శ్రీరామ (13)
( వాల్మీకి రామాయణం - 6 )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(21-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)
నారదమహర్షి చెప్పిన రామాయణమును విని ధర్మాత్ముడు,వాక్య విశారదుడు అయిన వాల్మీకి మహర్షి,శిష్యులతో కలిసి భక్తిపూర్వకంగా నారద మహర్షిని పూజించాడు.
( శ్లో// నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః/
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః// )
ధర్మాన్ని అనుసరించి, వాల్మీకి మహర్షి శిష్యులతో సహా చేసిన పూజలను స్వీకరించి, సంతుష్టాంతరంగుడై, నారద మహర్షి ఆకాశమార్గాన దేవలోకం వెళ్లాడు.
ఆ తరువాత వాల్మీకి మహర్షి స్నానం చేయడానికి
"తమసా నదీ" తీరం చేరుకుని "భరద్వాజుడు" అనబడే తన శిష్యునితో ఇలా అన్నాడు.
శ్లో// అకర్దమ మిదం తీర్థం భరద్వాజ నిశామయ/
రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనో యథా//
(ఓ భరద్వాజా! సత్పరుషుని మనస్సు లాగా నిర్మలంగాను,బురద లేకుండాను, మనోహరంగాను, ఉన్న ఈ రేవును చూడుము)
"నాయనా! ఈ రేవులో స్నానం చేద్దాం" అంటూ ,
అదే సమయంలో అక్కడ ఒక వృక్షం మీద మనోహరంగా కూయుచు, క్రీడిస్తున్న, ఒక క్రౌంచ పక్షుల జంటను చూసాడు.
అంతలోనే హఠాత్తుగా ఒక బోయవాడు అక్కడకు వచ్చి ఆ జంటలోని మగ పక్షిని బాణంవేసి నేల కూల్చాడు.
ధర్మాత్మడైన వాల్మీకి మహర్షి ఆ అనుకోని సంఘటనకు విభ్రాంతుడైనాడు. చలించిపోయాడు.
బ్రాహ్మణులకు జన్మతః జాలి ఎక్కువ.అందువల్ల "ద్విజుడైన" వాల్మీకి అని ఈ సందర్భంగా కావ్యంలో ప్రస్తావించారు.
నిద్రపోతున్నవారిని, రతిపారవశ్యంలో ఉన్నవారిని, శరణుకోరినవారిని, యుద్ధంలో వెన్నిచ్చి పారిపోతున్నవారిని, చంపటం అధర్మమని శాస్త్రం చెబుతోంది.
శ్లో//తతః కరుణ వేదిత్వా దధర్మో౽య మితి ద్విజః/
నిశామ్య రుదతీం క్రౌంచీ మిదం వచన మబ్రవీత్//
( ద్విజుడైన ఆ వాల్మీకి, రతి పరవశంలో ఉన్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఎవరిని చంపినా అధర్మమే అని భావిస్తూ,కరుణామయ హృదయుడై అప్రయత్నంగా ఇలా అన్నాడు)
శ్లో// మా నిషాద! ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌంచ మిధునా దేక మవధీః కామ మోహితమ్//
(ఓ బోయవాడా ! క్రౌంచ పక్షుల జంటనుండి మన్మథపరవశమైన ఒక పక్షిని అన్యాయంగా చంపావు.అందువల్ల నీవు ఎక్కువ కాలం జీవించవు).
అన్నాడు.
మరుక్షణంలోనే, అప్రయత్నంగా తన నోటినుండి సమాక్షరాలతో, సంగీతభరితంగా వెలువడిన ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు.
స్నానం చేసి, ఆ సంఘటనను,
ఛందోబద్ధంగా తన నోటినుండి వచ్చిన ఆ మాటలను, తలచుకుంటూ, ఆశ్రమంలో ప్రవేశించిన వాల్మీకి మహర్షికి ఆశ్చర్యం కలిగిస్తూ, ఎట్ట ఎదుట బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
చిరునవ్వు నవ్వుతూ ఆ బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా అన్నాడు.
శ్లో//శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా/
మచ్చన్దాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ/
రామస్య చరితం సర్వం కురుత్వమృషి సత్తమ//
( ఓ బ్రహ్మర్షీ ! ఇంతకు ముందు శోకముతో
నీ నోటినుండి వెలువడిన
వాక్కు శుభప్రదమైన శ్లోకమే.
నా సంకల్పం వల్లనే వాగ్దేవియైన "సరస్వతిదేవి"
నీ నోటినుండి అలా వెలువడినది.
నారదుడు నీకు ఉపదేశించిన ధర్మాత్ముడైన రాముని చరిత్ర అంతా, ఇటువంటి శ్లోకములతో కావ్యముగా రచింపుము ).
రామ,లక్ష్మణ,భరత, శత్రుఘ్నులు,
సీతాదేవి,
దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి,
రావణాది రాక్షసులు,హనుమదాదులైన వానరులు,
మొదలైన వారందరి స్వరూప, స్వభావాలు,
వారి వారి ఆలోచనలు, సంభాషణలు, నడవడి,
అన్నీ నీకు కరతలామలకం అవుతాయి.
నీవు రచించే ఈ కావ్యంలో "అసత్యం" అనేదేదీ ఉండదు అని వరమిస్తున్నాను.
శ్లో// యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే/
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి//
(ఈ భూమండలంలో పర్వతములు, నదులు, ఉన్నంతకాలం రామాయణ కథ మూడు లోకములలోను ప్రచారంలో ఉంటుంది).
నీ చేత రచింపబడిన రామాయణ కథ ఎంత కాలం ప్రచారంలో ఉంటుందో అంత కాలం నీవు నా లోకాలలో పరమానందంతో స్వేచ్ఛగా విహరిస్తావు".
అని చెప్పి బ్రహ్మ దేవుడు అంతర్హితుడయ్యాడు.
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
21-3'-26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి