2, ఏప్రిల్ 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 2 ఏప్రిల్ 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

``              *45వ భాగం*``


*నరసింహావతార కథ ప్రారంభం - ప్రహ్లాదుని జననం*   

```

హిరణ్యకశిపుడు “దేవతల పక్షపాతి విష్ణువును జయించాలంటే విష్ణువు నుండి మరణం లేనివరం పొందాలి. అందుకోసం తపస్సు చేయండి" అన్న నారద మహర్షి సూచన పాటించి భార్యలీలావతిని రాజధానిలో విడిచి తపస్సుకి వెళ్లాడు.


బ్రహ్మదేవుని అనుగ్రహం లభించి కోరిన వరాలు పొందటానికి అనేక వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. తపస్సు ప్రభావం ముల్లోకాలపై పడటంతో ఇంద్రుడు తపస్సు భగ్నం చేయాలనుకున్నాడు. అప్సరసలను పంపాడు. విఫలం కావడంతో అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవులను పంపి తపస్సు చేసే ప్రదేశాన్నితగలబెట్టాడు, సుడిగాలులు సృష్టింప చేశాడు,కుంభవృష్టికురిపించారు.


ఏవీ హిరణ్యకశిపుడి తపస్సుని భగ్నం చేయలేక పోయాయి.  చివరకు బ్రహ్మదేవుడే తపస్సు ఆపటానికి ప్రసన్నుడై ప్రత్యక్ష మైనాడు. దానవరాజుని చూసి బ్రహ్మ దేవుడు "హిరణ్యకశిపా! 

నీ తపస్సుకి సంతష్టుడిని అయ్యాను. వరం ఇస్తున్నాను. మనస్సులో గల  కోరికను చెప్పుము" అని అడిగాడు.


హిరణ్యకశిపుడు "పితామహా! మరణము లేకుండా అమరత్వం సిద్దించే వరము ఇవ్వండి" అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు "భూమి పై పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే. సృష్టి నియమాన్ని ఉల్లఘించే శక్తి ఎవరికి లేదు. మరేదైనా వరము కోరుకొనుము" అనడంతో హిరణ్యకశిపుడు ఆలోచించి ఇలా కోరాడు.

"పితామహా! దేవదానవ మానవాదుల వలన గాని, భూచర, ఖేచర, జలచరముల చేతగాని, ఏ ఆయుధముల చేత గాని, ఇంటిలో గాని, బయటగాని, భూమిపైన గాని, భూమిలో గాని, ఆకాశములో గాని, నీటిలో గాని, నీటిపైన గాని, పగలు కాని రాత్రి కాని నాకు మరణం సంభవించకుండా వరం ఇవ్వండి" అని కోరాడు.


బ్రహ్మదేవుడు "మరణం అనేది ఎలాగైనా వస్తుంది" అని తలచి శ్రీమన్నారాయణుని పై భారం వేసి"తథాస్తు" అని హిరణ్యకశిపుడు కోరిన వరము ఇచ్చి వెళ్లాడు.


హిరణ్యకశిపుడు నగరానికి తిరిగి వచ్చి తనసోదరుడు హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహావతారం ధరించి సంహరించాడు అని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవతలను, దేవతల పక్షపాతి విష్ణువుని ఓడించి సంహరిస్తాను అనిప్రతిజ్ఞ చేసి సకల లోకాలపై దండయాత్ర చేసాడు. స్వర్గలోకం జయించి దేవతలను బానిసలుగా చేసుకున్నాడు. భూమి పై గల రాజులను, పాతాళ లోకాల అధిపతులను జయించాడు. ముల్లోకాలు జయించిన తరువాత వైకుంఠం పై దండ యాత్రకు వెళ్లాడు. విష్ణుమాయ వలన విష్ణువు, వైకుంఠ వాసులున్నా, హిరణ్యకశిపుని కళ్ళకు వైకుంఠం ఖాళీగా కనిపించింది.


తనకు భయపడి విష్ణువు వైకుంఠం వదలి పారిపోయాడు అని భావించి విజయగర్వంతో హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చాడు. దాగి ఉన్నదేవతలను, విష్ణువుని బయటకు రప్పించాలని భూమిపై దేవతల కోసం యజ్ఞయాగాదులు చేయకుండా ఆపివేశాడు. యజ్ఞయాగా దులు చేస్తే హవిస్సులు తనకు అర్పించా లని నిర్భంధం చేశాడు.


మునుల ఆశ్రమాలలో,గురుకులా లలో తన నామ స్మరణ మాత్రమే జరగాలని, విష్ణునామ, శివనామ స్మరణ చేయకూడదని నియమం పెట్టాడు. ఉల్లఘించిన వారికి కఠోర శిక్షలు, మరణ దండన విధించాడు. హిరణ్యకశిపుడు పెట్టే బాధలు భరించలేని మునులు, ప్రజలు, దేవతలు శ్రీహరిని రక్షించమని మనస్సులలో ప్రార్థించసాగారు.


హిరణ్యకశిపుడి భార్య, మహాసాధ్వి లీలావతి గర్భవతి అయ్యింది. నారాయణుని ప్రేరణతో నారద మహర్షి హిరణ్యకశిపుడి వద్దకు వచ్చాడు. అతని బలపరాక్రములు, దేవతల పైన విజయాన్ని ప్రశంసించాడు. ఇన్నాళ్లకు దానవులకు హిరణ్య కశిపుడి వలన ముల్లోకాధిపత్యం లభించింది అని పొగిడాడు. గర్భవతియైన భార్య లీలావతి యోగక్షేమాలు అడిగాడు.


హిరణ్యకశిపుడు నారదుని పొగడ్తలకు ఆనందం చెంది గర్భవతి అయిన భార్య లీలావతిని దానవవంశానికి తగిన వారసుడు జన్మించేలా దీవించమని కోరాడు. హిరణ్య కశిపుడి కోరిక మేరకు నారదుడు అంతపురంలోకి వెళ్లాడు. నారదుని రాక విషయం తెలియని లీలావతి అలసి గాఢ నిద్రలో ఉంది.


నారదుడు తన రాక తెలియజేస్తూ "అమ్మాలీలావతి" అనిపిలిచాడు.  లీలావతికి మెలకువ రాలేదు గానీ ఆమె గర్భంలో ఉన్న శిశువు ఊ అని ప్రత్యుత్తరం ఇచ్చింది. నారదుడు మొదట ఆశ్చర్యం చెంది తనను నారాయణుడు ఇందు కోసమే పంపాడు అన్న విషయం గ్రహించాడు.


శయన తల్పం పక్కన గల ఆసనం పై కూర్చుని లీలావతి గర్భస్థ శిశువుకి విధివిధానంతో అష్టాక్షరి మహామంత్రమైన "ఓం నమో నారాయణాయ" ఉపదేశించాడు. గర్భస్థ శిశువు మంత్రోపదేశం స్వీకరించి "ఓంనమోనారాయణాయ" అని జపించ సాగింది. నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి అక్కడ నుంచి అంతర్దానమయ్యాడు. నారాయణ మంత్రోపదేశం అటు హిరణ్య కశిపునికి, ఇటు లీలావతికి తెలియదు. గర్భస్థ శిశువు మాత్రం వదలకుండా నిరంతరం నారాయణ. నామం ీజపిస్తున్నాడు.


నవమాసాలు నిండి లీలావతి పండంటి బాలునికి జన్మనిచ్చింది. దరహాసం చిలికిస్తూ పూర్ణచంద్రుడి వంటి బాలుని ముఖారవిందం చూసే వారి మనస్సులకు ఆహ్లాదం కలిగిస్తోంది. కుమారుని చూసిన హిరణ్యకశిపుని హృదయానికి ప్రహ్లాదం కలగటం చేత బాలునికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశాడు.


ప్రహ్లాదుని తరువాత హిరణ్య కశిపునికి లీలావతికి మరోముగ్గురు కుమారులు జన్మించారు. వారికి అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని పేర్లు పెట్టారు. ప్రహ్లాదునికి శాంత స్వభావం రాగా మిగిలిన ముగ్గురికి దానవ స్వభావంవచ్చింది. గర్భస్థ శిశువుగా నారాయణ జపం చేసిన ప్రహ్లాదుడు మాటలు రావడంతోనే తల్లి తండ్రి అని పిలవడం బదులు నారాయణ నారాయణ అనసాగాడు.


భార్య లీలావతి బాల్య చేష్టగా నచ్చచెప్పడం వలన, పుత్రవాత్సల్యం వలన కొంతకాలం హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామ స్మరణ సహించాడు. నారాయణ నామం ఎవరు పలికినా హిరణ్యకశిపుడు వారికి మరణదండన విధించేవాడు. కుమారుని విషయంలో కొంత సహనం పాటించాడు.


కానీ పెరిగి పెద్దయ్యే కొద్ది సోదరుల వలె ఆటలు ఆడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ప్రతి ఆటబొమ్మలో నారాయణ రూపం కనిపించేది. తను స్మరణ చేయడం కాకుండా తన తోటి ఉండేవారి చేత కూడా నారాయణ నామం పలికేలా చేసేవాడు. నారాయణ నామం పలికితేనే శిరస్సు ఖండించే హిరణ్యకశిపుడు కుమారుని శిక్షించే విషయంలో ఆలోచనలో పడ్డాడు. భార్య లీలావతి సలహా పై ఇతర కుమారులతో కలిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపాడు.


                *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: