🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷గురువారం 5 ఫిబ్రవరి 2026🌷*
_*మాఘ పురాణం - 18వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*5వ తేదీ గురువారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
మాఘ పురాణం పద్ధెనిమిదవ అధ్యాయంలో,
శ్రీ మహా విష్ణువు దేవతలతో మాఘమాస మహిమను వివరించాడు.
మాఘ పూర్ణిమ నాడు స్నానం, పూజ చేసిన వారి పాపాలు నశిస్తాయని, మాఘమాస వ్రతం ఆచరించిన వారు వైకుంఠం చేరుతారని చెప్పాడు. .
*ఇంద్రుని శాపవిముక్తి*```
శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.
మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ ఇలా సర్వ నదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానము చేసిన వచ్చు పుణ్యము, మూడు దినములు అరుణోదయ సమయమందు మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మొదలగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను..
దేవతలు విష్ణు వాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరుకొనిరి. ఇంద్రుని వెదకుతూ ఉన్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.
పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి “మానవ జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యము నందు భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని” తలంచెను. పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లి తండ్రులు ఇద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.
నేనును బంధువుల వద్దనే ఉంటిని, వారి నిరాదరణ ఫలితముగ చూచు వారెవరును లేక పోవుటచే భిక్షాటనముచే జీవించుచూ ఉంటిని.
నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార వంతురాలనై జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.
పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనొందితిని, పెక్కు బాధలను పడితిని. ఒక నాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్న వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వము పొంది దేవప్రియ అను పేరును గాంచెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలు ఇంద్రుని చూసి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను, ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.
ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమద మహర్షి జహ్ను మునికి యీ విధముగ మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా జహ్ను ముని, స్వామీ! ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలెనని ఉన్నది, ఇంకను చెప్పమని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను.
ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగునవి చేయుచు శిష్యులకు మాఘమాస మహత్త్యమును వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను, చేయక పోవుటవలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపా జలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం పద్దెనిమిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి