యోగ వాశిష్ఠ హృదయం-2
2. గ్రంథపఠనార్హత
గ్రంథావిర్భావ క్రమాన్ని ఈ ప్రకారంగా వర్ణించటంవల్ల మనబోటివాళ్ళకి ఏమనిపిస్తుందంటే “ఆనాటి భరద్వాజ మునికుమారుడి లాగా అనేక దివ్య శక్తులు సాధించి, సాక్షాత్తుగా బ్రహ్మగారితో మాట్లాడగలిగేటంత శక్తి సంపాదించిన వారికోసం మాత్రమే ఈ గ్రంథం వ్రాయబడిందన్న మాట. అయితే ఈ గ్రంథాన్ని ముట్టుకొనేందుకు మనకు అర్హత ఎక్కడ వుంటుంది?" అని. ఈ సందేహంతో మనం ఆ పుస్తకాన్ని ముట్టుకొనే ముట్టుకోం. కానీ, వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం అది కాదు.
ఈ గ్రంథ రచనలో తనయొక్క కర్తృత్వం నామమాత్రమేనని, సాక్షాత్తు బ్రహ్మగారియొక్క సంకల్పబలంవల్లనే ఈ గ్రంథం ఆవిర్భవించిందని, సవినయంగా చెప్పుకోవాలన్నదే వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం. అందుకే ఆ ఘట్టాన్ని ఆయన మనకు చెప్పాడు. ఉద్దేశ్యం బాగానే వుంది కానీ, "ఈఘట్టంవల్ల ఈ గ్రంథానికి మనం పనికిరాం బాబూ" అనే అపార్థం కలిగే సావకాశం వచ్చింది. దాన్ని పోగొట్టటం కోసం మరొక సన్నివేశాన్ని ఈ గ్రంథారంభంలోనే వాల్మీకి మహర్షి వర్ణించాడు.
3. అరిష్టనేమి కథ
పై సంఘటనకు కొద్ది కాలం తరువాత. అరిష్టనేమి అనే మహారాజు పెద్దవాడై రాజ్యం కొడుకులకు అప్పచెప్పి, తాను తపోవనాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన మంచి తీవ్ర తపోనిష్ఠలో కాలం గడపసాగాడు. దేవేంద్రుడికి ఈ వ్యవహారం తెలిసింది. ఎవరైనా తీవ్ర తపస్సులు చేస్తూ వుంటే, వారిని పరీక్షించవలసిన బాధ్యత దేవరాజుగా ఇంద్రుడికి వుంది. ఈ విషయం తెలియక, ఈ కాలంలో కొందరు, దేవేంద్రుడు అసూయాగ్రస్తుడని చులకన చేసి మాట్లాడుతూ వుంటారు. ఇప్పుడు చెప్పబోయే కథలో ఇంద్రుడియొక్క పరీక్షాతత్త్వం కూడా మనకు అవగతం అవుతుంది.
అరిష్టనేమి మహారాజుయొక్క తపస్సు ఒక స్థాయికి వచ్చేసరికి, దేవేంద్రుడు ఒక దేవదూతతో ఒక విమానాన్ని పంపి, “హే రాజర్షీ! నీకు సశరీరంగా స్వర్గంలో నివసించే యోగ్యత వచ్చింది. కనుక ఈ దేవ విమానం మీద సరాసరి స్వర్గానికి విచ్చేయ వలసింది" అని కబురు చేశాడు. ఆ దేవదూత వచ్చి ఎంతో వినయంగానూ, ఆదరంగానూ, ఈ వార్త ఆ మహారాజుకు చెప్పాడు. అయితే ముసలి మహారాజు చాలా గట్టివాడు. ఆయన దేవదూతకి, దేవేంద్రుడికి, కూడా చాలా వినయంగా కృతజ్ఞతలు చెప్పి, మెల్లిగా ఇలా అన్నాడు. "అయ్యా! దేవదూతా! మీ స్వర్గంలోవుండే విశేషాలేమిటి? ఈ భూమికంటే స్వర్గంలో వున్న గొప్పతన మేమిటి? ఆ స్వర్గంలో నన్ను శాశ్వతంగా వుండనిస్తారా? మధ్యలో పంపేటట్లయితే ఆ పంపే విధానమేమిటి?”
ఇది విని దేవదూత కొద్దిగా ఆలోచించి ఇలా చెప్పాడు. “రాజేంద్రా! నువ్వుతపస్సులో వున్నావు. కనుక, నీ దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వర్గం సుఖాల మయం. భూలోకంలో చేసుకొన్న పుణ్యాన్నిబట్టి, స్వర్గలోకంలో సుఖాల స్థాయి పెరిగిపోతూ వుంటుంది. అయితే, స్వర్గంలో అసూయల బాధ ఒకటి కనిపిస్తూ వుంటుంది. దానివల్ల ఒకోసారి పోట్లాటలు, కొట్లాటలు కూడా వుంటూ వుంటాయి. ఎక్కువవాళ్ళకు తక్కువ వాళ్ళను చూస్తే సంతోషం. తక్కువవాళ్ళకు ఎక్కువవాళ్ళను చూస్తే కడుపు మంట. తమకు ఎంత పుణ్యం మిగిలివుందో ఎవరికీ తెలియదు. పుణ్యం అయిపోయిన రోజున, వున్నట్టుండి స్వర్గం నుంచి గెంటిపారేస్తూ వుంటారు. ఆ సమయం వచ్చేసరికి వెళ్ళం అని మొండికెత్తి, మెడబట్టి గెంటించుకొని, ఏడుస్తూ అవతలికి పోతూ వుంటారు. కనుక, మహారాజా! శాశ్వతంగా స్వర్గంలో స్థానం నీకే కాదు. ఎవరికీ వుండదు. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తూ పోవలసిందే. నువ్వైనా అంతే. నేనైనా అంతే. స్వర్గంలోకి వచ్చాక మాత్రం సుఖాల్లోపడి కొట్టుకుపోవడమే తప్ప, ఇక వేరే తపస్సులు, ఏమీ కుదరవు. సంగ్రహంగా ఇవీ విషయాలు. ఇక విమానం ఎక్కండి."
దేవదూత చెప్పిన అంశాలన్నీ విని, అరిష్టనేమి మహారాజు పెద్ద నమస్కారం పెట్టి, ఇలా అన్నాడు. "దేవదూతా! మీ స్వర్గానికో దండం. నీకో దండం. మీ దేవేంద్రుడికో దండం. అలాంటి స్వర్గం నాకు వద్దే వద్దు. శరీరం వున్నంత కాలం ఇక్కడే తపస్సు చేసుకొంటూ పడుంటాను. చేతనైతే ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యం పొందుతాను. చేతకాకపోతే మళ్ళీ జన్మ ఎత్తి, మళ్ళీ తపస్సే చేస్తాను. నాకు భూలోక రాజ్యాలూ వద్దు, స్వర్గలోక రాజ్యాలూ వద్దు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నన్ను ఆశీర్వదించు. దేవేంద్రులవారి ఆశీస్సులు ప్రార్థిస్తున్నానని మనవి చేయి.”
ఇది విని, “ఇదెక్కడి వెఱి మారాజు రా! బాబూ!" అనుకొంటూ, దేవదూత వెనక్కి వెళ్ళి, జరిగిందంతా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడికి చాలా ఆనందమయింది.
అరిష్టనేమి రాజు నిజాయితీ, నిష్కామత, నిర్మలత, ఆయనకు బాగా నచ్చాయి. ఆ రాజుకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. ఇదే దేవేంద్ర పదవిలోని బాధ్యత. ఎవరైతే నిష్కామంగా తపస్సు చేస్తారో, వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎవరైతే సకామంగా తపస్సు చేస్తారో, వారి విషయంలో ఆయన పరిశోధన చేస్తాడు. ఏమని పరిశోధన? వీడి కోరిక లోకానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అని. కీడు చేస్తుంద తపస్సును చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తాడు.
అలా కాక, ఆ తపస్సు లోకానికి మేలు చేస్తుంది అనుకొంటే, ఆ వరాన్ని పొందే యోగ్యత ఈ వ్యక్తికి వుందా, లేదా అని, బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లు, ఆ తపస్విని పరీక్షలకు గురి చేస్తాడు. ఇది దేవేంద్రుడి బాధ్యతా విధానం. ప్రస్తుత సందర్భంలో అరిష్టనేమి మహారాజు నిస్స్వార్థంగా తపస్సు చేస్తున్నాడని తేలిపోయింది. కనుక, ఆయనకు సహాయం చెయ్యవలసిన బాధ్యత దేవేంద్రుడి పైన పడ్డది.
పూర్వం మేరు శిఖరం మీద దేవసభలో భరద్వాజ మునికుమారుడు శ్రీమద్రామాయణం గానం చేసిన సందర్భం ఆయనకు గుర్తుకొచ్చింది. ఆ మహాసభలో సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు, ఇంకా పూర్తికాని యోగవాశిష్ఠ గ్రంథాన్ని గూర్చి అంత గొప్పగా మాట్లాడే సరికి, దేవేంద్రుడి దృష్టి ఆ గ్రంథం మీద పడ్డది. అందువల్ల, వాల్మీకి మహర్షి ఆ గ్రంథంలో ఏమి వ్రాశాడా అని, దేవేంద్రుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే వున్నాడు. పరిశీలించి, ఎప్పటికప్పుడు పరమానందపడుతూనే వున్నాడు. ఇప్పుడు అరిష్టనేమి విషయంలో దేవేంద్రుడికి ఆ గ్రంథం మాట గుర్తొచ్చింది. అందువల్ల దేవేంద్రుడు ఆ దేవదూతతో ఇలా అన్నాడు. "నువ్వు వెంటనే అదే విమానంలో ఆ రాజు దగ్గరకే వెళ్ళు. ఆయనను ఎక్కించుకొని వాల్మీకి మహర్షిగారికి ఆయనను అప్పచెప్పు. వీరికి ఆయన వ్రాసిన యోగవాశిష్ఠం ఉపదేశించమని నేను ప్రార్థిస్తున్నానని వాల్మీకి మహర్షి గారికి మనవి చెయ్యి.”
దేవదూత సరే అని, మళ్ళీ అరిష్టనేమి మహారాజు దగ్గరకు వచ్చి, ఆయనను వాల్మీకిమహర్షికి అప్పజెప్పి, తాను వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కూడా దేవేంద్రుడి ఉపకారానికి చాలా సంతోషపడి, వాల్మీకి మహర్షి పాదాల మీద పడి, “ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే" అంటూ తనను శిష్యుడిగా స్వీకరించి, తత్త్వబోధ చేయవలసిందిగా ప్రార్థించాడు. వాల్మీకి మహర్షి ఆయనకు తాను రచించిన ఈ యోగవాశిష్ఠ మహాగ్రంథాన్ని అనుపూర్విగా ఉపదేశించాడు.
ఈ ఘట్టాన్ని చెప్పడంవల్ల నిష్కామ ప్రవృత్తి గల మానవులందరికీ ఈ యోగవాశిష్ఠ గ్రంథం పఠనార్హమే అనే విషయం చెప్పినట్లయింది. కాగా, నిష్కామత్వాన్ని అభ్యసించకపోతే వేదాంతవిద్య మనస్సుకు ఎక్కదనే విషయం కూడా చెప్పినట్లయింది. అంత వరకూ బాగానే వుంది కానీ, ఈ కథవల్ల కూడా మనకు ఒక చిక్కు వచ్చి పడుతోంది. అరిష్టనేమి మహారాజు లాగా సశరీర స్వర్గం వచ్చేటంత తపస్సు చేసినాకనే ఈ గ్రంథం పఠించడానికి యోగ్యత వస్తుందని, ఈ కథ సూచిస్తోంది. అప్పుడు కూడా, దేవ విమానం ఎదురుగుండా వచ్చినా సరే, వద్దు పొమ్మని తిరస్కరించేటంత వైరాగ్యం వుంటేనే, ఈ గ్రంథం ముట్టుకోవాలి- అని కూడా ఈ కథ సూచన చేస్తోంది.
మరి మనం ఎక్కడున్నాం? ఈ షరతులకు మనం సరిపోతామా? ఈ గ్రంథానికో దండం- అనుకొనే ప్రమాదం ఈ అరిష్టనేమి కథవల్ల మనకు కలుగుతోంది. దీనిని నివారించేందుకోసం వాల్మీకి మహర్షి మరో చిన్న సన్నివేశాన్ని కూడా గ్రంథారంభంలో చేర్చాడు.
4. అగ్నివేశ్యుడు- కారుణ్య కుమారుడు
“అగ్నివేశ్యుడు” అని ఒక సత్పురుషుడు వుండేవాడు. ఆయన గృహస్థుడు. కానీ, నిరంతరం తపస్సీలి గా వుండేవాడు. ఆయనకు "కారుణ్యుడు" అని ఒక కొడుకు వుండేవాడు. వాడు తెలివైన వాడు. చిన్న వయస్సులోనే విద్యలన్నీ పూర్తి చేసి, గురుకులంనుంచి ఇంటికి వచ్చాడు. ఇంకా వివాహం కాలేదు. ఈ పిల్లవాడు చదువు పూర్తి చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచీ విచిత్రంగా వుంటున్నాడు. కనీసం నిత్యపూజలు కూడా చేయడం లేదు. ఎప్పుడూ బద్దకంగా పడుకొంటున్నాడు. మనిషిలో ఉల్లాసమే కనిపించటం లేదు. చూసి చూసి, ఒకరోజు తండ్రి అతనిని నిగ్గదీశాడు. అతడు మెల్లిగా తన మనస్సులో వున్న కల్లోలాన్ని వివరించసాగాడు-
“కుర్వన్నేవేహ కర్మాణి
జిజీవిషే చ్ఛతగ్ం సమాః - అని వేదంలో ఒకచోట వుంది.
ఇలా శాస్త్రాలలోనూ, వేదాలలోనూ, కొన్ని చోట్ల మనిషి మరణించే దాకా సత్కర్మలు చేస్తూనే వుండాలి అని వుంది. వాటిల్లోనే మరికొన్ని చోట్ల -
న కర్మణా న ప్రజయా ధనేన
త్యాగేనైకే అమృతత్వమానశుః” అని వుంది.
అంటే చిట్టచివరి ఫలితమైన మోక్షం ఎన్ని కర్మలు చేసినా రాదని ఈ వాక్యం చెబుతోంది. నేను అన్ని వేదాలూ చదివాను. అన్ని శాస్త్రాలూ చదివాను. ప్రతిచోటా ఈ విషయంలో సందేహమే వస్తోంది. అందువల్ల ఏ కర్మలూ లేకుండా, ఏ వేదాంతాలూ లేకుండా, మౌనంగా వుంటున్నాను" అన్నాడు కుర్రవాడు.
అతని మాటలు విని తండ్రి బాగా ఆలోచించి, ఇలా అన్నాడు. “నాయనా! ఈ విషయంలో నీకు సంపూర్ణమైన సమన్వయాన్ని ప్రదర్శించ గల ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించిన యోగవాశిష్ఠం మాత్రమే.
నీకు నేను ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను. అది విన్నాక నీకు ఎలా తోస్తే అలా చేయి.”
ఆ విధంగా తండ్రి అయిన అగ్నివేశ్యుడి ద్వారా ఈ గ్రంథాన్ని ఉపదేశం పొందిన కారుణ్య కుమారుడు, సమన్వయాన్ని బాగా గ్రహించి, ముందు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధిని సాధించి, ఆ పైన జ్ఞానయోగం ద్వారా జీవన్ముక్తి సాధించాడు.
ఈ కథ ద్వార వాల్మీకి మహర్షి చెప్పదలచింది ఏమంటే? “ఈ యోగవాశిష్ఠం శ్రవణం చెయ్యటానికి విద్యావంతులై, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారందరూ అర్హులే" అని ఇంతవరకు చెప్పిన కథలవల్ల ఈ గ్రంథం బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికీ, కూడా సమ్మతమైనదనీ, అరిష్టనేమి వంటి ఉత్తమస్థాయి సాధకులకు, కారుణ్య కుమారుడి వంటి సామాన్య సాధకులకు అందరికీ కూడా ఉపయోగపడే గ్రంథమే- అని తేలుతోంది.
5. గ్రంథ ప్రాశస్త్యము
అయితే, ఎక్కడో స్వర్గంలో వున్నవారి మాట మనకు సరీగా తెలియదు. వాల్మీకి నాటి సాటి మహర్షులు, పండితులు, ఈ గ్రంథాన్ని గురించి ఏమని భావించేవారో మనకు తెలిస్తే, అప్పుడు మనకు ఈ గ్రంథం మీద ప్రామాణిక బుద్ధి ఏర్పడుతుంది. అందుకోసం, వాల్మీకిమహర్షి అలాంటి ఘట్టాన్ని ఒక దానిని ఈ గ్రంథంలో మొదట చేర్చాడు.
పూర్వరామాయణంలో, అరణ్యకాండలో, వనవాస సమయంలో, శ్రీరాముడు యే యే మహాత్ములను దర్శించాడో ఆ వివరాలు కొన్ని వున్నాయి. భారతదేశ దక్షిణాపథాన ఆ నాటి సుప్రసిద్ధ మహర్షులలో అగస్త్యమహర్షి అత్యంత ప్రముఖుడని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్రేతాయుగ ప్రారంభంలోనే దండక
మహారాజుకు సంక్రమించిన గురుశాపంవల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యలో దండకారణ్యమనే భయంకర అరణ్యం ఏర్పడింది. ఈ అరణ్యంవల్ల దక్షిణ భారతదేశం ఆనాటి రాక్షసులకు స్థావరంగా మారింది. దానివల్ల దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చింది. ఈ పరిస్థితిని సరి చేయటం కోసం, ఆ నాటి మహర్షులెందరో రాజకీయాలకు రాజులకు, అతీతంగా కృషిచేశారు. వారిలో అగస్త్యమహర్షి చాలా ప్రముఖుడు.
ఆయన కృష్ణా, కావేరీ, గోదావరీ నదీ తీరాల వెంట పాద సంచారాలు చేసి, లెక్కకు మించిన స్థలాలలో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేసి, ఆ యా ప్రాంతీయ భాషలకు సాంస్కృతిక జీవనం పోసి, సనాతన ధర్మోద్ధరణకై అపార కృషి చేశాడు. అది గాక కొన్ని వేలమంది సాధకులకు సాధన మార్గ నిర్దేశనం చేశాడు.
శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస క్రమంలో అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా దర్శించాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి
సుతీక్షణం చాప్యగస్త్యం చ
అగస్త్య భ్రాతరం తథా|| అని ముగ్గురి పేర్లు వరుసగా చెప్పాడు.
సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, అగస్త్యభ్రాత, అని. వీరిలో అగస్త్య భ్రాత పేరేమో ఇంతవరు మనకు తెలియదు. అందుకనే విద్యావంతులై కూడా పేరు ప్రతిష్ఠలు లేకుండా వున్నవారిని "అగస్త్యభ్రాతలు" అనటం . పండితులలో సామెతగా మారిపోయింది. అగస్త్యుడు సుప్రసిద్ధుడే.(సశేషము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి