1, మార్చి 2026, ఆదివారం

వాసనలు

వాసనలు 

పూర్వం ఒక గ్రామంలో చేపలు అమ్మే ఒక వనిత ఉండేదట ఆమెపేరు సీతమ్మ. రోజు ఆమె ప్రక్కన వున్న పట్టణానికి వెళ్లి చేపలు అమ్ముకొని సాయంత్రానికల్లా నడుచుకుంటూ తన గ్రామాన్ని చేరెదట.  ఈ విధంగా ఆమె దిన చర్య ఉండేది. తొందరగా చేపలు అమ్ముడు పొతే తొందరగా తన వూరు చేరేది అదే ఆలస్యం గా అమ్ముడు పొతే ఆలస్యంగా ఇల్లు చేరేది. ఇలా రోజులు వెళ్లదీస్తూ ఉండేది. ఒకరోజు వర్షాకాలం కావటంతో పట్టణం అంతటా బురజతో నిండి ఉండి  అమ్మకం చేయటానికి ఆమెకు చాలా కష్టం అయింది.  వాన వెలిసినప్పుడు చిన్నగా వీధి వీధి తిరిగి అతి కష్టం మీద ఎట్లాగో చీకటి పడే వేళకు తెచ్చినఁ అన్ని చేపలు అమ్ముడు పోయాయి.  బ్రతుకు జీవుడా అని చిన్నగ ఒక చెట్టు క్రింద తాను కూడా తెచ్చుకున్న చద్ది మూట విప్పి భోజనం చేశాననిపించుకుంది.  ఇక ఇంటికి చేరాలి చుట్టూ చీకటి తన ఊరుకు ఆ చీకటి రాత్రిలో ప్రయాణం చేయటం యెట్లా అని ఆలోచిస్తూ ధైర్యం చేసి  ఊరు బయటకు వెళ్ళింది.  అక్కడి పరిస్థితి భయానకంగా వున్నది కీచురాళ్ళ అరుస్తున్నాయి.  దారి మొత్తం బురజగా వుంది అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడ జారీ పెడతామో అన్నట్లు వున్నది.  ఈ చీకట్లో తాను ఊరుబయట జారీ పడితే,  లేక ఏ పామో తేలో కాటు వేస్తె ఆమ్మో ఆ ఆలోచన రాగానే ఆమె శరీరం ఒక్కసారిగా వణుకు పుట్టింది.  ఇప్పుడు ఏమిటి చేయటం అని ఆలోచనలో పడ్డది తాను  వున్న చోటికి కొంచం దూరంలో ఒక గుడిసె నుంచి చిన్నగా దీపం వెలుతురు వస్తున్నది.  ఒక ఆశ కిరణము మదిలో మెదిలింది.  ఈ రాత్రికి ఆ గుడిసె వారిని అడిగి అక్కడ బసచేసి రేపు ఉదయమే ఇంటికి పోదాము అని అనుకోని ఆ గుడిశ ముందుకి వెళ్లి తలుపు కొట్టింది.  ఒక నడి వయసు ఆమె తలుపు తీసి ఎవరు అని అన్నది.  ఆ మసక వెలుతురులో ఆమెను గుర్తుపట్టింది ఆమె ఎవరో కాదు మల్లెపూలు అమ్మే లచ్చవ్వ..  లచ్చవ్వను చూడగానే మన సీతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయినది.  అవ్వ నాకు ఈ రోజు గిరాకీ కాలేదు. నేను తెచ్చిన మాలు పూర్తిగా అమ్మేసరికి చీకటిపడింది ఈ వానలో తడుసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను, మా ఊరుకు వెళ్ళటానికి భయంగా వుంది ఈ రాత్రి ఇక్కడే వుందామనుకుంటే ఇంతలో నీ ఇల్లు కనిపించింది.  ఈ రోజు నీ గుడిసెలో పడుకోవచ్చా అని అడిగింది. 

నీతమ్మకు పడుకోటానికి ఒక చేప ఇచ్చి అక్కడ పరుచుకొని పడుకో అని గుడిశలో ఒక స్థలాన్ని చూపెట్టింది. గుడిశ నిండా మల్లెపూల దండాలు, ఒక బుట్ట నిండా  మల్లెపూలు గుడిసె మొత్తం మెల్లెల గుబాళింపు తో నిండి వున్నది. ఆ గుడిశ క్రొత్తగా పెళ్ళైన దంపతులకు శోభనంకోసం ఏర్పాటు చేసిన గదిలాగా వున్నది. మల్లెల వాసనతో అక్కడి వారికి మత్తెక్కుతున్నది. 

సీతమ్మ తనకు ఇచ్చిన చేప మీద మేను వాల్చింది. చాలా సేపు నిద్రకోసం చూసింది.  కానీ ఎంతకు తనకు నిద్రపట్టడం లేదు.  ఆ మల్లెల పరిమళం తనకు క్రొత్తగా ఉండటమే కాకుండా ఎంతో చికాకు కలిగిస్తున్నది.  యంత ప్రయత్నిస్తున్న అస్సలు నిద్రపట్టడం లేదు.  ఏమిటి ఈ రోజు నాకు నిద్ర పట్టటం లేదు అని పరి పరి విధాలుగా ఆలోచిస్తే చివరకు ఆమెకు స్పృహకు వచ్చింది ఏమిటంటే మల్లెల వాసన ఆమెకు  నిద్రాభంగం కలిగిస్తున్నట్లు పసికట్టింది.  నిజానికి మల్లెల వాసనలు అందరిని మత్తులోకి దింపి గాఢ నిద్రలోకి చేరుస్తాయి.  కానీ సీతమ్మకు అందుకు బిన్నంగా వున్నది.  వెంటనే ఆమెకు కర్తవ్యమ్ అర్ధం అయింది.  అదేమిటంటే ఈ మల్లెపూల వాసనలు నన్ను నిద్రపోనీకుండా ఆటంకపరుస్తున్నాయి కాబట్టి ఈ వాసనకు దూరంగా ఉండాలి అని ఆలోచించి ఒక మూలకు పెట్టిన తన చేపల బుట్టను తీసుకొని వచ్చి తన ముక్కు ముందర పెట్టుకుంది. చేపల వాసన ముక్కు పుటాలకు చేరిందో లేదో వెంటనే సీతమ్మ నిద్రలోకి  జారుకుంది.

ఈ కధ చదువుతుంటే విచిత్రంగాను, సత్య దూరంగాను మనకు తోస్తుంది అనటంలో . సందేహం లేదు.  కానీ మనమందరము యదార్ధానికి ఆ సీతమ్మ లాంటివారమే కానీ ఆ సత్యాన్ని మనం అంగీకరించుము.  నిత్యమూ, సత్యము, శాశ్వితము, అనంతము అయినటువంటి సచ్చిదానందస్వరూపాన్ని వదిలి ఐహికాము, బంధకారకము, బాధాకరం, దుఃఖ హేతువు అయిన కంపుకొట్టే ఇహ బంధాలకు లోనై జీవితాన్ని గడుపుతూ అదే మన జీవిత లక్ష్యమని భావిస్తూ అమూల్యమైన కాలాన్ని ఐహిక సుఖాలకు కేటాయిస్తూ శాశ్విత బ్రహ్మ పదాన్ని విస్మరిస్తున్నాము.  మనకు అప్పుడప్పుడు లచ్చవ్వ లాంటి జ్ఞానులు తారస పడి మల్లెల సుగంధాలలాంటి తమ అపూర్వ జ్ఞ్యాన సందేశాలను ఇస్తున్న మనం చేపల కంపు కొట్టే సంసారమనే గంపను వదలకుండా ఈ సంసార బంధనాలతో ఉంటున్నాము.  అందుకే యోగి వేమన 

"ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ"

చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు, అజ్ఞాని అజ్ఞానిని మెచ్చుకుంటాడు, పిసినారి వాడు పిసినారి వాడినే మెచ్చుకుంటాడు.  ఎందుకంటె పంది బురదను మెచ్చుకుంటుంది కానీ పన్నీరుని మెచ్చుకోదుగా అని అంటాడు. కవి.  ఇది ముమ్మాటికీ నిజం. 

ఈ రోజుల్లో దైవ భక్తి కూడా ఒక విధంగా ఆర్జనకు తావు అయ్యింది.  దీనివల్ల నిజమైన భక్తులు సరైన మార్గంలో నడవలేక పోతున్నారు.. భక్తి అనే బలహీనతను ఆసరాగా చేసుకొని అనేకులు సొమ్ము చేసుకుంటున్నారు.  మీరు ఏదైనా ప్రసిద్ధ దేవాలయానికి వెళితే ద్వారం ముందు ఒక కిలోమీటరు ముందరి నుంచి వీధి దుకాణదారులు మొదలవుతారు.  అందులో ఇతర మాతస్స్తులు కూడా వుంటున్నారు.  పూలు, పత్రీ, కొబ్బరికాయలు, అనేక రకాల  పూజా ద్రవ్యాలు అంటే ఆదేవాలయానికి సంబందించినవి. అంటే శివుని దేవాలయం అయితే శివునికి సంబందించినవి, విష్ణు దేవాలయం అయితే విష్ణువుకు సంబందించినవి. అలా అన్నమాట. అమ్మటం చేస్తూ ఉండటమే కాకుండా మీరు చెప్పులు ఇక్కడ పెట్టుకోండి, మీ సెల్ఫోనులు ఇక్కడ పెట్టుకోండి అని మనలను బలవంతం చేస్తూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారు.  నిజానికి ఆ దేవాలయంలోకి మనం కొబ్బరికాయలను, పూలను పత్రిని తీసుకొని స్వామిని అర్చించలేము ఎందుకంటె అక్కడ వున్న రద్దీతో మనకు క్షణ కాలం స్వామి దర్శనం అవటమే ఘనం.  ఇక అర్చన ఆరాధన ఎలా చేయగలం చెప్పండి.  కానీ ఆ అమ్మేవాళ్లు ఇక్కడ తప్పకుండా ఈ పూలు పెట్టాలి, ఈ పత్రీ పెట్టాలి ఈ వస్తువులు పెట్టాలి అని చెప్పి మనలను తప్పుడు ద్రోవ పట్టిస్తారు. 

ఇక మనకు సంఘంలో కొంతమంది నేను ఈ పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను మీ ఇంట్లో చేయించుకోండి నేను ఫలానా వారింట్లో ఈ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కస్టాలు తొలిగాయి.  మీరు చేయించుకోండి అని బలవంతం చేసి వారి జీవనాన్ని గడుపుకుంటున్నారు. ఎప్పుడో ఆది శంకరాభగవతపాదుల వారు వీటినన్నిటిని ముందుగానే పసి గట్టి చెప్పారు. 

 "జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః | 

పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః 

కొందరు శిరోజాలను జడలుగా పెంచుకుంటారు, కొందరు ముండనం చేసుకుంటారు, కొందరు కాషాయ వస్త్రాలు ధరించి ఈ రీతిని వివిధ వేషాలు వేసి జనులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు.  వీరంతా జ్ఞానులు కాదు.  కేవలం ఉదర నిమిత్తం అంటే కడుపు నింపుకోవటానికి చేసే పనులు కాక వేరే కావు అని స్వామి భావన.  ఇందులో పొల్లు పోకుండా మనం ఈ రోజుల్లో చూస్తున్నాము.  

నేను బాబా భాక్తుడిని నాకు రోజు బాబా దర్శన మిస్తాడు.  మీరు చెప్పేవన్నీ నేను బాబాకు చెపుతాను ఆయన మీ కోరికలన్నీ తీరుస్తాడు అని ఒకడు.  ఇంకొకడు నాకు అన్నే తెలుసు నేనే దేముడిని అని నాకు పూజ చేయటానికి ఇంత ఫీజు, పాద ప్రక్షణం చేయటానికి ఇంత ఫీజు అని. ఇంకొకాయన నేను  భగవంతుని అవతారమని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోరీతిని సామాన్యులను భక్తి పేరుతొ వంచన చేస్తూ అనేక విధాలుగా ధనాగార్జన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.  ఇలా చేసే వారికి పెద్దపెద్ద ఆశ్రమాలు, విడిది  గృహాలు,ఖరీదైన వాహనాలు మంది మార్బలం.  ఒక్కొక్కటి చూస్తుంటే ఈ ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తున్నదా అని అనిపిస్తుంది. వేద వ్యాస మహర్షి  భవిష్యపురాణంలో చెప్పినవి ఒక్కొక్కటి మనకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. 

నిజమైన సద్గురువు యొక్క మొట్టమొదటి లక్షణం ఆ మహానుభావుడు సర్వసంగ పరిత్యాగి అయి ఉంటాడు.  అంటే ఆయన అరిషట్వర్గానికి  దూరంగా ఉంటాడు.  వస్త్రాలు ధరించడు కేవలం ఈ సంఘంకోరకు మాత్రం కౌపీనాన్ని ధరిస్తాడు.  చేతిలో ఎటువంటి వస్తువులు వుండవు కేవలం దోసిలి పట్టి మాత్రమే బిక్షం తీసుకుంటాడు.  నిరంతరం బ్రహ్మైక్యం చెంది ఉంటాడు.  అంటే నిరంతరం బ్రహ్మమంలోనే చరిస్తూ ఉంటాడు.  ఆయనకు బాహ్య స్మ్రుతి ఉండదు.  మీరు పొగిడినా లేక అవమానించిన ఏమాత్రం పట్టదు.  రాగ ద్వేషాలు అస్సలు వుండవు.  ఈ రకంగా వున్న వారు ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే వెంటనే మనం మనకు తెలిసిన ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే లేరు అని అంటాము.  కానీ అది నిజం కాదు.  ఈ రోజుకి అటువంటి సత్పురుషులు ఈ భారతావనిలో  వున్నారు.  ఒక్క సారి కాశీ క్షేత్రానికి వెళ్లి చుడండి.  హిమాలయాలకు వెళ్లి చుడండి.  మనకు అనేకమంది సాధుపురుషులు గోచరిస్తారు.  నిరంతరం.  పరమేశ్వరునికై పరితపిస్తూ తపిస్తూ ఉండేవారు అనేకులు వున్నారు.  మానవ జన్మ ఎత్తినందుకు మనం కూడా వారిలో ఒకరం అవ్వాలని కోరుకోవాలి.  అప్పుడే ఈ వాసనలను వదిలి  ముక్తి పదం చేరుకోగలం.


ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిహి 

మీ 

చేరువేల భార్గవ శర్మ


కామెంట్‌లు లేవు: