు. విచిత్రమేమంటే ప్రతి దేహానికి గల జీవన కథ ప్రత్యేకంగా ఉంటుంది. కథ వ్రాసేవాడు తానైనా ఆ కథతో ఏ సంబంధం పెట్టుకోడు. తామరాకు మీద నీటిబొట్టు లాగా తాను నిమిత్త మాత్రుడిగా వినోదం చూస్తూ దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు. దేహి తన కథ ముగించగానే ఆ దేహము పతనమై పోతుంది. అందులోని జీవాత్మ బయటకు వచ్చి మరో దేహం లభించేంతవరకూ సంచరిస్తూ ఉంటుంది.


దేహాలను ఇలా సృష్టించి ఆడిస్తుంటాడు కనుకనే పరమాత్మని ‘దేవుడు’ అంటారు. ఈ దేవుడిని (పరమ)పురుషుడు అని కూడా అంటారు. ఇతడు నిర్గుణుడు, నిర్వికారుడు కనుక ‘నిర్గుణ పరబ్రహ్మము’ అని పిలుస్తారు. పరబ్రహ్మములో అంతర్గతంగా ఉన్న ప్రకృతి ఇతనికి సృష్టిలో సహకరిస్తుంది. ఈ ప్రకృతికి ఇరవై నాలుగు తత్త్వాలు ఉన్నాయి.


భూమి,ఆకాశం,జలం,అగ్ని,వాయువు అనే పంచ (ఐదు) భూతాలు, శబ్దం,స్పర్శ,రూపం,రసం,గంధం అనేవి పంచ భూతముల ఐదు గుణాలు, త్వక్కు,చక్షువు,శ్రోతము, జిహ్వ,ఘ్రాణము,వాక్కు,పాణి,పాదము పాయువు,ఉపస్థు అనే ఇంద్రియాలు పది, మనస్సు,బుద్ధి,చిత్తము, అహంకారం అనే నాలుగు అంతఃకరణాలు కలిపి మొత్తం ఇరవై నాలుగు తత్త్వాలు గల ప్రకృతి ‘కాలం’ చేరడంతో ఇరవై ఐదు తత్త్వాలు గలదైంది.


నిర్గుణుడైన పురుషుడితో ఇరవైఐదు తత్త్వాలు గల ఈ ప్రకృతి కలిస్తే ఆయన సగుణుడు అవుతాడు. అప్పుడు ఆయనకు రజస్సు, సత్త్వము, తమస్సు అనే త్రిగుణాలు కలుగుతాయి. వాటి వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులుగా సాకార రూపుడు అవుతాడు. బ్రహ్మగా దేహాలను సృష్టిస్తాడు. విష్ణువుగా దేహాలలో ఆత్మస్వరూపుడైఉంటూ వాటిని నడిపిస్తాడు,ఆడిస్తాడు. మహేశ్వరుడిగా దేహాలలో గల ఆత్మలను బయటకు రప్పించి దేహాలను పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు.


భగవంతుడు ఈవిధంగా త్రిమూర్తి రూపాలలో సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వర్తిస్తున్నా ఏ దేహంతో సంబంధం కలిగి ఉండడు. ఏ దేహం ఆయనది కాదు. ఇప్పుడు చెప్పమ్మా! పరమాత్మ సృష్టిలో పుట్టి నశించే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేహిపైన, దేహం పైన హక్కు, అధికారం ఉంటుంది.

అమ్మా! ఈ దేహంలో జీవుడు ఉన్నంత వరకే బంధాలు అనుబంధాలు, ప్రేమలు మమకారాలు వెంట ఉంటాయి. దేహం నశించడంతో అంతమై పోతాయి. దేహం వదిలిన జీవుడికి వీటితో ఏ సంబంధం ఉండదు. అతనికి మరో దేహయాత్ర ఆరంభం ఔతుంది. మరో కొత్త బంధాలు, అనుబంధాలు మొదలవుతాయి. కనుక అశాశ్వతమైన దేహంతో ఏర్పడిన భవబంధాల గురించి ప్రాకులాడటం, దుఃఖించడం వలన ప్రయోజనం ఏమి ఉండదు.

అందుకే జ్ఞానులైన వారు భవబంధాల చింతలు వదిలి మనస్సులో విష్ణువుని నిలుపుకుని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మన మనస్సే అన్ని బంధాలకు, మోహాలకు, మోక్షానికి కారణం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వ ర్గాలు మనిషికి అంతర్గత శత్రువులు. వీటిని జయించ గలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్ధమైన మనస్సులో ఉన్న జీవుడే పరమాత్మ అనే విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తితో భగవంతుడు దగ్గరవుతాడు. పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. 


అప్పుడు జీవుడు తన దేహాముతో సహా కనిపించే ప్రపంచము అంతా మిధ్య మాయ అని, అశాశ్వతం అని తెలుసుకుంటాడు. తక్షణమే జీవాత్మకు నిర్మలమై కనిపించే ప్రపంచంలోని ప్రతి వస్తువులో వాసుదేవ స్వరూపం గోచరిస్తుంది. నేను - నాది, దేహం - దేహి అన్న మాయ తొలగి పోతుంది. భగవంతుని దర్శనం భక్తి మార్గం ద్వారా పొందిన జీవుడు మోక్షం పొందుతాడు.


మోక్షము అంటే ఏమిటో తెలుసా అమ్మా! ఏపరమాత్మ, పరబ్రహ్మo నుంచి ఆత్మగా, అణువుగా బయటకు వచ్చామో, తిరిగి అదే పరమ-ఆత్మలో లీనమై పోవడం మోక్షం అవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు నిర్మలమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు” అని కపిలుడు తల్లి దేవహూతికి ఉపదేశం చేశాడు.


వింటున్న దేవహూతికి పరమానందం కలిగి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలాజలా వచ్చాయి. మనస్సుని కమ్ముకున్న మోహ మాయా బంధాల తెర తొలగి పోయింది. కుమారుడైన కపిలునిలో శ్రీమన్నారాయణుడు కనిపించాడు. భగవంతుని దర్శనంతో తన్మయత్వం చెంది "నారాయణా! నీ దివ్య దర్శనంతో జన్మ ధన్యమైంది. నాకుపుత్రుడిగా జన్మించి నన్ను 

చరితార్థురాలిని చేశావు. ఇరవైఐదు తత్త్వాల సాంఖ్య యోగము, సృష్టి రహస్యం బోధించి అహంకార మమకారాలను తొలగించావు. నాకు ఈ దేహముపై మోహము పోయింది. పరమాత్మలో లీనమై జన్మరాహిత్యం పొందే ఉపాయం చెప్పు తండ్రీ" అని ప్రార్ధించింది.


కపిలుడు ఆమెకు అష్టాక్షరి మహామంత్రమైన "ఓం నమో నారాయణాయ" ఉపదేశించి "తల్లీ! శ్రీహరిని మనస్సులో నిలుపుకుని ఈ మహామంత్ర జపం చేయుము. సమస్త విశ్వము వాసుదేవ మయంగా కనిపించిన నాడు జీవన్ముక్తి లభిస్తుంది" అని ప్రబోధించాడు. 


దేవహూతి సమస్తం త్యజించి బిందు సరోవరంలో త్రికాల స్నానమాచరిస్తూ నిశ్చల భక్తితో అష్టాక్షరి మంత్రం జపిస్తూ తపస్సు చేసింది. తపస్సిద్ది పొంది నారాయణునిలో లీనమైంది. 


ఆమెకు మోక్ష ప్రాప్తి కలిగిన ప్రదేశం "సిద్దిపదం" గా ప్రసిద్ది చెందింది.


కపిల మహర్షి సాంఖ్య యోగం భూమండలమంతా పర్యటించి ప్రవచించి ప్రతిష్టించాడు. ఉత్తర సముద్రం తీరం చేరిన కపిల మహర్షిని సాగరుడు స్వాగతం పలికి పాదపూజలు చేశాడు. కపిల మహర్షి ఉత్తర సముద్ర జలాలలో ప్రవేశించి పాతాళ లోకము చేరి ఆశ్రమం 

ఏర్పరచుకుని తపస్సులో నిమగ్నుడయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: