2, ఏప్రిల్ 2026, గురువారం

వేదం చదువుకోని వారికి ముక్తి లేదా ? )

 శ్రీరామ (122).


       (వేదం చదువుకోని వారికి ముక్తి లేదా ? )


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                                -----------


వేదాధ్యయనము ముక్తి హేతువు అని ఆచార్యులందరు ఆనతిచ్చిన విషయం అందరికీ విశదమే.

అయితే బ్రహ్మచర్య దీక్షతో, అనేక నియమములు పాటిస్తూ,

శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములతో కూడినది,

 ఉదాత్త, అనుదాత్త, స్వరితాది స్వరభేదములు కలది,

 శిరఃకంపనాదులు చేయకూడదు మొదలైన శారీరక నియమములు కలది,

ఇంకా అనధ్యయన దినములు,ప్రదేశం శుచిగా ఉండాలి, మొదలైన అనేక నియమములతో కూడినది అయిన వేదాధ్యయనము అందరికీ సాధ్యం కాదు.

మరి వేదాధ్యయనం చేయలేని కోటానుకోట్ల బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్రులకు, స్త్రీలకు,ప్రపంచంలోని ఇతర జాతులవారికి మోక్షము లేదా అన్నది అందరికి వచ్చే సందేహం.


భగవంతుడు సర్వజ్ఞుడు. 

అందరూ వేదాధ్యయనం చేయలేరన్న విషయం ఆయనకు తెలియదా ?

సామాన్య జనులు సంసార విషయాలలో తలమునకలై ఉంటారు.


ఆత్మజ్ఞానము, మోక్షము, దేవుడెఱుగు, ముందు కష్టాలనుండి బయటపడాలి అనేది వారి ఆకాంక్ష.

ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం కావాలి, వేదము, వేదాంతము కాదు.

అందుకే భగవంతుడు అవతార పురుషుల రూపం ధరించి, ఆయా దేశ కాలములకు తగిన ఉపదేశములు చేసి, ఆర్తుల కష్టాలు తీరుస్తుంటాడు.

ముక్తికి క్రమ మార్గం చూపిస్తూఉంటాడు.


అందువల్ల భగవత్సాక్షాత్కారం పొందిన మహనీయుల వాక్యములన్నీ వేదమంత్రములే, అని మనం తెలుసుకోవాలి.

ఆ వాక్యములకు భాషా, వ్యాకరణ నియమాలేవీ వర్తించవు.

నడిచే దైవం అని చెప్పబడే శ్రీ మహాస్వామివారి వాక్యములు గాని,

తులసీదాసు గారి "హనుమాన్ చాలీసా" గాని,

శ్రీ పాద శ్రీ వల్లభుల చరిత్రలోని " సిద్ధ మంగళ స్తోత్రం " గాని,

ఇంకా అనేకమంది మహానుభావుల వాక్కులు గాని

 ఆ కోవకు చెందినవి.

శ్రీ కంచి పరమాచార్యులవారు అవతార పురుషులు.

దాదాపు నూరు సంవత్సరములు జీవించిన

 ఆ మహాత్ములు,అనేకమంది భక్తులను అనుగ్రహిస్తూ , పాదయాత్ర చేస్తూ, ప్రజల సుఖశాంతులకోసం, ధర్మ ప్రచారం చేశారు.

వారి మహిమలు అనంతం.

మనం ప్రత్యక్షంగా భగవంతుని చూడలేము.

మనమీది అనుగ్రహముతో భగవంతుడే పరమాచార్యులవారి రూపంలో మన ముందు నడయాడారు.

వారు సర్వజ్ఞులు.

అందరూ వేదాధ్యయనం చేయలేరని వారికి తెలుసు.

 

ఎవరికి ఏది ఉపదేశిస్తే వారి సమస్యలు, కష్టాలు, తొలిగి అభ్యుదయం పొందుతారో

ఆ ఉపదేశమే వారు చేస్తారు.

వారిమీద నమ్మకము, గురుభావము ఉన్నవారు ఆవిధంగా ఆచరించి శ్రేయస్సు పొందుతారు.

పదిహేను సంవత్సరముల క్రితం ఆరోగ్య సమస్యల వల్ల నాకు ' పేస్ మేకర్ ' అమర్చారు.

దురదృష్టవశాత్తు ఆ ఆపరేషనులో జరిగిన ఏదో లోపం వల్ల తిరిగి పదిహేను రోజులకు ఇంకొక చిన్న ఆపరేషన్ చేసి దానిని సరిజేశారు.

అయితే రెండవ ఆపరేషన్ తరువాత ఆరోగ్యం బాగా క్షీణించింది.

అప్పుడు శ్రీ పరమాచార్యులవారి ప్రసంగం గుర్తు చేసుకొని,

 " నారాయణీయం " పారాయణ చేశాను.

ఆరోగ్యం కుదుట పడింది.


శ్రీ నారాయణ భట్టాత్రి రచించిన "శ్రీమన్నారాయణీయం"

అనే నూరు అధ్యాయముల గ్రంథము (1036 శ్లోకములు) పదునెనిమిది వేల శ్లోకములతో కూడిన మహాభాగవత పురాణము యొక్క సారసంగ్రహము.


ఎప్పుడో పురాణ కాలంలో జరిగిన విషయం.

 శుక్రాచార్యులవారిచే శపింపబడి అకాల వార్ధక్యం పొందాడు ' యయాతి మహారాజు ' 

తన ముసలితనమును కుమారుడైన ' పూరువు ' నకు ఇచ్చి, అతని యౌవనమును తాను తీసుకుని, వేయి సంవత్సరములు అన్ని భోగములు అనుభవించాడు.

తరువాత కుమారునికి యౌవనంతోబాటు రాజ్యము కూడా ఇచ్చి అరణ్యములకు పోయి తపస్సు ఆచరించి స్వర్గానికి వెళ్లాడు.

అప్పటినుండి ' పురు వంశం ' ప్రాముఖ్యత సంతరించుకుంది.


కానీ ఈ కలియుగంలో క్రీ.శ.1560 లో జన్మించిన

 శ్రీ నారాయణ భట్టాత్రి చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి, గురుదక్షిణగా 

గురువుగారి " వాత రోగమును "

తాను స్వీకరించి, తన ఆరోగ్యమును గురువుగారికి సమర్పించారు.

తనకు సంక్రమించిన అనారోగ్య బాధ పోగొట్టుకోవడానికి,

" గురువాయూరు " (కేరళ) శ్రీకృష్ణ దేవాలయంలో నూరు రోజులు ఉండి, భాగవత రచన చేసి ఆ గ్రంథమునకు "నారాయణీయం" అని పేరు పెట్టారు.

గ్రంథం పూర్తి అవగానే ఆయనకు శ్రీకృష్ణ సాక్షాత్కారం లభించింది.

సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.

ఈ గ్రంథం చదివే వారికి ఆయురారోగ్య సౌఖ్యములు ప్రసాదించమని భగవంతుని వేడుకొని ఆ వరం పొందాడు.

అప్పటినుండి ఈ గ్రంథం అత్యుత్తమ పారాయణ గ్రంథమై, 

అనేక మందికి వ్యాధులను పోగొట్టి, ఆరోగ్యం ప్రసాదిస్తూ, పాఠకులను అనుగ్రహిస్తున్నది.


సర్వజ్ఞులైన పరమాచార్యులవారు అందుకనే ఈ గ్రంథమును, అందులోని మంత్ర సదృశములైన కొన్ని శ్లోకములను పారాయణ చేయవలసినదిగా తరచు ఉపదేశించేవారు.

అందువలన వేదాధ్యయనం చేయలేకపోయాము అని ఎవరూ చింతించనవసరం లేదు.

వాల్మీకి రామాయణము, సుందరకాండ, దుర్గాసప్తశతి,విష్ణుసహస్రనామము, లలితాసహస్రనామము, నారాయణీయము,

మొదలైన వన్నీ వేదంతో సమానమైనవే.

వీటిలో ఏ ఒక్కదానిని శ్రద్ధాభక్తులతో పఠించినా కష్టాలు తొలగిపోతాయి, ముక్తి లభిస్తుంది.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

2-4-'26

కామెంట్‌లు లేవు: