8, ఏప్రిల్ 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 8 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *51వ భాగం*``


*సతీ సుమతి కథ-*```


నారద మహర్షి త్రిమూర్తుల భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతిలకు భూలోకం పతివ్రతా స్త్రీలకు నిలయం అని సతీ సుమతి కథ వివరించి చెప్పసాగాడు.


“ప్రతిష్ఠానపురంలో సద్ర్బాహ్మణ వంశంలో కౌశికుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురు నారాయణ భక్తులు కావడంతో వారి ఇంటి లో నిత్య హరినామ సంకీర్తనం జరుగుతుండేది.‘ఓంనమోనారాయణ’ మంత్రం కౌశికుడు పుట్టిన దగ్గర నుంచి వినడం వలన మనస్సులో ఇరవైనాలుగు గంటలు అనుకోవడం తెలియకుండానే అలవాటైంది.


పెరిగి వేదవిజ్ఙానం నేర్చుకున్నా కౌశికుడు దుష్టజన సాంగత్యం వలన చెడువ్యసన పరుడయ్యాడు. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా జూదం, మద్య పానము, వేశ్యాసాంగత్యంలో పగలు, రాత్రి గడిపేవాడు. అన్ని చెడు అలవాట్లు ఉన్న కౌశికుడికి ఒకటే సద్గుణం ఉంది. నారాయణ నామాన్ని మనస్సులో సదాస్మరణ చేసుకోవడం.


వంశం పరువు పోతుండటంతో బంధువుల, మిత్రుల సలహాతో ‘పెళ్ళి చేస్తే బాగుపడతాడు’ అని విని తల్లిదండ్రులు కౌశికుడికి సుమతి అనే అమ్మాయితో వివాహం చేశారు. సుమతి అందంతో పాటు దైవభక్తి కలిగిన సద్గుణ వతి. భర్త చెడు వ్యసనములు గురించి తెలిసి కూడా పతియే ప్రత్యక్షదైవమని భావించి సేవలు చేసేది. కౌశికుడు మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. సహించే భార్య దొరకడంతో రోజుల తరబడి వేశ్యావాటికలలోనే కాలం గడిపేవాడు. వారానికో నెలకో ఇంటికి వచ్చేవాడు.


సుమతి ఒక్క మాట కూడా అనకుండా ఉన్న నాలుగు రోజులు చక్కగా పతికి సేవ చేసేది. కోడలు పడే బాధ చూడలేక, కొడుకును మంచి దారిలో పెట్టలేక దిగులు చెందిన కౌశికుడి తల్లిదండ్రులు కొంత కాలానికి మరణించారు. కౌశికుడి చెడు వ్యసనాలకు ఉన్న సంపద అంతా కరిగిపోయింది. అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలను బయటకు పంపారు.


కౌశికుడు సుమతి ఒక ధర్మ సత్రంలో తలదాచుకున్నారు. చెడు వ్యసనాల వలన కౌశికుడికి భయంకరమైన కుష్ఠురోగం వచ్చింది. సత్రం అధికారులు ఈ విషయం గ్రామాధికారికి చెప్పగా దంపతులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఊరి వెలుపల స్మశానానికి సమీపంలో సుమతి ఒక గుడిసె నిర్మించి కుష్ఠురోగి అయిన భర్తను అందులో ఉంచి సేవలు చేయసాగింది.


తెల్లవారుజామున లేచి భర్తకు స్నానం చేయించి కుష్టు పుళ్ళకు మందులు పూసి మంచి బట్టలు వేసి ఇంటి వసారాలో అరుగు మీద కూర్చోబెట్టేది. తాను స్నానంచేసి తెలిసినవారి ఇండ్లకు వెళ్లి కులభంగం, వ్రతభంగం కాని పనులు చేసేది. సుమతి మంచి తనం తెలిసిన వారు ధనంతో పాటు ఆహార పదార్థాలు, తిను బండారాలు ఇచ్చేవారు. సుమతి అవి తెచ్చి భర్తకు తినిపించేది.


గ్రామ ప్రజలతో పాటు దేవతలు కూడా సుమతి పతిభక్తికి, పతిసేవకు ఆశ్చర్యపోయేవారు, ప్రశంసించేవారు. కుష్ఠురోగంతో బాధపడుతున్న కౌశికుడు భార్య చేసే సేవలు చూసి పరివర్తన చెందాడు. తన జీవితం పూర్తిగా సర్వనాశనం అయ్యింది, సుమతి తనను వదిలి వెళతే ఆమె జీవితమైనా బాగుపడతుందని తిడుతూ తనకు దూరంగా వెళ్లపోమన్ని కసిరికొట్టేవాడు. ‘నాలాంటి వాడికి చాకిరి చేసి నీజీవితం నాశనం చేసుకోకు! నారాయణుడు నాలాంటివారిని చూసుకుంటాడు. నన్ను వదలి వెళ్లి పో’ అని చీదరించుకునేవాడు.


భర్త మనస్సులోని భావాన్ని గ్రహించిన సుమతి ‘నారాయణుడే మీకు సేవ చేయమని భార్యగా పంపాడు’ అని సేవలు చేసేది. 


కౌశికుడు చూడలేక మనస్సులో స్మరించే నారాయణుని ‘నారాయణా! ఈ సుమతి నన్ను వదలదు. నీవే నన్ను తీసుకు వెళ్ళు’అని అరచేవాడు. 


కొంతకాలానికి అతని మాటలు విన్న తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. విష్ణువు అనుగ్రహించాడు


నారాయణుడి ప్రేరణ చేత ఆ రోజు రాత్రి రాజభవనంలో దొంగలు పడి ధన రత్న బంగారు ఆభరణాలు మూటలు కట్టుకుని తీసుకువెళ్లుతుంటే రాజభటులు చూసి వెంటబడ్ఢారు. దొంగలు తమను తరుముకుంటూ వస్తున్న భటులను తప్పించుకోవడానికి ఊరి చివర ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న మాండవ్య ముని వద్ద ఒక రత్నాభరణాల మూట పారవేసి అడవిలోకి పారిపోయారు.


రాజభటులు ఆ ఆభరణాల మూట మాండవ్య ముని వద్ద చూసి ఆయన దొంగలలో ఒకడని భావించి బంధించి రాజుగారి వద్దకు తీసుకు వెళ్లారు. మాండవ్యముని మౌనదీక్షలో ఉండటం వలన నోరు తెరచి మాటాడలేక పోయాడు. అంతకుముందు ఎప్పుడూ మాండవ్య మునిని చూడని రాజు మౌనంగా ఉండటం చూసి ఆగ్రహించి శిక్షగా మునిని కొరత వేయమని ఆదే శించాడు. భటులు మునిని తీసుకువెళ్లి కొయ్యస్థంభానికి మేకులు కొట్టి దారిలో నిలుచో బెట్టి కొరత శిక్ష వేసారు.


తెల్లవారింది. సుమతి భర్తకు యధావిధిగా స్నానం చేయించి ఇంటి బయట అరుగు పై కూర్చోబెట్టి లోన పనికి వెళ్లింది. అదే సమయంలో పల్లకిలో అందమైన వేశ్య ఒకతి ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళింది. కౌశికుడు చూసి సుమతి తనను అసహ్యించుకుని వదిలి వేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మధ్యాహ్నం తనకు భోజనం పెట్టడానికి వచ్చిన సుమతితో ‘తనను ఆ వేశ్య దగ్గరకు తీసుకు వెళితేనే తింటాను’ అని పట్టుబట్టాడు.


కుష్ఠురోగం ఉన్నా ఇటువంటి కోరిక కోరినందుకు తనను చీదరించుకుని సుమతి వెళ్లి పోతుంది అని కౌశికుడు అనుకున్నాడు. కానీ సుమతి రాత్రికి తీసుకు వెళతాను అని చెప్పి భోజనం పెట్టింది. రాత్రి అవ్వగానే సుమతి కౌశికుని ముస్తాబు చేసి తట్టలో కూర్చోబెట్టి తట్టను తల మీద పెట్టుకుని బయలు దేరింది.


చీకట్లో నడుస్తున్న సుమతిని కౌశికుడు నన్ను వదలి వెళ్లమని తిడుతున్నాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ కొడుతున్నాడు. అదే దారిలో మాండవ్య మునిని వ్రేలాడదీసిన కొయ్య స్థంభం ఉంది. చీకట్లో కౌశికుడి జాడించిన కాలు మాండవ్య ముని తలకు బలంగా తగిలింది. కొట్టిన మేకుల బాధకు తోడు కౌశికుడి కాలు దెబ్బ మాండవ్య మునిని మరింతగా బాధపడేట్టు చేసింది.


ఆ బాధ తట్టుకోలేక మౌనవ్రతం వీడి మాండవ్య ముని బిగ్గరగా అరుస్తూ ‘ఎవరి కాలు నా తలకు తగిలి నన్ను అంతులేని బాధకు గురిచేసిందో, అతని తల సూర్యోదయానికి వేయి ముక్కలు ఔతుంది’ అనిశపించాడు. కౌశికుడు విని తన బాధ సుమతికి తొలగిపోతుంది అని ఆనందపడ్డాడు. భార్యను వెనక్కి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు.


సుమతి మాత్రం ఏ మాత్రం కంగారు పడకుండా తన పాతివ్రత్యం పై ఒట్టు పెట్టి "రేపు సూర్యోదయం కాకుండు గాక" అని ప్రతిశాపం ఇచ్చింది. మహా పతివ్రత మాటకు సూర్యరథం ఆగింది. సూర్యుడు ఆగిపోయాడు. జగత్తు అంధకారంలో ఉండి పోయింది. ముల్లోకాలలో అలజడి మొదలైంది.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: