17, మార్చి 2026, మంగళవారం

తోటకూర దొంగతనం

 శ్రీరామ (114)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఒక తల్లి, తన పిల్లవాడు పక్క ఇంట్లో తోటకూర దొంగతనం చేసినప్పుడు మందలించకపోగా సంతోషించింది. 

అప్పటినుండి వాడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఒక గజదొంగ అయ్యాడు.

 చివరకు పట్టుబడి జైలుకు వెళ్తూ వాళ్ళ అమ్మతో,

" అమ్మా ! తోటకూర దొంగతనం చేసినప్పుడే అది తప్పని ఎందుకు చెప్పలేదు ? "

అన్నాడని, చిన్నప్పుడు ఒక కథ విన్నాం.


ఆ విషయాన్నే,ఇంకొక తీరులో మనకు బాగా అర్థమయ్యేలా, అద్భుతంగా ఇలా శ్లోకబద్ధం చేశారు శ్రీ పుల్లెలవారు.



 శ్లో// యథాహి మలినైః వస్త్రైః యత్ర తత్రోపవిశ్యతే/

తథా స్ఖలిత చారిత్రః వృత్తశేషం న రక్షతి//


(సహజంగా ఒక కొత్త చొక్కానో, లేక ఇస్త్రీ చొక్కానో వేసుకున్న వాడు అది మలినం కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు.

ఒక సారి ఆ చొక్కా ఏ కారణంవల్లనైనా మలినమైతే, తరువాత ఎక్కడబడితే అక్కడ కూర్చుంటూ,ఆ వస్త్రం ఎన్నిసార్లు మలినమైనా లెక్కచేయడు.

అదే విధంగా ఒకసారి నడవడి చెడిపోయిన వాడు, తిరిగి తన శీలాన్ని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా ఇంకా తప్పు పనులు చేసి భ్రష్టుడవుతాడు)

 ( మహామహోపాధ్యాయ, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు)


తన అభ్యుదయం కోరుకునేవాడు, ఈ విషయం చక్కగా గ్రహించి, మొదటి తప్పును క్షమించమని భగవంతుని ప్రార్థించాలి.

 ఆయన అనుగ్రహముతో మనస్సును నిగ్రహించుకొని అదేపనిగా తప్పులు జేస్తూ పతనం చెందకుండా, తనని తాను కాపాడుకోవాలి.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

17-3-'26

కామెంట్‌లు లేవు: