7, మే 2026, గురువారం

Mantra - 32

 Mantra - 32 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు’ అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు శరదృతువు వర్ణనలో ఉన్న తత్త్వాన్ని చూద్దాం తదుపరి క్రింది మంత్రంలో.


"ఏతా వాచః ప్రయుజ్యంతే|

శరద్యత్రోప దృశ్యతే|

అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ। 

వాతవన్తో మరుద్గణాః||”


ఈ మంత్రం ప్రకృతిలో కలిగే మార్పులను, ముఖ్యంగా శరదృతువులో వాయువు యొక్క చలనాన్ని మరియు మరుద్గణాల (వాయు దేవతల) ప్రభావాన్ని వర్ణిస్తుంది.


"ఏతా వాచః ప్రయుజ్యంతే" - ఈ వాక్కులు / మంత్రాలు ఉచ్ఛరించబడుతున్నాయి/ ప్రయోగించబడుతున్నాయి.


"శరద్యత్రోపదృశ్యతే" - శరదృతువు ఎక్కడైతే కనిపిస్తుందో, ప్రవేశిస్తుందో. వర్షాకాలం ముగిసి, ఆకాశం నిర్మలంగా మారే శరత్ కాలం నాటి వాతావరణాన్ని ఇది సూచిస్తుంది.


“అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ" - కంపపింపజేస్తూ, కొడుతున్నట్లుగా (వేగంగా వీస్తూ) - గాలి వేగంగా వీస్తూ చెట్లను, ప్రకృతిని కదిలించే తీరును ఇక్కడ వర్ణించారు.


“వాతవన్తో మరుద్గణాః" - వాయువుతో కూడిన మరుద్గణములు - వేదాలలో 'మరుత్తులు' అంటే వాయుదేవతలు. వారు గుంపులుగా (గణములు) ఉండి, ప్రకృతిలో శక్తివంతమైన చలనాన్ని కలిగిస్తారు.


వర్షాలు తగ్గుముఖం పట్టి, పంటలు చేతికి వచ్చే సమయంలో వీచే గాలులు శరదృతువుకు చిహ్నం. ఈ సమయంలో వాయువు ప్రసరణ ప్రకృతిని శుద్ధి చేస్తుందని భావిస్తారు.


మరుత్తులు రుద్రుని పుత్రులుగా, ఇంద్రుని సహాయకులుగా వేదాల్లో వర్ణించబడ్డారు. వారు తుఫానులకు, గాలులకు అధిదేవతలు. వారు "అభిధూన్వంతః" (కదిలించడం) ద్వారా ప్రకృతిలోని జడత్వాన్ని తొలగిస్తారని అర్థం.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు సూర్యుడు, కాలం, మరియు వాయువు మధ్య ఉన్న సమన్వయాన్ని వివరిస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే వేడి, దానివల్ల వచ్చే వర్షం, ఆపై వీచే గాలులు - ఈ క్రమమంతా ఈశ్వర సృష్టిలోని ఒక అద్భుతమైన చక్రం.


అద్వైత సిద్ధాంతం ప్రకారం, శరత్ ఋతువు వర్ణన వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటంటే..

"అభిధూన్వన్తః" (కదిలించడం) మరియు "అభిఘ్నన్తః" (దెబ్బతీయడం) అనే పదాలు మాయ యొక్క ‘విక్షేప శక్తి' ని సూచిస్తాయి. నిశ్చలంగా ఉన్న సముద్రం మీద గాలి వీచినప్పుడు తరంగాలు ఎలా వస్తాయో, నిర్గుణ బ్రహ్మపై మాయా వాయువు వీచినప్పుడు ఈ జగత్తు అనే చలనం పుడుతుంది.  


శరత్ కాలంలో వీచే గాలులు చెట్లను, ఆకులను ఎలా కదిలిస్తాయో, మన లోపల ఉన్న వాసనలు (Desires) మనస్సును అలా కదిలిస్తూ ద్వైత భ్రమను కలిగిస్తాయి. ఇదే మాయా విక్షేపం - The Disturbance of Maya.


వాయువు లేదా మరుత్తులు మన శరీరంలోని 'ప్రాణ శక్తి' కి సంకేతం. అద్వైతంలో ప్రాణము ఆత్మకు అత్యంత సన్నిహితమైన ఉపాధి. గాలి కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ, క్రియ మనకు తెలుస్తుంది.

అలాగే, ఆత్మ మనకు నేరుగా కనిపించకపోయినా, ప్రాణ చలనం ద్వారా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు. వాయువు సర్వవ్యాపి అయినట్లు, ఆత్మ చైతన్యం కూడా సర్వవ్యాపి.‘మరుద్గణాః’ అన్న వేద వాక్యము నకు ప్రాణ శక్తి అని భావం (అధ్యాత్మంలో). 


అధిభౌతికంలో (Physical/Material) లో వాయువే, అధ్యాత్మంలో (Microcosmic) లో ప్రాణ శక్తి యే, ఆదిదైవికంలో (Macrocosmic) బ్రహ్మ లేదా హిరణ్యగర్భుడు. దీనికి ప్రమాణం గా ‘నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాऽసి’ - ఓ! వాయు దేవతా! నీవు సాక్షాత్ బ్రహ్మ వే - అని తైత్తిరీయ ఉపనిషత్ శిక్షా వల్లి వేద వాక్యాన్ని చెప్పవచ్చు.


వర్ష ఋతువులో బురదగా ఉన్న నీరు శరత్ కాలం రాగానే నిర్మలంగా మారుతుంది. అద్వైత సాధనలో ఇది ఒక ముఖ్యమైన స్థితి. మనస్సులోని అజ్ఞానమనే బురద తొలగిపోయి, ఆత్మ అనే ఆకాశం నిర్మలంగా కనిపించే సమయం ఇది. 


"వాతవన్తః" అంటే వాయువు గూడు కట్టుకున్న మేఘాలను చెదరగొట్టినట్లు, జ్ఞానమనే వాయువు అజ్ఞానపు మేఘాలను తొలగించి సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. శరత్ - మల నివృత్తి - Clarity of Consciousness. పై విధంగా తాప త్రయాలను అన్వయించుకోవచ్చు.


శరత్ కాలంలో లోక వ్యవహారాలు (వాక్కులు) చురుగ్గా సాగుతాయి. కానీ అద్వైతం ఏం చెబుతుందంటే—ఈ మాటలు, ఈ పనులు అన్నీ 'ఇవ' (లాగా) మాత్రమే. అంటే ఇవి ప్రాతిభాసిక సత్యాలే తప్ప పరమార్థ సత్యాలు కావు. గాలి వీచినప్పుడు కలిగే శబ్దం ఎలా వచ్చి పోతుందో, ఈ జగత్తులోని వ్యవహారాలు కూడా అలాగే వచ్చి పోతుంటాయి. వాచః ప్రయుజ్యంతే అంటే నామరూప జగత్తు.


ఈ మంత్రం సారాంశం రెండు మాటల్లో చెప్పాలంటే, గాలి వీచినప్పుడు వృక్షాలు కదులుతున్నట్లు, మాయా ప్రభావం వల్ల నీ మనస్సులో వికారాలు కలగవచ్చు. కానీ గాలికి ఆధారం ఆకాశం ఎలాగో, ఆ ప్రాణ చలనానికి ఆధారం నీలోని ఆత్మయే. శరత్ కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు. ఈ మంత్రం ద్వారా ప్రకృతిలోని చలనాన్ని అంటే Kinetic energy, ఆత్మ యొక్క నిశ్చలత్వంతో రథచక్రం ఇరుసు (axle) వలె అనుసంధానం చేయడం జరిగింది.

కామెంట్‌లు లేవు: