హరివంశము జగన్నాథ శర్మ
కృష్ణుని వీరావేశం:జరాసంధుని పలాయనం
బలరామకృష్ణులను ఎదిరించడం ఎవరితరమూ కాలేదు. వారి ధాటిని తట్టుకోలేక పారిపోతున్న తన సైన్యాన్ని చూసి, కేకేశాడిలా జరాసంధుడు.
యోధులారా! ఆయుధాలు విసర్జించి యుద్ధంలో పరుగుదీయడం భ్రూణహత్యతో సమానం. మీరు భూపాలకులు. వారు గోపాలకులు. భుజబలంలో మిమ్మల్ని మించినవారు లేరు. మీకు ఈ పలాయనం తగదు. వెనుతిరిగిరండి! పోరాటం ప్రారంభించండి. మీకు తోడుగా నేనున్నాను. నా బాణాలతో ఆ బలరామకృష్ణుల అంతు చూస్తాను. విజయం మనదే!
జరాసంధుని ధైర్యవచనాలకు మగధసైన్యం మళ్ళీ యుద్ధంలో ప్రవేశించింది. వారందరినీ తన వెనుకగా ఉంచుకుని, బలరామకృష్ణులను ఎదుర్కొన్నాడు జరాసంధుడు. భేరీ భాంకారధ్వని మిన్నందుకుంది. గజఘీంకారాలతో, రథచక్రఘోషలతో, గుర్రాల సకిలింపులతో, భటుల సింహనాదాలతో భూనభోంతరాలు ప్రతిధ్వనించాయి. జరాసంధుని అండగా అతని మంత్రి సామంతులు బలరామకృష్ణులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పెనుకెరటాల్లా మీద పడుతున్నా, ఎదిరిస్తున్నా బలరామకృష్ణులు వెనుతిరగలేదు. అస్త్ర శస్త్రాలను ఒకేక్షణం జరాసంధసైనికులపై ప్రయోగించి, మహెూత్సాహంతో గొంతెత్తి గర్జించారు.
ఏనుగుల కుంభస్థలాలను పగులగొట్టారిద్దరూ. చచ్చిన ఏనుగులు కుప్పలుకుప్పలుగా నేలకూలాయి. చక్రప్రయోగంతో సైనికులశిరస్సులు ఖండించాడు కృష్ణుడు. యుద్ధరంగం అంతటా ఖండితశిరస్సులే! భూమి అన్నది కనిపించకుండాపోయింది. బలరాముడు నాగేలు గుండెలు చీల్చడంతో రక్తం కాలువలుకట్టి ప్రవహించసాగింది. ఆయుధాలెత్తి యుద్ధం చేయనేలేదు కొందరు. బలరామకృష్ణుల కేకలకే గుండెలదిరి, ఎక్కడ ఉన్నదీ, ఏమి చేస్తున్నదీ తెలియక మతిచెడి కుప్పకూలిపోయారు. చెప్పాలంటే... రక్తతటాకాలతో, మాంసరాసులతో, పేగుల పెనుపోగులతో, కపాలాలతో ఆ ప్రాంతం అంతా భూత, భేతాళ, డాకినీగణాలకు విహారస్థలి అయింది. రాబందులూ, గెద్దలూ నలువైపులా తిరుగుతూ కలకలం సృష్టించ సాగాయి.
చూశారది జరాసంధుని సామంతులు. బెదిరిపోయారు. పరుగుదీశారు. పరుగుదీస్తున్న శత్రురాజులను ఉద్దేశించి హెచ్చరించాడిలా కృష్ణుడు.
రాజులారా! మీకు వాహనాలు ఉన్నాయి. మీరు వీరాధివీరులు. అనేకయుద్ధాలు చేసి, ఆరితేరారు. మా అన్నదమ్ములిద్దరికీ పెద్దగా యుద్ధం తెలియదు. పైగా మాకు వాహనాలు లేవు. నేలమీద నిల్చునే యుద్ధం చేస్తున్నాం. అయినా మేమంటే భయపడి మీరు పరుగుదీసి, చెట్లంటా, పుట్టలంటా దాగుంటున్నారు, ఇది మీకు తగదు. రాజధర్మంకాదు. మీరు అసలు సంగతి గ్రహించడంలేదు. ఆ జరాసంధుడు, మిమ్మల్ని ముందుంచుకుని, తాను వెనక్కి నక్కి యుద్ధతంత్రం చేస్తున్నాడు. మీరు పరుగెత్తి లాభం లేదు, జరాసంధుణ్ణి ముందుకు నెట్టండి, అతనితో చావోరేవో మేము తేల్చుకుంటాం.
కృష్ణునిమాటలకు కోపగించుకున్నాడు జరాసంధుడు. భగ్గున మండిపడ్డాడు. కవచాన్ని ధరించాడు. విల్లమ్ములు చేపట్టాడు. రథాన్ని అధిరోహించి, తానొక్కడే కృష్ణునితో తలపడేందుకు ముందుకురికాడు. ధనుష్టంకారం చేశాడు. అన్నాడిలా.
కృష్ణా! నేనిక్కడ ఉంటూండగానే మా సామంతులను నువ్వు అదిరించి, బెదిరిస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? అడవుల్లో ఆలమందలను అదిలించడం కాదు. ఇది యుద్ధరంగం, గుర్తు పెట్టుకో! నువ్వు ధైర్యసాహసాలుగలవాడవనీ, మహాశూరుడువనీ లోకం చెప్పుకుంటోంది. అదెంత నిజమో ఇప్పుడు తేలిపోవాలి. తేల్చేస్తాను. యుద్ధం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు. నిలిచి ధైర్యంగా పోరాడడం. నిలు! నువ్వో నేనో తేలిపోతుంది. నరకం ఎలా ఉంటుందో చూసి ఎరుగవు. ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు!
వినరాని మాటలవి. విని ప్రజ్వలించాడు కృష్ణుడు. కన్నెర్రచేశాడు. అన్నాడిలా.
అవును! నువ్వో నేనో తేలిపోవాలి, తేల్చుకుందాం, రా! నీ ముందే నిల్చున్నాను, నీకోసమే నిల్చున్నాను, రా! సోల్లుమాటలొద్దు, కార్యశూరులు మాటలాడరు. ప్రయోగించు నీ శస్త్రాస్త్రాలు. తట్టుకోగలనో లేదో నీకే కాదు, నాకూ తెలుస్తుంది.
మాట పూర్తి చెయ్యకుండానే ఎనిమిది బాణాలు ప్రయోగించి, జరాసంధుని గుండెను దెబ్బతీశాడు కృష్ణుడు. అయిదుబాణాలు ప్రయోగించి, సారథిని స్పృహతప్పేలా చేశాడు. అశ్వాలపై అనేక బాణాలు ప్రయోగించాడు. వాటి ధాటికి తట్టుకోలేక అశ్వాలు అటూ ఇటూ పరుగుదీయసాగాయి. అదే అదనుగా సరైన బాణప్రయోగంతో జరాసంధుని విల్లును రెండుముక్కలు చేశాడు బలరాముడు.
తమ రాజు విల్లు విరిగిపోయింది. రాజు నిశ్చేష్టుడయ్యాడు. అది చూసి, కౌశిక చిత్రసేనులు ముందుకురికారు. ఆకాశం అదిరిపోయినట్టుగా గర్జనలు చేశారు. బలరామునిపై మూడు బాణాలూ, కృష్ణునిపై అయిదుబాణాలూ ప్రయోగించారు. మహెూత్సాహంతో పెనుకేకలు వేశారు. ఆ కేకల్ని తట్టుకోలేకపోయాడు బలరాముడు. కోపంతో రగలిపోయాడు. అర్థచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. కౌశికుని విల్లు విరిచాడు. తర్వాత మరో విల్లు అందుకునే అవకాశం ఈయకుండా పుంఖానుపుంఖాలుగా బాణాలు ప్రయోగించి, అతన్ని అచేతనుణ్ణి చేశాడు. అదే అవకాశంగా నాలుగుబాణాలు ఒక్కసారిగా ప్రయోగించి, కౌశికుని గుర్రాలను కూల్చాడు కృష్ణుడు. గుర్రాలు కూలిపోవడంతో రథం విరిగింది. నిలువునా కూలిపోయింది. కిందపడ్డాడు కౌశికుడు. శత్రువుని ఎదుర్కోవాలి. గదను అందుకున్నాడు. ఆ గదతో బలరాముని ఎదుర్కొనేందుకు అటుగా పరుగుదీశాడు. అతన్ని అడ్డుకున్నాడు కృష్ణుడు. అసంఖ్యాకబాణాలు ప్రయోగించి, కౌశికుణ్ణి కదిలేందుకు వీలులేకుండా చేశాడు.
చిత్రసేనుణ్ణి సంహరించేందుకు బలరాముడు శరవర్షం ప్రారంభించాడు. చిత్రసేనునికి ఊపిరి ఆడడంలేదు. అది గమనించాడు జరాసంధుడు. పరుగున అటుగా వచ్చాడు. బాణవర్షం కురిపించి, బలరాముని విల్లు విరిచాడు. ఇంకో విల్లును అందుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. బాణాలు ఒక్కుమ్మడిగా ప్రయోగించి, గర్జించాడు. వీలు చూసుకుని బాణాన్ని అందుకున్నాడు బలరాముడు. శౌర్యావేశంతో సాయక ప్రయోగం చేశాడు. జరాసంధుని ఎదుర్కొన్నాడు. అతడటు జరాసంధుని ఎదుర్కొనడాన్ని గమనించిన చిత్రసేనుడు, సరైన సమయం ఇదేనన్నట్టుగా గదనొకదాన్ని తీసుకుని గురిచూసి బలరామునిమీదికి విసిరాడు.
కౌశికుణ్ణి కదలకుండా నిలబెట్టిన కృష్ణునివైపు పరుగుదీశాడు జరాసంధుడు. అయిదు, ఏడు, ఎనభై, తొంభైబాణాలను ప్రయోగించి, కృష్ణుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. రక్తధారలతో కృష్ణుడు కుప్పకూలిపోయేలా చేశాడు. ఆనందంతో పెద్దగా కేకేశాడు. కుప్పకూలిన కృష్ణుడు తేరుకున్నాడు. లేచి నిల్చున్నాడు. శరీరాన్ని బాధిస్తున్న గాయాలను లెక్కచేయలేదతను. గురి చూసి బల్లెం విసిరి, జరాసంధుని విల్లును రెండుముక్కలు చేశాడు. విరిగిన విల్లుని అవతల పడేసి, గదను అందుకున్నాడు జరాసంధుడు. కిందికి దూకాడు. పరుగున కృష్ణుణ్ణి సమీపించాడు. గదతో అతని గుండెమీద మోదాడు. అడ్డగించినా గద ఆగలేదు. విసురుగావచ్చి గుండెమీద కొండలా పడింది. దాంతో కృష్ణుడు, స్పృహతప్పి నేలకి ఒరిగిపోయాడు. చూశాడది బలరాముడు. ఆందోళనచెందాడు. బలరాముని ఆందోళనా, నేలకు ఒరిగిన కృష్ణుని చూసి, అయిపోయాడు కృష్ణుడు, ప్రాణాలుకోల్పోయాడు అనుకున్నాడు జరాసంధుడు. ఆనందంగా పెద్దగా కేకలువేసి, అటూ ఇటూ తిరగసాగాడు. బలరాముడు అది గమనించి, సహించలేకపోయాడు. ఒకచేత్తో గదనీ, మరోచేత్తో ముసలాయుధాన్నీ పట్టుకుని జరాసంధుణ్ణి ఎదుర్కొన్నాడు. అతని గుండెమీదా, నుదుటిమీదా గాయాలు చేశాడు. దాంతో తల తిరిగినట్టయింది జరాసంధునికి. కూలబడ్డాడు. మోకాళ్ళమీద ఆనుకున్నాడు. అయినా నిలువలేకపోయాడు. స్పృహతప్పి కిందపడ్డాడు. కిందపడుతున్న జరాసంధుణ్ణి చూసి, జబ్బలు చరచిమరీ గర్జించాడు బలరాముడు. అతని గర్జన నలుదెసలా ప్రతిధ్వనించింది.
కాసేపటికి జరాసంధుడు తేరుకున్నాడు. పక్కనున్న గదను అందుకున్నాడు. ఆ గదను చక్రంలా తిప్పుతూ బలరామునిపైకి లంఘించాడు. బలరాముడు అందుకు సిద్ధంగానే ఉన్నాడు. తనగదతో అతన్ని ఎదుర్కొన్నాడు. అతని గదను ముక్కలుముక్కలు చేశాడు. తునాతునకలైన గదను చూసి, చలించలేదు జరాసంధుడు. వెంటనే శక్తి అనే ఆయుధాన్ని అందుకున్నాడు. దానిని బలరామునిపై ప్రయోగించాడు. వెంటనే గదను ఒకటి విసిరాడు అతనిపైకి. ఆపై మరో శక్తిని ప్రయోగించాడు. మూడు ఆయుధాలను వెంటవెంటనే ప్రయోగించి, చాలదన్నట్టు కుడిచేతిని పిడికిలిచేసి, బలరామునిపొట్టలో ఒక్కపోటు పొడిచాడు జరాసంధుడు. ఆ దెబ్బకు బలరాముడు స్పృహకోల్పోయాడు. నేలమీద పడిపోయాడు. ఆకాశంలోని దేవతలు అది చూసి ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో అని బాధపడ్డారు.
కృష్ణుడు అప్పటికి తేరుకున్నాడు. అన్న బలరామునికోసం చూశాడు. అతడు స్పృహతప్పి పడి ఉండడాన్ని గమనించాడు. కోపంతో అనేకబాణాలు ప్రయోగించాడు. జరాసంధుణ్ణి గాయపరిచాడు. గాయాలకు బెదరలేదు జరాసంధుడు. కృష్ణునిపై శక్తిని ప్రయోగించి, ఎలుగెత్తి గర్జించాడు. వస్తున్న శక్తిని మార్గమధ్యంలోనే అందుకున్నాడు కృష్ణుడు. అందుకుని, దానినే జరాసంధునిపైకి ప్రయోగించాడు. అతన్ని స్పృహతప్పేలా చేశాడు. స్పృహతప్పేవాడే జరా సంధుడు. అయితే తల విదిల్చి తేరుకున్నాడు. తేరుకుని పరిఘాయుధాన్ని కృష్ణునిపైకి ప్రయో గించాడు. ఆ పరిఘాయుధాన్ని కృష్ణుడు శార్థం ప్రయోగించి, తునాతునకలు చేశాడు. ఇకప్పుడు చేసేదిలేక నిశ్చేష్టుడయ్యాడు జరాసంధుడు.
ఆసరికి బలరాముడు తేరుకున్నాడు. లేచి జరాసంధునికోసం చూశాడు. కనిపించాడతను. కోపంగా అన్నాడిలా.
ఇక నీ చావు తప్పదు! జరాసంధా కాచుకో!
పరుగుదీశాడటువైపు. వస్తున్న బలరాముణ్ణి అడ్డుకున్నాడు దరదుడు. అన్నాడిలా.
బలరామా! జరాసంధుని సంహరించడం నీవల్లకాదు. అతడు మహాశౌర్యశాలి. మేరు ధీరుడు. ముందు నన్ను ఎదిరించు! తర్వాత మారాజు సంగతి చూద్దూగాని,
రా అయితే! అన్నాడు బలరాముడు. నాగలితో ఎదుర్కొన్నాడతన్ని. దరదుడు పరిఘా యుధంతో విరుచుకుపడ్డాడు. ఇద్దరిమధ్యా భీకరయుద్ధం జరిగింది. రెండు ఏనుగులు కోట్లాడుకున్నట్టుగానే కోట్లాడుకున్నారిద్దరూ. ఆఖరికి నాగలిని దరదుని వీపునకు గుచ్చి, అతన్ని కిందకి పడవేశాడు బలరాముడు. కిందపడ్డ దరదుని పైకెక్కి కాళ్ళతో కుమ్మికుమ్మివేశాడు. రక్తంకక్కుకుని దరదుడు మరణించాడప్పుడు. జరిగినదంతా జరాసంధునిసహా మిగిలిన సామంతులంతా చూశారు. భయపడ్డారు. పారిపోయారక్కణ్ణుంచి. పారిపోతున్న సామంతులను చూస్తూ, ఏం చెయ్యాలో పాలుపోక నిల్చున్న జరాసంధుని పైకి కౌమోదకితో దాడిచేశాడు కృష్ణుడు. అతని ఎముకలన్నీ పగిలేట్టుగా దెబ్బతీశాడు. ఊహించని మెరుపుదాడి. తిరిగి ఎదుర్కొనే సత్తాలేకపోయింది. జరాసంధుడు కిందపడ్డాడు. కిందపడ్డ జరాసంధుని మీదికి ఉరికి, పిడికిటిపోట్లతోనూ, కాళ్ళతోనూ మర్దించాడు కృష్ణుడు. బలరాముడు అది చూసి ఆనందించసాగాడు. ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. వీలుచిక్కట్లేదు. దెబ్బలుతింటూ స్పృహ కోల్పోయాడు జరాసంధుడు. అంతలోనే తేరుకున్నాడు. ఆసరికి వీలుచిక్కింది. లేచి, రథాన్నీ, ఆయుధాల్ని కూడా పట్టించుకోకుండా పరుగుదీశాడు జరాసంధుడు. రణాంగణం నుండి దూరంగా పారిపోయాడు. ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధరంగంనుండి పారిపోయాడో అప్పుడు సామంతరాజులు కూడా పరుగుదీసి అరణ్య మధ్యానికి చేరుకున్నారు. అక్కడా ఇక్కడా దాగుని ప్రాణాలు దక్కించుకున్నారు. రాజులు పారిపోతే సైన్యం ఉంటుందా? వారూ పలాయనం చేశారు. నలువైపులా చెదరిపోయారు.
తరువాయి భాగం
సృగాలవాసుదేవుని సంహారం: మధురప్రవేశం
ప్లీజ్ లైక్ అండ్ షేర్ 🙏 🙏 🙏 🙏 🙏
🙏 నమస్కారం మిత్రులారా…
నేను మీకోసం హరివంశము కథలను
శ్రద్ధగా, భక్తితో అందిస్తున్నాను.
ఈ ప్రయత్నం మీకు నచ్చితే,
ఈ కథలు కొనసాగాలి అనుకుంటే,
👉 దయచేసి ఈ పోస్ట్‌కి Facebook Stars పంపించి
మీ ప్రోత్సాహం తెలియజేయండి.
మీ ప్రతి స్టార్ నాకు ఒక ఆశీర్వాదం లాంటిది.
🙏 ధన్యవాదాలు…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి