*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
*663 వ రోజు*
పురుగు పూర్వజన్మ
నేను పోయిన జన్మలో శూద్రుడను చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలాక్రూరుడను, అనాచారిని, అతిలోభిని. దయ, జాలి లేని వాడిని. దురుసుగా ఉండే వాడిని. అన్ని దుర్గుణములు కలిగినవాడిని. కాని నేను నా తల్లిని భక్తితో సేవించే వాడిని. ఒక నాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతడిని భక్తితో పూజించాను. అందువలన నాకు పునర్జన్మస్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు మంచిపనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్మురణ కలిగింది. కనుక మునీంద్రా ! నాకు ఆ విషయముల గురించి సవిస్త్రరంగా వివరించండి " అని అడిగింది. వ్యాసుడు " ఓ కీటకమా ! నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు గతజన్మలో పాపములు చేసినందు వలన నీకు పురుగుజన్మ వచ్చిందని నాకు తెలుసు. అలాగే నీవు కొన్ని పుణ్య కార్యములు కూడా చేసావు. అందు వలననే నేను నీతో మాట్లాడుతున్నాను. నా తపోబలము చేత నేను నీకు ఈ పురుగుజన్మ నుండి విముక్తి కలిగిస్తాను. నీకు మనుష్యజన్మ ఎత్తి పుణ్యకార్యములు చేయవలెనన్న కోరిక కలగడం కూడా గతజన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే ! మానవులు తాముచేసిన పుణ్యకార్యములవలన దేవతలౌతారు. తాము చేసిన పాపకార్యముల వలన ఇలా కీటకముల జన్మ ఎత్తుతారు. నీవు గతజన్మలో చేసిన పుణ్య కార్యముల వలన నీకు గతజన్మస్మృతి కలగడమే కాక నా దర్శనభాగ్యము కూడా కలిగింది. నేను నీకు ఉత్తమగతులు ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణజన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో పూర్వ జన్మస్మృతి ఉంటుంది " అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుడి పాదాలు తాకి ప్రాణాలువదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళి పోయాడు.
పురుగు తరువాత జన్మలు
కాలక్రమేణా ! ఆ పురుగు వరుసగా అన్ని జన్మలు ఎత్తుతూ క్షత్రియ జన్మలో ఒక రాజ్యానికి రాజయ్యాడు. రాజ్య సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక రోజు ఆ రాజు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. వ్యాసుడు రాజుకు తగు విధంగా మర్యాదచేసి " రాజా ! ఈ జన్మలో నీవు తపస్సు చెయ్యి. ఆవుల కొరకు, బ్రాహ్మణుల కొరకు యుద్ధములో ప్రాణములు వదులు. నీకు బ్రాహ్మణజన్మ వస్తుంది " రాజు కూడా వ్యాసుడు చెప్పినది చేసి యుద్ధములో ప్రాణాలు వదిలి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆ బ్రాహ్మణజన్మలో ఎన్నో యజ్ఞయాగాలు చేసాడు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు, దానధర్మాలు చేసాడు. తరువాత ఒక సారి వేదవ్యాసుడిని దర్శించుకున్నాడు. వ్యాసుడు సంతోషించి అతడిని కీర్తి ప్రతష్ఠలతో అలరారమని దీవించాడు. ధర్మనందనా ! కనుక ధర్మనందనా ! యుద్ధములో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించుట తధ్యము. ఇందు అనుమానము ఏదీ లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి